సమావేశంలో మాట్లాడుతున్న డీకే అరుణ. చిత్రంలో దామోదర రాజనర్సింహ, కొండా విశ్వేశ్వరరెడ్డి
లక్డీకాపూల్: సమస్యాత్మకంగా తయారైన ధరణి పోర్టల్‌పై హైకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ముఖ్యంగా రాచకొండ భూముల అంశంపై రిట్ పిటిషన్ వేయాలన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ‘ధరణి పోర్టల్–భూ సమస్యల పరిష్కారం’డిమాండ్‌తో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
వేదిక అధ్యక్షులు బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆయా సమస్యలపై సోమవారం పిటిషన్ దాఖలు చేయనున్నామన్నారు. ఈ విషయంలో బాధిత రైతులు తమ ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని కోరారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు కొట్లాడిన తరహాలోనే ధరణి పోర్టల్ సమస్యపై పోరాటం చేద్దామని, జిల్లా కేంద్రాల్లో చర్చా వేదికలను నిర్వహించి తద్వారా బాధిత రైతులను సంఘటితం చేయాలని పిలుపునిచ్చారు.
ఇప్పటికే ఏడు లక్షల ఎకరాలు అక్రమంగా టీఆర్‌ఎస్ నేతల పేర్లపై మారిపోయాయని ఆందోళన చెందారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పాలసీపై నిర్ణయం తీసుకున్నా, దాని వెనుక కుట్ర దాగి ఉంటుందని విమర్శించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ధరణి ద్వారా పేదల భూములను బలవంతంగా లాక్కుంటోందన్నారు. రాష్ట్రంలో 2.77 కోట్ల ఎకరాలకుగాను సగం భూమి కూడా ధరణి పోర్టల్‌లో ఎక్కలేదన్నారు.
అందులోనూ 25 లక్షల ఎకరాలను నిషేధిత జా బితాలో చేర్చడం ఆక్షేపణీయమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు న్యాయం జరగాలంటే శాశ్వత ట్రిబునల్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ గ్రేటెస్ట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు డిజైన్ చేసిన ఆయన సాఫ్ట్‌వేర్ ఎక్స్‌ఫర్ట్ కావద్దా అని సూటిగా ప్రశ్నించారు.
ధరణి పోర్టల్‌ను డెవలప్ చేసిందెవరన్నది గోప్యంగా ఉంచడానికి కారణమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ, ధరణి పోర్టల్, పోడు భూముల పేరిట రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూదందా జరుగుతున్నదన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు రావుల చంద్రశేఖరరెడ్డి, సీపీఐ నాయకురాలు పశ్య పద్మ, సోషల్ మీడియా ఫోరం కన్వీనర్ దాసరి కరుణాకర్, సీపీఎం నాయకులు నంద్యాల నరసింహారెడ్డి, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, ధరణి బాధితులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment