మరో బాలికపైనా అఘాయిత్యం! | Girl Died Due To Rape By Venugopal Reddy At Ranga Reddy District | Sakshi
Sakshi News home page

మరో బాలికపైనా అఘాయిత్యం!

Published Fri, Aug 14 2020 3:48 AM | Last Updated on Fri, Aug 14 2020 5:27 AM

Girl Died Due To Rape By Venugopal Reddy At Ranga Reddy District - Sakshi

వేణుగోపాల్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: అమీన్‌పూర్‌ అనాథాశ్రమంలో అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక్కడి మారుతి అనాథాశ్రమంలో ఏడాదిపాటు అత్యాచారానికి గురైన దళిత క్రైస్తవ బాలిక బుధవారం చికిత్స పొందుతూ మృతిచెందిన సంగతి తెలిసిందే. తనలాగే మరో బాలిక కూడా వేధింపులకు గురైందని కొన్నిరోజుల క్రితం ఆమె చెప్పినట్టు మృతురాలి పిన్ని ప్రీతి వెల్లడించారు. ఆ బాలిక సైతం అస్వస్థతకు గురికావడంతో ఆమె తల్లిదండ్రులు వచ్చి నిలదీశారని చెప్పారు. దీంతో అనాథాశ్రమం నిర్వాహకురాలు విజయ బెదిరించడంతో వారు తమ కుమార్తెను తీసుకుని వెళ్లిపోయారని మృతురాలు చెప్పినట్టు వివరించారు.

ఓ ప్రైవేటు ఫార్మా కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేసే ప్రధాన నిందితుడు నరెడ్ల వేణుగోపాల్‌రెడ్డి.. 14 ఏళ్ల బాలికపై ఏడాది పాటు అత్యాచారానికి పాల్పడగా, అనాథాశ్రమం నిర్వాహకురాలు చెలుకూరు విజయ, ఆమె సోదరుడు సూరపనేని జయదీప్‌ అతడికి సహకరించిన విషయం తెలిసిందే. రెండో బాలికపై సైతం వేణుగోపాల్‌రెడ్డి అత్యాచారం చేశాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనాథాశ్రమానికి తరచుగా ఇతర వ్యక్తులు, దాతలు వచ్చి విజయకు డబ్బులు, స్వీట్లు ఇచ్చి వెళ్లేవారని.. ఈ వ్యవహారంలో వేరే వ్యక్తుల పాత్రా ఉండవచ్చనే అనుమానాలున్నాయి.  

దర్యాప్తులో నిర్లక్ష్యం..?: గతనెల 31న ఈ ఘటన వెలుగులోకి రాగా, ఈ కేసును లోతుగా దర్యాప్తు జరిపే విషయంలో స్థానిక పోలీసులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు నిర్లక్ష్యం చూపినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనాథాశ్రమంలో 70 మందికి పైగా అనాథ, పేద బాలికలు ఉండగా, లాక్‌డౌన్‌ ప్రకటించడంతో కొంతమంది తమ బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో లాక్‌డౌన్‌లో 49 మంది ఇక్కడ ఆశ్రయం పొందారు. వీరిలో 29 మంది బాలికలు 18 ఏళ్ల వయస్సు లోపు గలవారు ఉన్నారు. కేసు నమోదైన వెంటనే ఇక్కడ ఆశ్రయం పొందిన బాలికలందరినీ మానసిక నిపుణులతో కౌన్సెలింగ్‌ నిర్వహించి, వారిపై కూడా ఏమైనా అఘాయిత్యాలు జరిగాయా అనే అంశాన్ని కూపీ లాగడంలో పోలీసులతోపాటు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రధాన నిందితుడు వేణుగోపాల్‌రెడ్డి ‘చేయూత ఫౌండేషన్‌’పేరుతో చాలాకాలంగా ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నాడని.. తనకున్న పలుకుబడి, పరిచయాలతో కేసును ప్రభావితం చేశాడని ఎన్జీవోలు ఆరోపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీలో ఓ ముఖ్యురాలితో వేణుగోపాల్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని, కమిటీ సమావేశాల్లో సైతం అతడు కూర్చునేవాడని ఓ ఎన్జీవో ప్రతినిధి ‘సాక్షి’కి తెలిపారు. రెస్క్యూ చేసిన బాలికలను మారుతి అనాథాశ్రమానికి పంపించాలని ఆమె ఒత్తిడి తెచ్చేదని, లాక్‌డౌన్‌ సమయంలోనే 29 మంది బాలికలను అక్కడకు పంపించిందని ఆరోపించారు. దాతల నుంచి విరాళాలను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులను రాబట్టడంలో వేణుగోపాల్‌రెడ్డి నేర్పరి అని ఎన్జీఓలు పేర్కొంటున్నాయి. 

సెప్టిసియాతో బాలిక మరణం..
అత్యాచారానికి గురైన బాలిక మర్మాంగాలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడ ఏర్పడిన ఇన్ఫెక్షన్‌ రక్తంతో పాటు మొత్తం శరీరానికి వ్యాప్తి చెందిందని, దీంతో ఆమె సెప్టిసియాతో మరణించిందని నిలోఫర్‌ వైద్యులు పేర్కొంటున్నారు. మరో వారం రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాతే ఆమె మరణానికి అసలు కారణాలు తెలియనున్నాయి. కాగా, ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన అనాథాశ్రమాలు రాష్ట్రవ్యాప్తంగా 400కి పైగా ఉండగా.. వాటిలో దాదాపు 13వేల మంది బాలికలు ఆశ్రయం పొందుతున్నారు.

లాక్‌డౌన్‌ ప్రకటించడంతో దాదాపు 9వేల మంది తమ సమీప బంధువుల దగ్గరికి వెళ్లిపోయారని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ గుర్తించింది. మారుతి అనాథాశ్రమం ఘటన నేపథ్యంలో ఇక ఎక్కడైనా ఎవరైనా లైంగిక హింసకు గురయ్యారా లేక వేరే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై అధ్యయనం జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బంధువుల ఇళ్లకు వెళ్లిన బాలికల వద్దకు అంగన్‌వాడీ వర్కర్లను పం పి వారితో మాట్లాడించనుంది. బాలికల నుంచి ఫిర్యాదులు వస్తే అనాథాశ్రమం నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటా మని అధికారవర్గాలు తెలిపాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement