సాక్షి, హైదరాబాద్: ఏకకాలంలో ఒక వ్యక్తి పలు నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తున్న ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు సోమవారం మరోసారి విచారించింది. ఈ వ్యాజ్యంలో అన్ని రాజకీయ పార్టీలను ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్ వేణుగోపాల్‌రెడ్డిని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ఒక వ్యక్తి ఏకకాలంలో పలు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమంటూ న్యాయవాది వేణుగోపాల్‌రెడ్డి దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని గతవారం విచారించిన ధర్మాసనం... ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. సోమవారం ఈ వ్యాజ్యం తిరిగి విచారణకు వచ్చినప్పుడు... ఇందులో రాజకీయ పార్టీలను ప్రతివాదులుగా చేర్చలేదని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఆ మేరకు రాజకీయ పార్టీలను ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్‌ను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.