ప్రజలకు సమస్యగా మోసపూరిత పత్రాలు
- హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
- జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా
ఏఎన్‌యూ (గుంటూరు): మోసపూరితంగా తయారు చేసే పత్రాలు సామాన్య ప్రజలకు సమస్యగా మారాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్ట్స్, కామర్స్, లా కళాశాలతో పాటు హైదరాబాద్‌కు చెందిన ట్రూత్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో ‘ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్’ అనే అంశంపై శనివారం వర్సిటీలో వర్క్‌షాప్ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..
ప్రస్తుతం దేశంలో సరిహద్దు ప్రాంతాల్లో నకిలీ నోట్ల చెలామణి అధికంగా ఉందన్నారు. నకిలీలను గుర్తించే సరైన పరిజ్ఞానం లేని కారణంగా ఎంతోమంది మోసపోతున్నారన్నారు. నకిలీపై సామాన్యులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ల్లో ఫోర్జరీల సమస్య అధికంగా ఉంటోందన్నారు. మరణ ధ్రువీకరణ పత్రాల్లో కూడా మోసపూరితమైనవి వెలుగు చూస్తున్నాయన్నారు.
ఫోర్జరీ పత్రాలు హింసాత్మక ఘటనలకు దారి తీస్తున్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో నకిలీల సమస్య అధికమైందన్నారు. హత్యలు, అత్యాచారాల కంటే మోసపూరిత కేసులు అధికంగా ఉంటున్నాయనీ, వీటి ద్వారా కోట్లలో లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఏఎన్‌యూ లా డీన్ ఆచార్య వైపీ రామసుబ్బయ్య, విభాగాధిపతి ఆచార్య ఎల్ జయశ్రీ, ట్రూత్ ల్యాబ్స్ డెరైక్టర్ డాక్టర్ టీఎస్‌ఎన్ మూర్తి, గుంటూరు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎం రఫి, కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మురళి తదితరులు పాల్గొన్నారు.