numayis
-
నేడు, రేపు మధ్యాహ్నం నుంచే నుమాయిష్
అబిడ్స్: ఈ నెల 7, 8వ తేదీలు (శని, ఆదివారాలు)లో ఎగ్జిబిషన్ (నుమాయిష్)ను మధ్యాహ్నం నుంచి ప్రారంభిస్తామని ఎగ్జిబిషన్ సొసైటీ గౌరవ కార్యదర్శి పి.నరోత్తమరెడ్డి, కోశాధికారి అనిల్ స్వరూప్ మిశ్రాతెలిపారు. ఈ రోజుల్లో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. వారాంతం, సెలవు రోజులు కావడంతో సందర్శకుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. -
బైబై నుమాయిష్
అబిడ్స్, న్యూస్‌లైన్: నలభై ఏడు రోజులు నగరవాసులకు సరికొత్త షాపింగ్ అనుభూతిని పంచి... వినోదాల విందు చేసి... అభి‘రుచు’లకు అడ్డాగా మారిన 74వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన (నుమాయిష్) ఆదివారంతో ముగి సింది. ఆఖరి రోజు... సెలవుదినం కూడా కావడంతో ఎగ్జిబిషన్‌కు సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రతి స్టాలూ కళకళలాడింది. వినోదాల పార్కు కేరింతలతో మురిసిపోయింది. చుక్‌చుక్‌రైలు ‘బ్రేక్’ లేకుండా మైదానమంతా చుడుతూనే ఉంది. ఫుడ్‌కోర్టులు ఘుమఘుమలతో ఘాటెక్కించాయి. మొత్తానికి చివరి రోజు నుమాయిష్‌లో జోష్ అంచులను తాకింది. ఎటు చూసినా జనకళతో జోరుగా కనిపించింది. లోపలే కాదు... మైదానం వెలుపలా అదే సందడి. 20.3 లక్షలమంది ఈ ఒక్కరోజే దాదాపు 70 వేలకు పైగా సందర్శకులు వచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు. జనవరి ఒకటిన ఆరంభమైన నుమాయిష్‌ను మొత్తం కలిపి 20.30 లక్షల మంది సందర్శించారు. -
జాతీయ సమైక్యతకు చిహ్నం... నుమాయిష్
అఫ్జల్‌గంజ్, న్యూస్‌లైన్: నుమాయిష్ జాతీయ సమైక్యతకు చిహ్నంగా నిలుస్తుందని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బుధవారం రాత్రి 74వ నుమాయిష్ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళ్యాన్ జ్యోతి సేన్ గుప్తా ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. భారత రాజ్యాంగం ఎంతో ఉత్తమమైనదని, తామంతా రాజ్యాంగానికి లోబడి పని చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పోటీ ప్రపంచంలో సవాళ్లను నేటి యువత, విద్యార్థులు ధైర్యంగా ఎదుర్కొని జీవితంలో రాణించాలని సూచించారు. మారుతున్న ఆధునిక సాంకేతిక రంగానికి అనుగుణంగా విద్యార్థులు తమ భవిష్యత్‌ను మలచుకోవాలని సూచించారు. నుమాయిష్‌లో న్యాయ సలహాల కోసం ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఈ సెల్ ద్వారా కొందరికైనా ప్రయోజనం కలిగి ఉంటుందని భావిస్తున్నానన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే నుమాయిష్ వాణిజ్య పరంగా అభివృద్ధి సాధించేందుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. విద్యార్థులు, యువత నుమాయిష్‌లో స్టాళ్లను సందర్శించడం వల్ల ఆయా స్టాళ్లలో ఏర్పాటు చేసిన వివిధ రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులపై అవగాహన కలుగుతుందన్నారు. అంతకుముందు ఎగ్జిబిషన్ సొసైటీ గౌరవ కార్యదర్శి అశ్విన్‌మార్గం మాట్లాడుతూ సొసైటీ అందిస్తున్న సేవలను వివరించారు. ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు, రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖామంత్రి కె.