హైకోర్టు విభజనపై ముగిసిన వాదనలు
- తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజనకోసం దాఖలైన వ్యాజ్యాలపై వాదనలు శుక్రవారం ముగిశాయి. ఈ వ్యాజ్యాలపై రాతపూర్వక వాదనలను స్వీకరించేందుకు వీలుగా ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
హైకోర్టు విభజనకు తక్షణమే చర్యలు చేపట్టేలా కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన టి.ధన్‌గోపాల్‌రావు హైకోర్టులో గత వారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోనే హైకోర్టు ఏర్పాటుకు ఆదేశాలివ్వాలంటూ ఏపీ హైకోర్టు సాధన సమితి కన్వీనర్ ప్రసాద్‌బాబు, ప్రస్తుతమున్న చోటనే 2 రాష్ట్రాల హైకోర్టులను ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలంటూ న్యాయవాది టి.అమర్‌నాథ్‌గౌడ్‌లు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాలన్నింటినీ ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం వాటిని శుక్రవారం మరోసారి విచారించింది. 1956 పునర్విభజన చట్టానికి, 2014 పునర్విభజన చట్టానికి మధ్య ఉన్న వైరుధ్యాలను ప్రసాద్‌బాబు తరఫు న్యాయవాది ఎం.వి.రాజారాం వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యాజ్యాలపై వాదనలు ముగిశాయని, వాదనలు వినిపించిన వారంతా లిఖితపూర్వక వాదనల్ని కోర్టుకు సమర్పించాలని కోరింది. ఇందుకోసం కేసు విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.