సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగితే తమకు తీవ్ర నష్టం జరుగుతుందని, భవిష్యత్తు అంధకారమవుతుందని, అందుకే విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ హైకోర్టుకు నివేదించింది. రాజ్యాంగం ద్వారా తమకు సంక్రమించిన హక్కులకు విభజన వల్ల విఘాతం కలుగుతుందని ఆ సంఘం అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు తెలిపారు. విభజనను కేవలం ఉద్యోగులు మాత్రమే వ్యతిరేకించడం లేదని, సీమాంధ్రలోని నాలుగు కోట్ల మంది ప్రజలు గత నెలరోజులుగా తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తూ సమైక్యాంధ్రప్రదేశ్ కోసం ఒత్తిడి తెస్తున్నారని వివరించారు.
ఏపీఎన్‌జీవో, సీమాంధ్ర సచివాలయం ఫోరం చేస్తున్న సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో తమనూ ప్రతివాదులుగా చేర్చుకోవాలని, పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామంటూ తమ అసోసియేషన్ తరఫున వెంకటేశ్వర్లు ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సోమవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. విభజన వల్ల రాష్ట్రపతి ఉత్తర్వులు అమలులో ఉండవని, దీనివల్ల ఉద్యోగుల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలగడంతోపాటు ఉద్యోగావకాశాలు కూడా తగ్గిపోతాయని పిటిషన్‌లో ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుతం ఈ పిల్ దాఖలు చేసిన న్యాయవాది గతంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని వివరించారు.
అందువల్ల ఈ వ్యాజ్యంలో ప్రజా ప్రయోజనాలు లేవని.. రాష్ట్ర విభజనపై తాము వ్యక్తం చేస్తున్న ఆందోళనలను, ఆగ్రహాన్ని అణచివేయడానికి రాజకీయ చర్యల్లో భాగంగానే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని తెలిపారు. తెలంగాణ ప్రాంత ఎన్‌జీవోలు సైతం గతంలో సమ్మెకు వెళ్లి తెలంగాణ ప్రాంతంలో కార్యకలాపాలను స్తంభింపజేశారని, ఈ విషయం పిటిషనర్‌కు సైతం తెలుసునని పేర్కొన్నారు. న్యాయవాది అయిన పిటిషనర్, తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో కోర్టు విధులను అడ్డుకున్నారని, అది తన హక్కుగా భావించారని, అలాంటప్పుడు అదే పిటిషనర్ ఇప్పుడు తమ హక్కులను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ ఈ పిల్‌ను కొట్టివేయాలని వెంకటేశ్వర్లు కోర్టును కోరారు.
విభజనతో మాకు నష్టం
Published Sun, Sep 1 2013 4:02 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement