Kalyan Jyoti Sengupta
-
హైకోర్టు విభజనపై ముగిసిన వాదనలు
తీర్పు వాయిదా సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజనకోసం దాఖలైన వ్యాజ్యాలపై వాదనలు శుక్రవారం ముగిశాయి. ఈ వ్యాజ్యాలపై రాతపూర్వక వాదనలను స్వీకరించేందుకు వీలుగా ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు విభజనకు తక్షణమే చర్యలు చేపట్టేలా కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన టి.ధన్‌గోపాల్‌రావు హైకోర్టులో గత వారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోనే హైకోర్టు ఏర్పాటుకు ఆదేశాలివ్వాలంటూ ఏపీ హైకోర్టు సాధన సమితి కన్వీనర్ ప్రసాద్‌బాబు, ప్రస్తుతమున్న చోటనే 2 రాష్ట్రాల హైకోర్టులను ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలంటూ న్యాయవాది టి.అమర్‌నాథ్‌గౌడ్‌లు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటినీ ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం వాటిని శుక్రవారం మరోసారి విచారించింది. 1956 పునర్విభజన చట్టానికి, 2014 పునర్విభజన చట్టానికి మధ్య ఉన్న వైరుధ్యాలను ప్రసాద్‌బాబు తరఫు న్యాయవాది ఎం.వి.రాజారాం వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యాజ్యాలపై వాదనలు ముగిశాయని, వాదనలు వినిపించిన వారంతా లిఖితపూర్వక వాదనల్ని కోర్టుకు సమర్పించాలని కోరింది. ఇందుకోసం కేసు విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. -
మీకు చేతగాదా చెప్పండి.. మేమే తొలగిస్తాం
‘ఫ్లెక్సీల తొలగింపు’ నివేదికలపై హైకోర్టు అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగులు, కటౌట్లు, రోడ్లపై ఏర్పాటు చేసిన విగ్రహాలను తొలగించే వ్యవహారంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సమర్పించిన నివేదికలపై ఉమ్మడి హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల అమలులో ప్రభుత్వాలు విఫలమవుతున్నట్టు ఈ నివేదికలను చూస్తే అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. ఫ్లెక్సీలు, తదితరాలను తొలగించడం చేతకాకపోతే ఆ విషయాన్ని తమకు చెప్పాలని, వాటిని ఎలా తొలగింపజేయాలో తమకు తెలుసునని పేర్కొంది. తామిచ్చిన ఆదేశాల ప్రకారం.. ఫ్లెక్సీలు, తదితరాలను తొలగించేందుకు ఇరు ప్రభుత్వాలకు మరో 15 రోజుల గడువునిచ్చింది. ఇదే చివరి అవకాశమని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చట్ట విరుద్ధంగా రోడ్లపై విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారంటూ ప్రకాశం జిల్లాకు చెందిన ఎస్.మురళీకృష్ణ 2008లో హైకోర్టులో ప్రజా ప్రయోజనవ్యాజ్యం దాఖలు చేశారు. -
‘ఫాస్ట్’పై పునరాలోచన
త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం హైకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వం వెల్లడి విచారణ 15 రోజులకు వాయిదా సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సాయం(ఫాస్ట్) పేరుతో తీసుకొచ్చిన పథకంపై పునరాలోచన చేస్తున్నామని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని రాష్ర్ట ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చేసిన ఈ ప్రకటనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం నమోదు చేసుకుని తదుపరి విచారణను 15 రోజులకు వాయిదా వేసింది. తెలంగాణలో 1956 నవంబర్ 1 నాటికి స్థిరపడిన కుటుం బాల విద్యార్థులకే ఆర్థిక సాయం అందచేసేలా ఫాస్ట్ నిబంధనలు రూపొందించడాన్ని(జీవో 36) సవాల్ చేస్తూ టీడీపీ ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, మాజీ మం త్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ హైకోర్టులో వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు విచారణ చేసిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. అడ్వొకేట్ జనరల్ తరఫున అతని జూనియర్ న్యాయవాది పవన్‌కుమార్ హాజరై, విచారణను రెండు వారాలకు వాయిదా వేయాలని కోరారు. ఫాస్ట్ జీవోపై ఇటీవల జరిగిన పరిణామాలను కోర్టు ముం దుంచుతామని తెలిపారు. దీనిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. జీవోపై కౌంటర్ దాఖలు చేయాలని గత విచారణ సమయంలో ఆదేశించామని, అడ్వొకేట్ జనరల్ మొహం చూసి కౌంటర్ దాఖలుకు చివరి అవకాశం ఇచ్చామని, అయినా కౌంటర్ వేయకపోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించింది. మీకు (ప్రభుత్వానికి) కౌంటర్ దాఖలు చేయాలని అనిపించడం లేదా అని నిలదీసింది. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ వచ్చి ఫాస్ట్‌పై ప్రభుత్వం పునరాలోచన చేస్తోందని, త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీంతో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. -
ఆ జీవోలతో కబ్జాదారులకే లబ్ధి
