ఏపీఎన్‌జీవోల సమ్మెపై భిన్న తీర్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీఎన్‌జీవోలు చేపట్టిన సమ్మెపై హైకోర్టులో జరుగుతున్న విచారణ మళ్లీ మొదటికొచ్చింది. సమ్మెను చట్ట విరుద్ధంగా ప్రకటించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ ఖండవల్లి చంద్రభానులు పరస్పర భిన్నమైన తీర్పులు వెలువరించారు. సమ్మె చట్ట విరుద్ధమని ప్రధాన న్యాయమూర్తి ప్రకటించగా, సమ్మెపై దాఖలైన పిటిషన్‌లో ప్రజా ప్రయోజనాలు లేవని, రాజకీయ ప్రయోజనాల్లో భాగంగానే ఈ వ్యాజ్యాలు దాఖలు చేశారని జస్టిస్ భాను తేల్చి చెప్పారు. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై మూడో న్యాయమూర్తి విచారణ జరిపి నిర్ణయం వెలువరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని, రాజకీయ అంశమైన రాష్ట్ర విభజన గురించి సమ్మె చేసే హక్కు ప్రభుత్వ ఉద్యోగులకు లేదంటూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది రవికుమార్, ఆల్ ఇండియా బీసీ, ఓబీసీ పార్టీ అధ్యక్షుడు టి.దానయ్య వేర్వేరుగా హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో సమ్మెను సమర్ధిస్తూ పలు ఉద్యోగ సంఘాలు అనుబంధ పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యాలన్నిటిపై సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో దాదాపు 20 రోజులకు పైగా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు తీర్పు వెలువరించింది.
తీర్పు వెలువరించడానికి ధర్మాసనం సిద్ధమవుతున్న సమయంలో సమ్మె చేస్తున్న ఉద్యోగుల తరఫు సీనియర్ న్యాయవాది ఎమ్మెస్ ప్రసాద్ జోక్యం చేసుకుంటూ, ఏపీఎన్‌జీవోలు గత నెల 17న సమ్మె విరమించారని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అయితే ప్రధాన న్యాయమూర్తి అందుకు నిరాకరించి తీర్పు వెలువరించడం మొదలు పెట్టారు. ఈ వ్యాజ్యాలు విచారణార్హమైనవేనని ఆయన స్పష్టం చేశారు. పిటిషనర్ల వాదనతో ఏకీభవిస్తూ సమ్మె చట్ట విరుద్ధమని, సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. సమ్మె వల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం వాటిల్లిందో ఆ మొత్తాన్ని సమ్మెల్లో పాల్గొన్న ఉద్యోగుల నుంచి వసూలు చేయాలని సూచించారు. ఏపీఎన్జీవోల వాదనతో ఏకీభవించిన జస్టిస్ భాను ప్రధాన న్యాయమూర్తి తీర్పుతో విభేదించారు.
అయితే పిటిషన్ల విచార ణార్హతకు మాత్రమే పరిమితమై తీర్పు చెబుతూ.. ఈ వ్యాజ్యాలు ఎంత మాత్రం విచారణార్హం కావని తేల్చి చెప్పారు. ఇవి రాజకీయ ప్రయోజనాల కోసం దాఖలు చేసిన వ్యాజ్యాలే తప్ప, ఇందులో ప్రజా ప్రయోజనాలు ఎంత మాత్రం లేవని స్పష్టం చేశారు. పిటిషనర్ రవికుమార్ కూడా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. అప్పుడు గుర్తుకు రాని ప్రజా ప్రయోజనాలను ఇప్పుడు ప్రస్తావిస్తూ పిల్ రూపంలో పిటిషన్ దాఖలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పైగా ఏపీఎన్‌జీవోల సమ్మె వల్ల తాను ఇబ్బంది పడినట్టు పిటిషనర్ కానీ ఇతరులెవరూ ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు. పరస్పర విభిన్న తీర్పుల నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని మూడో న్యాయమూర్తికి నివేదిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. ఏ న్యాయమూర్తి విచారించనున్నారనే విషయంపై నాలుగైదు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సదరు న్యాయమూర్తి మళ్లీ మొదటినుంచీ ఇరుపక్షాల వాదనలు వినాల్సి ఉంటుంది.