- గచ్చిబౌలి భవనాన్ని పరిశీలించిన జడ్జీలు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజనకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా ఇటీవల ఏర్పాటు చేసిన న్యాయమూర్తుల కమిటీ తన పని ప్రారంభించింది. కమిటీ చైర్మన్ జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ బోస్లే నేతృత్వంలో సభ్యులు జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఖండవల్లి చంద్రభాను, జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి సోమవారం గచ్చిబౌలి వెళ్లి ప్రతిపాదిత హైకోర్టు భవనాన్ని పరిశీలించారు. గంటపాటు అక్కడ గడిపారు.
భవనానికి సంబంధించిన డ్రాయింగ్‌లు, మ్యాపులను తెప్పించుకుని, వాటి ఆధారంగా అధికారులను అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రతి ఫ్లోర్‌కూ వెళ్లి అక్కడి సదుపాయాలను పరిశీలించి, వాటిపై అధికారులను ఆరా తీశారు. హైకోర్టు విభజనకు సంబంధించిన ఈ వ్యవహారాలన్నింటినీ గోప్యంగా ఉంచాలని కమిటీ నిర్ణయించింది. అవసరమైతే మరోసారి భవనాన్ని సందర్శించాలని కమిటీ భావిస్తోంది. తర్వాత దీనిపై కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా సీజే తన అభిప్రాయాన్ని కేంద్రానికి వివరించవచ్చని న్యాయ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవలే వెళ్లొచ్చిన సీజే...
గచ్చిబౌలి భవనాన్ని జస్టిస్ సేన్‌గుప్తా కూడా గత వారం స్వయంగా వెళ్లి చూసొచ్చారు. తెలంగాణ అడ్వకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డిని కూడా వెంటబెట్టుకు వెళ్లినట్లు తెలిసింది. ఆ తర్వాతే... హైకోర్టు విభజన వ్యవహారంతో పాటు, గచ్చిబౌలి భవనం తెలంగాణ హైకోర్టు ఏర్పాటునకు సరిపోతుందో లేదో తేల్చేందుకు జస్టిస్ బోస్లే నేతృత్వంలో కమిటీ వేశారు. హైకోర్టును విభజించి తెలంగాణ హైకోర్టును ఏర్పాటు చేయాలని, అందుకు గచ్చిబౌలిలో భవనం కూడా సిద్ధంగా ఉందని పేర్కొంటూ కేంద్ర న్యాయ మంత్రి సదానంద గౌడకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు లేఖ రాయడం... ఈ దిశగా చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు సీజేకు గౌడ లేఖ రాయడం తెలిసిందే.