భూముల క్రమబద్ధీకరణపై హైకోర్టు ఆక్షేపణ చట్టాలను ఉల్లంఘించిన వారికి అనుకూలంగా జీవోలా? దీనిపై లోతైన విచారణ జరపాల్సి ఉంటుందన్న ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని సర్కారుకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఆక్రమిత ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు రాష్ర్ట ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు తప్పుబట్టింది. వాటినుద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. భూ ఆక్రమణదారులకు లబ్ధి చేకూర్చేలా ఆ జీవోలు ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. చట్టాలను ఉల్లంఘించి భూములను ఆక్రమించుకున్న వారికి అనుకూలంగా క్రమబద్దీకరణ చేస్తూ పోతే, చట్టాలను గౌరవించే వారు ఎప్పటికీ లబ్ధి పొందే అవకాశముండదని కోర్టు అభిప్రాయపడింది. తెలంగాణ సర్కారు చేపట్టిన భూముల క్రమబద్ధీకరణ వ్యవహారమంతా కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డిని ఆదేశించింది. ఆ కౌంటర్‌కు మరో రెండు వారాల్లో తిరుగు సమాధానమివ్వాలని పిటిషనర్లను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఆక్రమణదారుల కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను వారి పేరు మీద క్రమబద్ధీకరించే నిమిత్తం రాష్ర్ట ప్రభుత్వం గత నెల 30న జారీ చేసిన జీవో 58, 59లను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ పి.ఎస్.విశ్వేశ్వరరావు, ఆప్ పార్టీ నేత మీర్ మహ్మద్ ఆలీ, ఉద్యోగి జైశ్వాల్ సంయుక్తంగా, లెక్చరర్ అన్వర్‌ఖాన్, తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి అమరవాణి నర్సాగౌడ్ వేర్వేరుగా హైకోర్టులో గత వారం ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, ఆ పని చేయకుండా వాటిని ఆక్రమణదారులకే ఉచితంగానో లేక కొంత రుసుముతోనో కట్టబెట్టేందుకు క్రమబద్ధీకరణ జీవోలను జారీ చేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ప్రజా విధానం పేరుతో ప్రభుత్వం కబ్జాదారులను రక్షించే ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. ఈ జీవోలను అడ్డంపెట్టుకుని బినామీలను తెరపైకి తీసుకువచ్చి తమ కబ్జాలో ఉన్న భూములను ఆక్రమణదారులు క్రమబద్ధీకరించుకునే అవకాశముందని కోర్టుకు నివేదించారు. కాగా, ప్రభుత్వం తరఫున ఏజీ స్పందిస్తూ.. ప్రభుత్వం సదుద్దేశంతోనే ఈ జీవోలను జారీ చేసిందని, ఇది ప్రభుత్వ విధాన నిర్ణయమని చెప్పారు. సామాజిక న్యాయంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని, దీనివల్ల ఎంతో మంది పేదలకు న్యాయం జరుగుతుందని వివరించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తుంటే ఆక్రమణదారులకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ జీవోలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. చట్టాలను ఉల్లంఘించిన వారికి అనుకూలంగా భూములను క్రమబద్ధీకరించుకుంటూ పోతే, చట్టాలను గౌరవించే వ్యక్తులకు ప్రభుత్వ జీవోల వల్ల ఎలాంటి ఫలితం ఉండదని, వాటి ఫలాలు దక్కవని వ్యాఖ్యానించింది. ఈ జీవోలను లోతుగా విచారించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. తామిచ్చే తుది తీర్పునకు లోబడే భూముల క్రమబద్ధీకరణ ఉంటుందని స్పష్టంచేసింది. ఈ విషయాన్ని దరఖాస్తుదారులందరికీ పత్రికాముఖంగా తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
ప్రజలకు సమస్యగా మోసపూరిత పత్రాలు
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా ఏఎన్‌యూ (గుంటూరు): మోసపూరితంగా తయారు చేసే పత్రాలు సామాన్య ప్రజలకు సమస్యగా మారాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్ట్స్, కామర్స్, లా కళాశాలతో పాటు హైదరాబాద్‌కు చెందిన ట్రూత్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో ‘ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్’ అనే అంశంపై శనివారం వర్సిటీలో వర్క్‌షాప్ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో సరిహద్దు ప్రాంతాల్లో నకిలీ నోట్ల చెలామణి అధికంగా ఉందన్నారు. నకిలీలను గుర్తించే సరైన పరిజ్ఞానం లేని కారణంగా ఎంతోమంది మోసపోతున్నారన్నారు. నకిలీపై సామాన్యులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ల్లో ఫోర్జరీల సమస్య అధికంగా ఉంటోందన్నారు. మరణ ధ్రువీకరణ పత్రాల్లో కూడా మోసపూరితమైనవి వెలుగు చూస్తున్నాయన్నారు. ఫోర్జరీ పత్రాలు హింసాత్మక ఘటనలకు దారి తీస్తున్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో నకిలీల సమస్య అధికమైందన్నారు. హత్యలు, అత్యాచారాల కంటే మోసపూరిత కేసులు అధికంగా ఉంటున్నాయనీ, వీటి ద్వారా కోట్లలో లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఏఎన్‌యూ లా డీన్ ఆచార్య వైపీ రామసుబ్బయ్య, విభాగాధిపతి ఆచార్య ఎల్ జయశ్రీ, ట్రూత్ ల్యాబ్స్ డెరైక్టర్ డాక్టర్ టీఎస్ఎన్ మూర్తి, గుంటూరు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎం రఫి, కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మురళి తదితరులు పాల్గొన్నారు. -
