ప్రస్తుత హైకోర్టు.. తెలంగాణ ఆస్తి | Telagana property of the current High Court .. | Sakshi
Sakshi News home page

ప్రస్తుత హైకోర్టు.. తెలంగాణ ఆస్తి

Published Tue, Mar 24 2015 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 11:16 PM

Telagana property of the current High Court ..

  • కొత్తగా రావాల్సింది ఏపీకేనన్న హైకోర్టు ధర్మాసనం
  • అప్పటివరకు రెండు రాష్ట్రాలకూ ఉమ్మడి హైకోర్టు
  • తెలంగాణకు కోర్టు కావాలనడం విభజన చట్టానికి విరుద్ధం
  • కేంద్ర న్యాయ మంత్రి రాసిన లేఖ సెక్షన్ 31కి వ్యతిరేకం
  • మంత్రి లేఖనైనా సవరించాలి లేక పునర్విభజన చట్టాన్నైనా మార్చాలి
  • ఇప్పటివరకు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ అందించాలని రిజిస్ట్రీకి ఆదేశం
  • చట్టంలో నిర్దిష్ట కాలపరిమితి లేనప్పుడు జాప్యమన్న ప్రసక్తే లేదని వ్యాఖ్య
  • హైకోర్టు విభజనపై కౌంటర్లు వేయాలని కేంద్రం, ఇరు రాష్ట్రాలకు ఆదేశం
  • సమాధానాన్ని బట్టే నిర్ణయం తీసుకుంటామన్న ధర్మాసనం
  • తీర్పు ఏదైనా న్యాయవాదులు ఆందోళనలు చేపట్టరాదని హితవు
  • జరగరానిది జరిగితే కోర్టు ధిక్కార చర్యలు తప్పవని హెచ్చరిక
  • విచారణలో అమికస్ క్యూరీలుగా మనోహర్, విద్యాసాగర్ నియామకం

  • సాక్షి, హైదరాబాద్: ‘విభజన చట్టం ప్రకారం ప్రస్తుత హైకోర్టును తెలంగాణ ఆస్తిగానే భావించాలి.. కొత్తగా ఏర్పాటు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టే’ అని రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు విభజన విషయంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ రాసిన లేఖను తప్పుబట్టింది. ఈ అంశానికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలను తమ ముందుంచాలని కోర్టు రిజిస్ట్రీని సోమవారం ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. దీనిపై లోతుగా విచారణ చేపట్టాల్సిన అవసరముందని అభిప్రాయపడింది.

    ఇందుకోసం సీనియర్ న్యాయవాదులు ఇ.మనోహర్, జి.విద్యాసాగర్‌ను కోర్టు సహాయకులు(అమికస్ క్యూరీ)గా నియమించింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్రంతోపాటు ఇరు రాష్ర్ట ప్రభుత్వాలను ఆదేశించింది. హైకోర్టు విభజనకు తక్షణమే చర్యలు చేపట్టేలా కేంద్రంతోపాటు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త టి.ధన్‌గోపాల్‌రావు హైకోర్టులో గత వారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు.

    దీని విచారణ సందర్భంగా హైకోర్టుకు ఇటీవల కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ రాసిన లేఖపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘తెలంగాణ హైకోర్టు ఏర్పాటు విషయాన్ని పరిశీలించాలనడం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్ధం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌కు హైకోర్టు ఏర్పాటయ్యే వరకు ప్రస్తుత హైకోర్టే ఇరు రాష్ట్రాలకూ ఉమ్మడి హైకోర్టుగా ఉంటుంది. హైదరాబాద్‌లో ఉన్న ప్రస్తుత హైకోర్టును చట్ట ప్రకారం తెలంగాణ ఆస్తిగా భావించాల్సి ఉంటుంది. కొత్తగా ఏర్పాటు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టే. దీని ప్రకారం న్యాయ శాఖ మంత్రి లేఖనైనా సవరించాలి. లేకపోతే పునర్విభజన చట్టాన్నైనా సవరించాలి’ అని వ్యాఖ్యానించింది.
     
    కౌంటర్లు పరిశీలించాకే నిర్ణయం

    తొలుత పిటిషనర్ ధన్‌గోపాల్‌రావు వాదనలు వినిపిస్తూ.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విభజనలో ఆలస్యం జరుగుతోందని, ఈ విషయంలో తక్షణమే చర్యలు చేపట్టేందుకు ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. ఇందుకు పునర్విభజన చట్టంలో నిర్దిష్ట కాల పరిమితేమీ లేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. పునర్విభజన చట్టంలో నిర్దిష్ట కాల పరిమితి లేనప్పుడు, ఇక ఆలస్యమన్న మాటే ఉత్పన్నం కాదని వ్యాఖ్యానించింది. వెంటనే తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకుంటూ.. సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానందగౌడ గత వారం రాసిన లేఖ విషయాన్ని ప్రస్తావించారు.

    తెలంగాణకు హైకోర్టు ఏర్పాటు విషయాన్ని చూడాలని అందులో కోరినట్లు పేర్కొంటూ... ఆ లేఖను ధర్మాసనం ముందుంచారు. దాన్ని పరిశీలించిన ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ఆ లేఖ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 31కి విరుద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోందంటూ పలు వ్యాఖ్యలు చేసింది. ఏదేమైనా ఈ వ్యవహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కౌంటర్లను పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫు న్యాయవాదులను ఆదేశిస్తుండగా, ఏపీ ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ జోక్యం చేసుకున్నారు.

    హైకోర్టు విభజనపై ఏపీ సర్కారు ఇప్పటికే తన అభిప్రాయాలను సుప్రీంకోర్టుకు విన్నవించినట్లు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అయితే ఏం చెప్పినా కౌంటర్‌లోనే చెప్పాలని కోర్టు స్పష్టం చేసింది. అలాగే ఈ కేసులో తీర్పు ఏదైనప్పటికీ న్యాయవాదులు ఏ రకంగానూ ఆందోళనలు చేయడానికి వీల్లేదని, ఏదైనా జరగరానిది జరిగితే న్యాయవాదులపై కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. విభజనకు సంబంధించి హైకోర్టులో జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలను తమ మందుంచాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement