అఫ్జల్‌గంజ్, న్యూస్‌లైన్: నుమాయిష్ జాతీయ సమైక్యతకు చిహ్నంగా నిలుస్తుందని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బుధవారం రాత్రి 74వ నుమాయిష్ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళ్యాన్ జ్యోతి సేన్ గుప్తా ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. భారత రాజ్యాంగం ఎంతో ఉత్తమమైనదని, తామంతా రాజ్యాంగానికి లోబడి పని చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.
పోటీ ప్రపంచంలో సవాళ్లను నేటి యువత, విద్యార్థులు ధైర్యంగా ఎదుర్కొని జీవితంలో రాణించాలని సూచించారు. మారుతున్న ఆధునిక సాంకేతిక రంగానికి అనుగుణంగా విద్యార్థులు తమ భవిష్యత్‌ను మలచుకోవాలని సూచించారు. నుమాయిష్‌లో న్యాయ సలహాల కోసం ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఈ సెల్ ద్వారా కొందరికైనా ప్రయోజనం కలిగి ఉంటుందని భావిస్తున్నానన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే నుమాయిష్ వాణిజ్య పరంగా అభివృద్ధి సాధించేందుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు.
విద్యార్థులు, యువత నుమాయిష్‌లో స్టాళ్లను సందర్శించడం వల్ల ఆయా స్టాళ్లలో ఏర్పాటు చేసిన వివిధ రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులపై అవగాహన కలుగుతుందన్నారు. అంతకుముందు ఎగ్జిబిషన్ సొసైటీ గౌరవ కార్యదర్శి అశ్విన్‌మార్గం మాట్లాడుతూ సొసైటీ అందిస్తున్న సేవలను వివరించారు. ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు, రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖామంత్రి కె.జానారెడ్డి ప్రారంభోపన్యాసం చేస్తూ 1938 సంవత్సరం నిజాంల హయాంలో ప్రారంభమైన నుమాయిష్ అంచలంచెలుగా అభివృద్ధి సాధించి అఖిల భారత వస్తు ప్రదర్శన శాలగా ఎదిగి, అంతర్జాతీయస్థాయి ఖ్యాతిని ఆర్జించిందన్నారు.
ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణాలోని వెనుకబడిన ప్రాంతాల్లో 18 విద్యాసంస్థలను స్థాపించి, 35వేల మంది విద్యార్థులకు విద్యనందిస్తుందన్నారు. దేశంలోనే తొలిసారిగా మహిళల కోసం ప్రత్యేకంగా పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించిన ఘనత సొసైటీకే సొంతమన్నారు. అనంతరం అఖిల భారత వస్తు ప్రదర్శన శాలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా, సందర్శకులకు అసౌకర్యం కలుగకుండా సహకరించినందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, 2012 పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పలువురు విద్యార్థులకు శంకర్‌జీ మెమోరియల్ గోల్డ్ మెడల్స్‌ను హైకోర్టు చీఫ్ జస్టిస్ చేతుల మీదుగా ప్రధానం చేశారు.
జాతీయ సమైక్యతకు చిహ్నం... నుమాయిష్
Published Thu, Feb 13 2014 4:59 AM | Last Updated on Fri, Oct 19 2018 7:52 PM
Advertisement
Advertisement