మహోన్నతులను మనమే గుర్తించాలి
హైకోర్టు చీఫ్ జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా శివానంద ఎమినెంట్ సిటిజన్స్ అవార్డుల ప్రదానం భారతరత్న సీఎన్‌ఆర్‌రావు, డాక్టర్ సత్యవ్రత్ శాస్త్రిలకు అందజేత సాక్షి, హైదరాబాద్: మనదేశానికి చెందిన మహోన్నత వ్యక్తులను ముందు ప్రపంచం గుర్తించిన తర్వాతే మనం గుర్తిస్తున్నామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా అన్నారు. ఇది చాలా విచారించదగ్గ విషయమని పేర్కొన్నారు. సనాతనధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ‘శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డు-2014’ ప్రదానోత్సవం సికింద్రాబాద్‌లోని తివోలి గార్డెన్లో వైభవంగా జరిగింది. ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ కె. బసవరాజు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి చీఫ్ జస్టిస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భారతరత్న ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు, మహామహోపాధ్యాయ డాక్టర్ సత్యవ్రత్ శాస్త్రిలను శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డులతో చీఫ్ జస్టిస్ సత్కరించారు. చికాగో సభలో స్వామి వివేకానంద భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల గురించి అనర్గళంగా మాట్లాడిన తర్వాతే మనం గుర్తించామని చీఫ్ జస్టిస్ ఉదహరించారు. వివిధ రంగాల్లో ఎనలేని కృషి చేసి దేశానికి సేవలందించిన రత్నాల్లాంటి వ్యక్తులను మనమే మొదట గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.సీఎన్ఆర్ రావు, సత్యవ్రత్‌లు దేశానికి ఎనలేని సేవచేశారని కొనియాడారు. వారిని సత్కరించే అవకాశం తనకు రావడం సంతోషదాయకమని చె ప్పారు. వారిని భారతదేశ యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సీఎన్ఆర్ రావు మాట్లాడుతూ... వచ్చే 15 ఏళ్లలో సైన్స్ రంగం లో ప్రపంచంలో మనదేశం అగ్రస్థానానికి చేరుకుంటుందన్నారు.ఇతర దేశాలతో పోల్చితే మనదేశంలో సైన్స్‌లో విశేష ప్రతిభగల పరిశోధకులు ఉన్నారని తెలిపారు. వారిని ప్రోత్సహించి వనరులు సమకూర్చితే దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. సరికొత్త ఆవిష్కరణలు వారితోనే సాధ్యమన్నారు. దీనికితోడు నాణ్యతగల బోధన లభించడం లేదని, దీన్ని మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. శక్తి వంచన లేకుండా దేశం కోసం వివిధ రంగాల్లో కృషి చేసిన వారిని సత్కరించడాన్ని బాధ్యతగా తీసుకున్నామని మేనేజింగ్ ట్రస్టీ బసవరాజు అన్నారు. ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ఎల్‌ఎస్‌ఆర్‌కే అవార్డులను కూడా సీఎన్‌ఆర్‌రావు, సత్యవ్రత్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు జస్టిస్ వి. భాస్కరరావు, అప్పారావు, కె. రాజశేఖర్, ఎ. గోపాల్‌రెడ్డి, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ భోస్లే బాధ్యతల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ భోస్లే సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా ప్రమాణం చేయించారు. హైకోర్టు మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, ఇరు రాష్ట్రాల అడ్వొకేట్స్ జనరల్, న్యాయవాదులతో పాటు జస్టిస్ భోస్లే కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం తరువాత ఆయన మరో న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డితో కలసి కేసులను విచారించారు. జస్టిస్ భోస్లే కర్ణాటక హైకోర్టు నుంచి ఉమ్మడి హైకోర్టుకు బదిలీ అయిన విషయం తెలి సిందే. జస్టిస్ భోస్లే నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. -
దుబ్బాక నగర పంచాయతీ కేసులో మలుపు
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా, దుబ్బాకను నగర పంచాయతీగా మారుస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓను కొట్టివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లాలోని ధర్మాజీపేట, లచ్చపేట, చెర్వపూర్, దుంపలపల్లి, చెల్లాపూర్, మల్లయ్యపల్లి గ్రామ పంచాయతీలను కలిపి దుబ్బాక నగర పంచాయతీగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 31న జీఓ జారీ చేసింది. ఈ జీఓను సవాలు చేస్తూ దుబ్బాకకు చెందిన గుండబోయిన ఆంజనేయులు, కూరపాటి బంగారయ్య మరో 16 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ రమేష్ రంగనాథన్ ఈ ఏడాది జూన్ 27న తీర్పునిస్తూ.. గ్రామ పంచాయతీల అభిప్రాయాలను, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే ప్రభుత్వం నగర పంచాయతీని ఏర్పాటు చేసిందని, అందువల్ల జీఓను కొట్టివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ తీర్పును సవాలు చేస్తూ మెదక్‌కు చెందిన వి.