ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయండి
న్యాయమంత్రి సదానందకు కాంగ్రెస్ బృందం వినతి
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి హైకోర్టును విభజించి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని, న్యాయాధికారుల కేటాయింపుల్లో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించాలని కేంద్ర న్యాయమంత్రి సదానంద గౌడకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, ఎంపీలు రాపోలు ఆనంద భాస్కర్, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, లీగల్ సెల్ నేత సి.దామోదర్ రెడ్డి, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డితో కూడిన ప్రతినిధి బృందం బుధవారం న్యాయమంత్రిని కలిసింది. హైకోర్టు విభజన అంశంపై మంగళవారమే గవర్నర్‌తో మాట్లాడానని, బుధవారం సాయంత్రం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో భేటీ అయి సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని మంత్రి సదానంద హామీ ఇచ్చారని ప్రతినిధి బృందం మీడియాకు తెలిపింది.
భేటీ అనంతరం షబ్బీర్ అలీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘హైకోర్టు విభజనలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నాటకీయంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడి రెండేళ్లయినా తెలంగాణ న్యాయవాదులు ఇంకా రోడ్లపై ఉండటానికి కేసీఆరే కారణం. ఇప్పటి వరకు ఉమ్మడి హైకోర్టును విభజించకపోవడం బాధాకరం. ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకుని విభజన చేసుకునే అంశాన్ని ఎందుకు కేంద్రంపై రుద్దుతారని మంత్రి అంటున్నారు. పార్లమెంటులో బీజేపీకి బిల్లుల విషయంలో టీఆర్‌ఎస్ మద్దతు తెలుపుతోంది. వాటిని అడ్డుకుని కేంద్రానికి తమ నిరసన తెలపాలి. మేం టీఆర్‌ఎస్ నిరసనకు పార్లమెంటులో మద్దతు తెలుపుతాం..’ అని చెప్పారు.