ఆ జీవోలతో కబ్జాదారులకే లబ్ధి
- భూముల క్రమబద్ధీకరణపై హైకోర్టు ఆక్షేపణ
- చట్టాలను ఉల్లంఘించిన వారికి అనుకూలంగా జీవోలా?
- దీనిపై లోతైన విచారణ జరపాల్సి ఉంటుందన్న ధర్మాసనం
- కౌంటర్ దాఖలు చేయాలని సర్కారుకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఆక్రమిత ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు రాష్ర్ట ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు తప్పుబట్టింది. వాటినుద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. భూ ఆక్రమణదారులకు లబ్ధి చేకూర్చేలా ఆ జీవోలు ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. చట్టాలను ఉల్లంఘించి భూములను ఆక్రమించుకున్న వారికి అనుకూలంగా క్రమబద్దీకరణ చేస్తూ పోతే, చట్టాలను గౌరవించే వారు ఎప్పటికీ లబ్ధి పొందే అవకాశముండదని కోర్టు అభిప్రాయపడింది.
తెలంగాణ సర్కారు చేపట్టిన భూముల క్రమబద్ధీకరణ వ్యవహారమంతా కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డిని ఆదేశించింది.
ఆ కౌంటర్‌కు మరో రెండు వారాల్లో తిరుగు సమాధానమివ్వాలని పిటిషనర్లను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఆక్రమణదారుల కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను వారి పేరు మీద క్రమబద్ధీకరించే నిమిత్తం రాష్ర్ట ప్రభుత్వం గత నెల 30న జారీ చేసిన జీవో 58, 59లను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ పి.ఎస్.విశ్వేశ్వరరావు, ఆప్ పార్టీ నేత మీర్ మహ్మద్ ఆలీ, ఉద్యోగి జైశ్వాల్ సంయుక్తంగా, లెక్చరర్ అన్వర్‌ఖాన్, తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి అమరవాణి నర్సాగౌడ్ వేర్వేరుగా హైకోర్టులో గత వారం ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యాలపై ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, ఆ పని చేయకుండా వాటిని ఆక్రమణదారులకే ఉచితంగానో లేక కొంత రుసుముతోనో కట్టబెట్టేందుకు క్రమబద్ధీకరణ జీవోలను జారీ చేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ప్రజా విధానం పేరుతో ప్రభుత్వం కబ్జాదారులను రక్షించే ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు.
ఈ జీవోలను అడ్డంపెట్టుకుని బినామీలను తెరపైకి తీసుకువచ్చి తమ కబ్జాలో ఉన్న భూములను ఆక్రమణదారులు క్రమబద్ధీకరించుకునే అవకాశముందని కోర్టుకు నివేదించారు. కాగా, ప్రభుత్వం తరఫున ఏజీ స్పందిస్తూ.. ప్రభుత్వం సదుద్దేశంతోనే ఈ జీవోలను జారీ చేసిందని, ఇది ప్రభుత్వ విధాన నిర్ణయమని చెప్పారు. సామాజిక న్యాయంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని, దీనివల్ల ఎంతో మంది పేదలకు న్యాయం జరుగుతుందని వివరించారు.
ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తుంటే ఆక్రమణదారులకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ జీవోలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. చట్టాలను ఉల్లంఘించిన వారికి అనుకూలంగా భూములను క్రమబద్ధీకరించుకుంటూ పోతే, చట్టాలను గౌరవించే వ్యక్తులకు ప్రభుత్వ జీవోల వల్ల ఎలాంటి ఫలితం ఉండదని, వాటి ఫలాలు దక్కవని వ్యాఖ్యానించింది. ఈ జీవోలను లోతుగా విచారించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. తామిచ్చే తుది తీర్పునకు లోబడే భూముల క్రమబద్ధీకరణ ఉంటుందని స్పష్టంచేసింది. ఈ విషయాన్ని దరఖాస్తుదారులందరికీ పత్రికాముఖంగా తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.