సుభద్ర ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌ను ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, గురువారం మరోసారి విచారించింది. సుభద్ర తరఫున ఎన్.శ్రీధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, అసలు సింగిల్ జడ్జి ముందు పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్లు ఆ పిటిషన్లో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చలేదని తెలిపారు. రాష్ట్ర విభజనకు ముందు పిటిషన్ దాఖలు చేశారని, విభజన తర్వాత పిటిషన్‌కు సవరణలు చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చలేదని, అందువల్ల సింగిల్ జడ్జి ఉత్తర్వులను అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై లేదని వివరించారు. దీనికి రిట్ పిటిషనర్ల తరఫు న్యాయవాది సమాధానమిస్తూ, సవరణలు చేస్తూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశామని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే సింగిల్ జడ్జి తీర్పులో ఎక్కడా కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు ఉన్నట్లు లేకపోవడాన్ని ధర్మాసనం గుర్తించింది. శ్రీధర్‌రెడ్డి లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తిరిగి ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టాలని సింగిల్ జడ్జిని ఆదేశించింది. వారంలోపు రిట్ పిటిషనర్లు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతివాదిగా చేరుస్తూ అనుబంధ పిటిషన్ దాఖలు చేయాలని, ఒకవేళ అలా దాఖలు చేయకపోతే పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు భావించాల్సి ఉంటుందని తెలిపింది. కొస మెరుపు.. ఇదిలా ఉంటే నగర పంచాయతీ జీఓను కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పును అధికారులు అమలు చేయడం లేదంటూ రిట్ పిటిషనర్లు సింగిల్ జడ్జి వద్ద పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన న్యాయమూర్తి, అధికారుల చర్యలను సమోటోగా కోర్టు ధిక్కారంగా పరిగణించారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేయనందుకు పురపాలకశాఖ, పంచాయతీరాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులకు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసి, వివరణ కోరారు. తాజాగా ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలతో సింగిల్ జడ్జి కోర్టు ధిక్కార ఉత్తర్వులు కూడా రద్దయినట్లే. -
జస్టిస్ నౌషాద్ అలీకి హైకోర్టు ఘన వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నౌషాద్ అలీ పదవీ విరమణ సందర్భంగా శుక్రవారం ఆయనకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా నేతృత్వంలో న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. అధికారికంగా జస్టిస్ అలీ శనివారం పదవీ విరమణ చేయనున్నారు. శనివారం హైకోర్టుకు సెలవు కావడంతో శుక్రవారమే ఆయనకు హైకోర్టు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో జస్టిస్ అలీ కుటుంబసభ్యులు, అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, అదనపు ఏజీలు, పబ్లిక్ ప్రాసి క్యూటర్ వినోద్‌కుమార్ దేశ్‌పాండే, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎ.గిరిధర రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిధరరావు ఆధ్వర్యంలో న్యాయవాదుల సంఘం జస్టిస్ అలీని ఘనంగా సన్మానించింది. జస్టిస్ అలీ 1952, మార్చి 8న చిత్తూరు జిల్లా పీలేరులో జన్మించారు. 1976లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2010, నవంబర్ 26న హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. -
జాతీయ సమైక్యతకు చిహ్నం... నుమాయిష్
అఫ్జల్‌గంజ్, న్యూస్‌లైన్: నుమాయిష్ జాతీయ సమైక్యతకు చిహ్నంగా నిలుస్తుందని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బుధవారం రాత్రి 74వ నుమాయిష్ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళ్యాన్ జ్యోతి సేన్ గుప్తా ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. భారత రాజ్యాంగం ఎంతో ఉత్తమమైనదని, తామంతా రాజ్యాంగానికి లోబడి పని చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పోటీ ప్రపంచంలో సవాళ్లను నేటి యువత, విద్యార్థులు ధైర్యంగా ఎదుర్కొని జీవితంలో రాణించాలని సూచించారు. మారుతున్న ఆధునిక సాంకేతిక రంగానికి అనుగుణంగా విద్యార్థులు తమ భవిష్యత్‌ను మలచుకోవాలని సూచించారు. నుమాయిష్‌లో న్యాయ సలహాల కోసం ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఈ సెల్ ద్వారా కొందరికైనా ప్రయోజనం కలిగి ఉంటుందని భావిస్తున్నానన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే నుమాయిష్ వాణిజ్య పరంగా అభివృద్ధి సాధించేందుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. విద్యార్థులు, యువత నుమాయిష్‌లో స్టాళ్లను సందర్శించడం వల్ల ఆయా స్టాళ్లలో ఏర్పాటు చేసిన వివిధ రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులపై అవగాహన కలుగుతుందన్నారు. అంతకుముందు ఎగ్జిబిషన్ సొసైటీ గౌరవ కార్యదర్శి అశ్విన్‌మార్గం మాట్లాడుతూ సొసైటీ అందిస్తున్న సేవలను వివరించారు. ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు, రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖామంత్రి కె.జానారెడ్డి ప్రారంభోపన్యాసం చేస్తూ 1938 సంవత్సరం నిజాంల హయాంలో ప్రారంభమైన నుమాయిష్ అంచలంచెలుగా అభివృద్ధి సాధించి అఖిల భారత వస్తు ప్రదర్శన శాలగా ఎదిగి, అంతర్జాతీయస్థాయి ఖ్యాతిని ఆర్జించిందన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణాలోని వెనుకబడిన ప్రాంతాల్లో 18 విద్యాసంస్థలను స్థాపించి, 35వేల మంది విద్యార్థులకు విద్యనందిస్తుందన్నారు. దేశంలోనే తొలిసారిగా మహిళల కోసం ప్రత్యేకంగా పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించిన ఘనత సొసైటీకే సొంతమన్నారు. అనంతరం అఖిల భారత వస్తు ప్రదర్శన శాలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా, సందర్శకులకు అసౌకర్యం కలుగకుండా సహకరించినందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, 2012 పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పలువురు విద్యార్థులకు శంకర్జీ మెమోరియల్ గోల్డ్ మెడల్స్‌ను హైకోర్టు చీఫ్ జస్టిస్ చేతుల మీదుగా ప్రధానం చేశారు. -
చట్టాలు సమర్ధం అమలు అవ్వలి
అప్పుడే వాటి లక్ష్యం నెరవేరుతుంది: చీఫ్ జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్ గుప్తా సాక్షి, హైదరాబాద్: చట్టాలను సమర్ధవంతంగా అమలు చేసినప్పుడే వాటి లక్ష్యం నెరవేరుతుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్ జ్యోతి సేన్ గుప్తా చెప్పారు. లైంగిక వేధింపుల నుంచి బాలలకు రక్షణ కల్పించేందుకు తెచ్చిన కొత్త చట్టం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులు, న్యాయమూర్తులు, మీడియా, పౌరసమాజంపైనే ఉందన్నారు. ఆదివారం రాష్ట్ర న్యాయ సేవా సంస్థ, ఏపీ పోలీస్ అకాడమీ (అప్పా)లు సంయుక్తంగా.. ‘లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ చట్టం-2012’పై న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు సదస్సును నిర్వహించారుు. అప్పాలో జరిగిన ఈ సదస్సుకు జస్టిస్ సేన్ గుప్తా ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం సమర్ధవంతమైన చట్టాలకు రూపకల్పన చేయాలంటూ ఐక్యరాజ్యసమితి 1992 డిసెంబర్ 18న చేసిన తీర్మానాన్ని అంగీకరిస్తూ మన దేశం కూడా సంతకం చేసినా...ఈ చట్టాన్ని రూపొందించేందుకు రెండు దశాబ్దాలకు పైగా సమయం పట్టడం శోచనీయమన్నారు. చట్టానికి రూపకల్పన జరిగి ఏడాది దాటినా పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదని చెప్పారు. ఐపీసీ అభియోగాల్లో నిందితులు నేరం చేసినట్లు పోలీసులు నిరూపించాల్సి ఉంటుందని...అయితే ఈ చట్టం ప్రకారం పిల్లలపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తే తాను నేరం చేయలేదని నిరూపించుకోవాల్సి ఉంటుందన్నారు. లైంగిక హింసకు గురవుతున్న బాలల వివరాలను, వార్తలను ప్రచురించడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత మీడియా, ప్రజలపై ఉందని సూచించారు. పోలీసులు ఫిర్యాదు అందిన వెంటనే నేర నిరూపణకు తగిన ఆధారాలను సేకరించాలని తెలిపారు. దేశంలో 50 శాతానికి పైగా చిన్నారులు లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు తేలిందని హైకోర్టు న్యాయమూర్తి జి.రోహిణి ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానాల్లో బాధిత చిన్నారుల వాంగ్మూలం నమోదు, తుది విచారణ (ట్రయల్) చిన్నారులను వేధించే విధంగా ఉండకూడదని సూచించారు. వేధింపులకు గురైన చిన్నారుల వ్యక్తిగత వివరాలను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాచీన భారతీయ సాంప్రదాయాలకు తిలోదకాలివ్వడమే అన్ని అనర్ధాలకు మూలమని హైకోర్టు జడ్జి ఎల్.నరసింహారెడ్డి అన్నారు. నేటి ఆధునిక సమాజంలో చిన్నారులపై హింస పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో ఓ బోరు బావిలో పడిన చిన్నారిని నాలుగవ తరగతి వరకు చదివి మేస్త్రీగా పనిచేస్తున్న మరో చిన్నారి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కాళ్లకు తాడుకట్టుకొని తలకిందులుగా బోరుబావిలోకి దిగి రక్షించాడని...