సమ్మె చట్టబద్ధమా..? కాదా..?
సాక్షి, హైదరాబాద్: ఏపీఎన్‌జీవోలు, సీమాంధ్ర సెక్రటేరియట్ ఫోరంలు చేస్తున్న సమ్మె చట్టబద్ధమా..? కాదా..? అన్న విషయాన్ని మాత్రమే తాము తేలుస్తామని, రాజకీయపరమైన అంశాలతో తమకు ఎటువంటి సంబంధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగులు సమాజంలో భాగమని, రాజ్యాంగ విధులను నెరవేర్చాల్సిన బాధ్యత వారిపై ఉందని తెలిపింది. సమ్మెకు సంబంధించి పూర్తి వివరాలతో శుక్రవారం నాటికి కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీఎన్‌జీవోలు, సీమాంధ్ర సెక్రటేరియట్ ఫోరంలను మరోసారి ఆదేశించిన హైకోర్టు, విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని, రాజకీయ అంశమైన రాష్ట్ర విభజన గురించి సమ్మె చేసే హక్కు ప్రభుత్వ ఉద్యోగులకు లేదంటూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది రవికుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని గతవారం విచారించి, ఎన్‌జీవోలకు, సీమాంధ్ర సెక్రటేరియట్ ఫోరంలకు నోటీసులు జారీ చేసిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, సోమవారం దానిని మరోసారి విచారించింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిందని విచారణ ప్రారంభం కాగానే పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.
నాలుగైదు రోజుల గడువునిస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని ఏపీఎన్‌జీవోల తరఫు సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి తెలిపారు. గతవారం కూడా ఇలానే చెప్పారు కదా... అని ధర్మాసనం ప్రశ్నించింది. ఎన్‌జీవో నాయకులు అందుబాటులో లేరని, ఈ విషయం తెలియని జూనియర్ న్యాయవాది, కోర్టుకు ఆ విధంగా చెప్పి ఉండవచ్చునని మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ సమయంలో మరో సీనియర్ న్యాయవాది ఎస్.ఆర్.అశోక్ జోక్యం చేసుకుంటూ... ఎక్సైజ్ ఉద్యోగులు ఈ కేసులో ప్రతివాదిగా చేరాలని భావిస్తున్నారని, అందువల్ల ఈ కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు తమకు అనుమతినివ్వాలని కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది. ‘‘కౌంటర్లు లేకుండా ఈ కేసులను ఎలా విచారించాలి..? శాంతిభద్రతల పరిరక్షణమే మాకు ముఖ్యం. రాజకీయపరమైన అంశాలతో మాకు ఎటువంటి సంబంధం లేదు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉంది. చట్టబద్ధమైన కారణాలు ఉంటే తప్ప విధులకు ఆటంకం కలిగించడానికి వీల్లేదు’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ విషయాలన్నింటినీ తేల్చే ముందు అసలు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయడంలో పిటిషనర్ ఉద్దేశాలు ఏమిటో స్పష్టంగా తెలుసుకోవాలని మోహన్‌రెడ్డి కోరారు. ‘‘సమ్మె చట్టబద్ధమా..? కాదా..? అన్న విషయమే మాకు ముఖ్యం. వారు చేస్తున్న సమ్మె సరైందేనని తేలితే అది చట్టబద్ధమైందని చెబుతాం. సరైంది కాకుంటే సమ్మె చట్ట వ్యతిరేకమని తేలుస్తాం. మాకు సెంటిమెంట్లు, భావోద్వేగాలు మాకు ముఖ్యం కాదు’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని, ఒకవేళ దాఖలు చేయకుంటే కేసును విచారిస్తూ వెళతామని తేల్చి చెప్పింది.
అన్ని చర్యలూ తీసుకుంటున్నాం: ప్రభుత్వం
ఏపీఎన్‌జీవోల సమ్మెవల్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను తొలగించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారని, అత్యవసర సేవలకు, శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నామని తెలిపింది.
సమ్మె నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులను అధిగమించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలన్న ధర్మాసనం ఆదేశాల మేరకు సాధారణ పరిపాలనశాఖ డిప్యూటీ సెక్రటరీ జి.కృష్ణవేణి కౌంటర్ దాఖలు చేశారు. బదిలీలు, పదోన్నతులు, సీనియారిటీ వ్యవహారాల్లో అనిశ్చితి, 10వ పీఆర్‌సీ, మధ్యంతర భృతి, నగదురహిత ఆరోగ్యకార్డులు, రాష్ట్ర విభజన ప్రక్రియను నిలుపుదల చేయడం తదితర అంశాలపై ఏపీఎన్‌జీవో, సెక్రటేరియట్ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం నోటీసులు ఇచ్చాయని తెలిపారు. మొత్తం పరిస్థితిని ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తోందని, ఉద్యోగ సంఘాలతో మంత్రుల బృందం రెండుసార్లు చర్చలు జరిపిందని పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ ఈ వ్యాజ్యాన్ని కొట్టివేయాలని ఆమె కోర్టును కోరారు.