జానారెడ్డి ప్రారంభోపన్యాసం చేస్తూ 1938 సంవత్సరం నిజాంల హయాంలో ప్రారంభమైన నుమాయిష్ అంచలంచెలుగా అభివృద్ధి సాధించి అఖిల భారత వస్తు ప్రదర్శన శాలగా ఎదిగి, అంతర్జాతీయస్థాయి ఖ్యాతిని ఆర్జించిందన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణాలోని వెనుకబడిన ప్రాంతాల్లో 18 విద్యాసంస్థలను స్థాపించి, 35వేల మంది విద్యార్థులకు విద్యనందిస్తుందన్నారు. దేశంలోనే తొలిసారిగా మహిళల కోసం ప్రత్యేకంగా పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించిన ఘనత సొసైటీకే సొంతమన్నారు. అనంతరం అఖిల భారత వస్తు ప్రదర్శన శాలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా, సందర్శకులకు అసౌకర్యం కలుగకుండా సహకరించినందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, 2012 పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పలువురు విద్యార్థులకు శంకర్జీ మెమోరియల్ గోల్డ్ మెడల్స్‌ను హైకోర్టు చీఫ్ జస్టిస్ చేతుల మీదుగా ప్రధానం చేశారు. -
ముస్తాబవుతున్న ‘నుమాయిష్’
=నాంపల్లి ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌లో చకచకా ఏర్పాట్లు =46 రోజుల పాటు విజ్ఞానం, వినోదం =కొలువుదీరనున్న 2500 స్టాళ్లు = మెట్రోరైల్ కోచ్ ప్రత్యేకాకర్షణ అబిడ్స్/అఫ్జల్‌గంజ్, న్యూస్‌లైన్: జంటనగరవాసులు, శివారు ప్రాంతాల ప్రజలను 46 రోజుల పాటు వినోద, విజ్ఞానాంశాలతో అలరించేందుకు నుమాయిష్ ముస్తాబవుతోంది. 74వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)కు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రదర్శన నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జనవరి 1న ప్రారంభమై ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. సొసైటీ ఉపాధ్యక్షులు డాక్టర్ రాజేందర్, గౌరవ కార్యదర్శి అశ్వినీ మార్గం ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు స్టాళ్ల ఏర్పాటుకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయి. నుమాయిష్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎగ్జిబిషన్ సొసైటీ తెలంగాణ ప్రాంతంలోని విద్యాసంస్థల అభివృద్ధికి కేటాయిస్తుంది. కాగా, ఈసారి తొలిసారిగా ఆర్బీఐ, కార్మిక శాఖలు స్టాళ్లను ఏర్పాటు చేయనున్నాయి. హైదరాబాద్ మెట్రోరైల్ కోచ్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. 2500 స్టాళ్లు నుమాయిష్‌లో దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తిదారులు, వ్యాపారస్తులు దాదాపు 2,500 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. మన రాష్ట్ర ఉత్పత్తులతో పాటు గుజరాత్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఢిల్లీ, అస్సాం, పశ్చిమబెంగాల్, బీహార్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాంచల్, తమిళనాడు, కర్నాటక, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. చేనేత వస్త్రాలు, డ్రెస్ మెటీరియల్స్, బెడ్షీట్లు, పిల్లో కవర్లతో పాటు గృహోపకరణాలు, గృహాలంకరణ, మహిళల అలంకరణ సామాగ్రి, పిల్లల ఆట వస్తువులు కొలువుదీరనున్నాయి. పటిష్ట భద్రత ఏటా నుమాయిష్‌ను 22 లక్షల మంది సందర్శిస్తుంటారని సొసైటీ ఉపాధ్యక్షులు డాక్టర్ రాజేందర్, గౌరవ కార్యదర్శి అశ్వనీమార్గం తెలిపారు. ఈసారీ అదేరీతిలో సందర్శకులు వచ్చే అవకాశం ఉందన్నారు. పోలీసులతో పాటుగా 300 మంది సొసైటీ వాలంటీర్లు, సెక్యూరిటీ సిబ్బంది భద్రత విధుల్లో పాల్గొంటారన్నారు. ప్రతి సందర్శకుడిని మెటల్, హ్యాండ్ డిటెక్టర్ల ద్వారా తనిఖీ చేశాకే లోనికి అనుమతిస్తామన్నారు. 25 సీసీ కెమెరాలు, 2 డాగ్‌స్క్వాడ్‌లు, 4 ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పిల్లలకు పండగే..పండగ ఎగ్జిబిషన్ సొసైటీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న ఎమ్యూజ్మెంట్ విభాగం విద్యార్థులు, చిన్నారులను అలరించనుంది. ఇందులో ఏర్పాటు చేసే రంగులరాట్నం, చుక్‌చుక్‌రైలు, సర్కస్, జెయింట్‌వీల్ వంటివి ఆహ్లాదాన్ని పంచనున్నాయి.