ఆ చిన్నారి ధైర్యసాహసాలను ప్రభుత్వ ఏజెన్సీలు గుర్తించకపోవడం శోచనీయమన్నారు. విషయం తెలిసి తాను ఆ చిన్నారిని ఘనంగా సన్మానించానన్నారు. చిన్నారులకు లైంగిక విద్య అవసరమనే ఉద్దేశంతో 2005లో కేంద్ర ప్రభుత్వం ప్రచురించిన పుస్తకాల్లో.. 8, 14, 18 సంవత్సరాల్లో బాలబాలికల అవయవాల ఎదుగుదలను వివరించేందుకు రంగుల్లో ముద్రించిన నగ్న చిత్రాలు జుగుప్సాకరంగా ఉండడంతో తాను బహిరంగంగానే వ్యతిరేకించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవడంతో ప్రభుత్వం ఉపసంహరించుకుందని చెప్పారు. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగై చిన్న కుటుంబాలు వచ్చాయని, పిల్లల సంరక్షణను ఆయాలు, వార్డర్లు చూస్తుండడంతో వారు తల్లిదండ్రుల సంరక్షణకు దూరమవుతున్నారని డీజీపీ ప్రసాదరావు అన్నారు. లైంగిక దాడికి గురైన చిన్నారులు తీవ్రమైన మానసిక ఆందోళన మధ్య ఉంటారని, వారిని బెదిరింపులకు గురిచేయకుండా పోలీసులు మానవీయకోణంలో దర్యాప్తు చేయాలని సూచించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు కేసీ భాను, ఆర్.సుభాష్‌రెడ్డి, చంద్రయ్య, చంద్రకుమార్, మాజీ జడ్జి శేషశయనారెడ్డి, అప్పా డెరైక్టర్ మాలకొండయ్య, డీఐజీ వెంకటేశ్వరరావు, లీగల్ సర్వీస్ అథారిటీ సభ్య కార్యదర్శి శ్యామ్‌ప్రసాద్, హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీ కమిటీ కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, సీనియర్ సంపాదకులు పొత్తూరి వెంటేశ్వరరావు, కింగ్‌షుక్‌నాగ్, ఆర్వీ రామారావు, అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి, జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు అశోక్‌బాబు, దాసప్ప, గౌస్‌బాష, తారకరామ్, ఎల్.రవిబాబు, షమీమ్ అక్తర్, బాలయోగి, రజని, నాగమారుతిశర్మ, సీహెచ్ కనకదుర్గారావు, భానుమతి, లీలావతి, జయసూర్య, ఎన్.బసవయ్య, జి.చక్రధరరావు, కేఏపీ స్వామి, టి.గంగిరెడ్డి, జి.గోపాలక్రిష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీఎన్జీవోల సమ్మెపై భిన్న తీర్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీఎన్జీవోలు చేపట్టిన సమ్మెపై హైకోర్టులో జరుగుతున్న విచారణ మళ్లీ మొదటికొచ్చింది. సమ్మెను చట్ట విరుద్ధంగా ప్రకటించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ ఖండవల్లి చంద్రభానులు పరస్పర భిన్నమైన తీర్పులు వెలువరించారు. సమ్మె చట్ట విరుద్ధమని ప్రధాన న్యాయమూర్తి ప్రకటించగా, సమ్మెపై దాఖలైన పిటిషన్లో ప్రజా ప్రయోజనాలు లేవని, రాజకీయ ప్రయోజనాల్లో భాగంగానే ఈ వ్యాజ్యాలు దాఖలు చేశారని జస్టిస్ భాను తేల్చి చెప్పారు. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై మూడో న్యాయమూర్తి విచారణ జరిపి నిర్ణయం వెలువరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని, రాజకీయ అంశమైన రాష్ట్ర విభజన గురించి సమ్మె చేసే హక్కు ప్రభుత్వ ఉద్యోగులకు లేదంటూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది రవికుమార్, ఆల్ ఇండియా బీసీ, ఓబీసీ పార్టీ అధ్యక్షుడు టి.దానయ్య వేర్వేరుగా హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో సమ్మెను సమర్ధిస్తూ పలు ఉద్యోగ సంఘాలు అనుబంధ పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యాలన్నిటిపై సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో దాదాపు 20 రోజులకు పైగా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు తీర్పు వెలువరించింది. తీర్పు వెలువరించడానికి ధర్మాసనం సిద్ధమవుతున్న సమయంలో సమ్మె చేస్తున్న ఉద్యోగుల తరఫు సీనియర్ న్యాయవాది ఎమ్మెస్ ప్రసాద్ జోక్యం చేసుకుంటూ, ఏపీఎన్జీవోలు గత నెల 17న సమ్మె విరమించారని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అయితే ప్రధాన న్యాయమూర్తి అందుకు నిరాకరించి తీర్పు వెలువరించడం మొదలు పెట్టారు. ఈ వ్యాజ్యాలు విచారణార్హమైనవేనని ఆయన స్పష్టం చేశారు. పిటిషనర్ల వాదనతో ఏకీభవిస్తూ సమ్మె చట్ట విరుద్ధమని, సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. సమ్మె వల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం వాటిల్లిందో ఆ మొత్తాన్ని సమ్మెల్లో పాల్గొన్న ఉద్యోగుల నుంచి వసూలు చేయాలని సూచించారు. ఏపీఎన్జీవోల వాదనతో ఏకీభవించిన జస్టిస్ భాను ప్రధాన న్యాయమూర్తి తీర్పుతో విభేదించారు. అయితే పిటిషన్ల విచార ణార్హతకు మాత్రమే పరిమితమై తీర్పు చెబుతూ.. ఈ వ్యాజ్యాలు ఎంత మాత్రం విచారణార్హం కావని తేల్చి చెప్పారు. ఇవి రాజకీయ ప్రయోజనాల కోసం దాఖలు చేసిన వ్యాజ్యాలే తప్ప, ఇందులో ప్రజా ప్రయోజనాలు ఎంత మాత్రం లేవని స్పష్టం చేశారు. పిటిషనర్ రవికుమార్ కూడా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. అప్పుడు గుర్తుకు రాని ప్రజా ప్రయోజనాలను ఇప్పుడు ప్రస్తావిస్తూ పిల్ రూపంలో పిటిషన్ దాఖలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పైగా ఏపీఎన్జీవోల సమ్మె వల్ల తాను ఇబ్బంది పడినట్టు పిటిషనర్ కానీ ఇతరులెవరూ ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు. పరస్పర విభిన్న తీర్పుల నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని మూడో న్యాయమూర్తికి నివేదిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. ఏ న్యాయమూర్తి విచారించనున్నారనే విషయంపై నాలుగైదు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సదరు న్యాయమూర్తి మళ్లీ మొదటినుంచీ ఇరుపక్షాల వాదనలు వినాల్సి ఉంటుంది. -
నల్లచొక్కాతో వాదనలు వినిపించొద్దు
సాక్షి, హైదరాబాద్: అయ్యప్ప దీక్షలో ఉన్న ఒక న్యాయవాది నల్లచొక్కా వేసుకుని వచ్చి వాదనలు వినిపించడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా అభ్యంతరం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా వేములవాడ రాజరాజేశ్వరి దేవస్థానం సమీపంలో మద్యనిషేధం అమలు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ ఒక పిటిషన్ దాఖలైంది. ఈ వ్యాజ్యంపై వాదనలు వినిపించడానికి వచ్చిన న్యాయవాది చల్లా అజయ్‌కుమార్ నల్లచొక్కా, బ్లేజర్, దానిపై రోబ్స్ మెడలో బ్యాండ్‌తో వచ్చారు. ఆయన వస్త్రధారణను గమనించిన ప్రధాన న్యాయమూర్తి.. తెల్లచొక్కా ఎందుకు వేసుకోలేదని ప్రశ్నించారు. అయ్యప్ప దీక్షలో ఉన్నానని ఆయన చెప్పగా, ఎన్ని రోజులు ఇలా నల్లచొక్కాతో వస్తారని మరో ప్రశ్న వేశారు. దీంతో పక్కనే ఉన్న మరో న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్ దీక్ష గురించి ప్రధాన న్యాయమూర్తికి వివరించారు. అనంతరం నిబంధనల కన్నా దీక్ష ఎక్కువ కాదని జస్టిస్ సేన్‌గుప్తా తేల్చి చెప్పారు. దీక్ష ముగిసిన తర్వాతే వాదనలు వినిపించాలని పేర్కొంటూ ఈ పిటిషన్‌పై విచారణను రెండు నెలలు వాయిదా వేశారు. -
పరిష్కరించలేని సమస్యలేవీ ఉండవు
అనంతగిరి, న్యూస్‌లైన్: చట్టం పరిధిలో పరిష్కరించలేని సమస్యలంటూ ఏవీ ఉండవని, వాటి పరిష్కారానికి అవసరమైన చట్టాలపై న్యాయవాదులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా అభిప్రాయపడ్డారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సమీపంలోని అనంతగిరిగుట్ట పర్యాటక కేంద్రంలో రాష్ట్ర బార్ కౌన్సిల్, వికారాబాద్ బార్ కౌన్సిల్ల సంయుక్త ఆధ్వర్యంలో సివిల్, రెవెన్యూ, క్రిమినల్ చట్టాలు, ప్రాథమిక న్యాయసూత్రాలు తదితర అంశాలపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్ జస్టిస్ గుప్తా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ తన జీవితంలో వివిధ చట్టాల అవసరం ఉంటుందన్నారు. వారికేమైనా సమస్యలు ఏర్పడినపుడు చట్టాలను తగినవిధంగా వినియోగించి న్యాయం చేయాలని న్యాయవాదులకు సూచించారు. అలాగే ఆయా చట్టాలపై సంపూర్ణ విషయ పరిజ్ఞానం కలిగి ఉండాలని చెప్పారు. గ్రామాల్లో పేదలకు తమ హక్కులపై అవగాహన ఉండదని, అన్యాయం జరిగినా ప్రశ్నించలేరని అన్నారు. ఇటువంటి కేసుల్లో వారికి అన్ని విధాలా సహాయపడాలని చెప్పారు. అలాగే భూసంస్కరణలకు సంబంధించిన చట్టాల పూర్తి అవగాహన కలిగిఉంటేనే, ఆయా కేసుల్లో పేదలకు న్యాయం చేసేం దుకు వీలుంటుందని చీఫ్ జస్టిస్ గుప్తా వివరించారు. మనదేశంలో 26 శాతం మంది న్యాయపరమైన వివాదాల్లో ఉన్నా 0.6 శాతం మంది మాత్రమే కోర్టులకు వస్తున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారాల వేదిక, లోక్ అదాలత్ వంటివి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం రెవెన్యూ చట్టాలపై హైకోర్టు న్యాయమూర్తి ఎల్.నర్సింహారెడ్డి, క్రిమినల్ చట్టాలపై కె.సి.భాను న్యాయవాదులకు అవగాహన కల్పించారు. జాతీ య బార్ కౌన్సిల్ సభ్యుడు ఎన్.రాంచందర్‌రావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎ.నర్సింహారెడ్డి, కార్యదర్శి రేణుక, ఉపాధ్యక్షుడు రాంరెడ్డి, జిల్లా జడ్జి ఎంఎస్కే జైస్వాల్ పాల్గొన్నారు. -
6న వికారాబాద్‌కు హైకోర్టు చీఫ్ జస్టిస్
వికారాబాద్, న్యూస్‌లైన్: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్ జ్యోతిసేన్‌గుప్త ఈ నెల 6న వికారాబాద్‌కు రానున్నారు. దేశంలోని పలు రకాల చట్టాలపై జిల్లా న్యాయవాదులకు అవగాహన కల్పించేందుకు వికారాబాద్ సమీపంలోని అనంతగిరి హరిత రిసార్ట్‌లో వికారాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెమినార్ ఏర్పాటు చేశారు. ఈ సెమినార్లో ప్రధాన న్యాయమూర్తితోపాటు హైకోర్టు న్యాయమూర్తులు ఎల్.నర్సింహారెడ్డి, సుభాష్‌రెడ్డి, కేసీ బాన్, రమేష్ రంగరాజన్లు పాల్గొని చట్టాలపై అవగాహన కల్పిస్తారని వికారాబాద్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 వరకు ఉంటుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని న్యాయవాదులు హాజరుకావాలని కోరారు. -
సమ్మె చట్టబద్ధమా..? కాదా..?
సాక్షి, హైదరాబాద్: ఏపీఎన్జీవోలు, సీమాంధ్ర సెక్రటేరియట్ ఫోరంలు చేస్తున్న సమ్మె చట్టబద్ధమా..? కాదా..? అన్న విషయాన్ని మాత్రమే తాము తేలుస్తామని, రాజకీయపరమైన అంశాలతో తమకు ఎటువంటి సంబంధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగులు సమాజంలో భాగమని, రాజ్యాంగ విధులను నెరవేర్చాల్సిన బాధ్యత వారిపై ఉందని తెలిపింది. సమ్మెకు సంబంధించి పూర్తి వివరాలతో శుక్రవారం నాటికి కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీఎన్జీవోలు, సీమాంధ్ర సెక్రటేరియట్ ఫోరంలను మరోసారి ఆదేశించిన హైకోర్టు, విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని, రాజకీయ అంశమైన రాష్ట్ర విభజన గురించి సమ్మె చేసే హక్కు ప్రభుత్వ ఉద్యోగులకు లేదంటూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది రవికుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని గతవారం విచారించి, ఎన్జీవోలకు, సీమాంధ్ర సెక్రటేరియట్ ఫోరంలకు నోటీసులు జారీ చేసిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, సోమవారం దానిని మరోసారి విచారించింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిందని విచారణ ప్రారంభం కాగానే పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. నాలుగైదు రోజుల గడువునిస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని ఏపీఎన్జీవోల తరఫు సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి తెలిపారు. గతవారం కూడా ఇలానే చెప్పారు కదా... అని ధర్మాసనం ప్రశ్నించింది. ఎన్జీవో నాయకులు అందుబాటులో లేరని, ఈ విషయం తెలియని జూనియర్ న్యాయవాది, కోర్టుకు ఆ విధంగా చెప్పి ఉండవచ్చునని మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ సమయంలో మరో సీనియర్ న్యాయవాది ఎస్.ఆర్.అశోక్ జోక్యం చేసుకుంటూ... ఎక్సైజ్ ఉద్యోగులు ఈ కేసులో ప్రతివాదిగా చేరాలని భావిస్తున్నారని, అందువల్ల ఈ కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు తమకు అనుమతినివ్వాలని కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది. ‘‘కౌంటర్లు లేకుండా ఈ కేసులను ఎలా విచారించాలి..? శాంతిభద్రతల పరిరక్షణమే మాకు ముఖ్యం. రాజకీయపరమైన అంశాలతో మాకు ఎటువంటి సంబంధం లేదు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉంది. చట్టబద్ధమైన కారణాలు ఉంటే తప్ప విధులకు ఆటంకం కలిగించడానికి వీల్లేదు’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయాలన్నింటినీ తేల్చే ముందు అసలు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయడంలో పిటిషనర్ ఉద్దేశాలు ఏమిటో స్పష్టంగా తెలుసుకోవాలని మోహన్‌రెడ్డి కోరారు. ‘‘సమ్మె చట్టబద్ధమా..? కాదా..? అన్న విషయమే మాకు ముఖ్యం. వారు చేస్తున్న సమ్మె సరైందేనని తేలితే అది చట్టబద్ధమైందని చెబుతాం. సరైంది కాకుంటే సమ్మె చట్ట వ్యతిరేకమని తేలుస్తాం. మాకు సెంటిమెంట్లు, భావోద్వేగాలు మాకు ముఖ్యం కాదు’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని, ఒకవేళ దాఖలు చేయకుంటే కేసును విచారిస్తూ వెళతామని తేల్చి చెప్పింది. అన్ని చర్యలూ తీసుకుంటున్నాం: ప్రభుత్వం ఏపీఎన్జీవోల సమ్మెవల్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను తొలగించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారని, అత్యవసర సేవలకు, శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నామని తెలిపింది. సమ్మె నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులను అధిగమించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలన్న ధర్మాసనం ఆదేశాల మేరకు సాధారణ పరిపాలనశాఖ డిప్యూటీ సెక్రటరీ జి.కృష్ణవేణి కౌంటర్ దాఖలు చేశారు. బదిలీలు, పదోన్నతులు, సీనియారిటీ వ్యవహారాల్లో అనిశ్చితి, 10వ పీఆర్సీ, మధ్యంతర భృతి, నగదురహిత ఆరోగ్యకార్డులు, రాష్ట్ర విభజన ప్రక్రియను నిలుపుదల చేయడం తదితర అంశాలపై ఏపీఎన్జీవో, సెక్రటేరియట్ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం నోటీసులు ఇచ్చాయని తెలిపారు. మొత్తం పరిస్థితిని ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తోందని, ఉద్యోగ సంఘాలతో మంత్రుల బృందం రెండుసార్లు చర్చలు జరిపిందని పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ ఈ వ్యాజ్యాన్ని కొట్టివేయాలని ఆమె కోర్టును కోరారు. -
ఒకే వ్యక్తి పలు నియోజకవర్గాల్లో ... రాజకీయ పార్టీలను ప్రతివాదులుగా చేర్చండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఏకకాలంలో ఒక వ్యక్తి పలు నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తున్న ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు సోమవారం మరోసారి విచారించింది. ఈ వ్యాజ్యంలో అన్ని రాజకీయ పార్టీలను ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్ వేణుగోపాల్‌రెడ్డిని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక వ్యక్తి ఏకకాలంలో పలు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమంటూ న్యాయవాది వేణుగోపాల్‌రెడ్డి దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని గతవారం విచారించిన ధర్మాసనం... ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. సోమవారం ఈ వ్యాజ్యం తిరిగి విచారణకు వచ్చినప్పుడు... ఇందులో రాజకీయ పార్టీలను ప్రతివాదులుగా చేర్చలేదని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఆ మేరకు రాజకీయ పార్టీలను ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్‌ను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.