‘ఫాస్ట్’పై పునరాలోచన
- త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం
- హైకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వం వెల్లడి
- విచారణ 15 రోజులకు వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సాయం(ఫాస్ట్) పేరుతో తీసుకొచ్చిన పథకంపై పునరాలోచన చేస్తున్నామని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని రాష్ర్ట ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చేసిన ఈ ప్రకటనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం నమోదు చేసుకుని తదుపరి విచారణను 15 రోజులకు వాయిదా వేసింది.
తెలంగాణలో 1956 నవంబర్ 1 నాటికి స్థిరపడిన కుటుం బాల విద్యార్థులకే ఆర్థిక సాయం అందచేసేలా ఫాస్ట్ నిబంధనలు రూపొందించడాన్ని(జీవో 36) సవాల్ చేస్తూ టీడీపీ ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, మాజీ మం త్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ హైకోర్టులో వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు విచారణ చేసిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది.
అడ్వొకేట్ జనరల్ తరఫున అతని జూనియర్ న్యాయవాది పవన్‌కుమార్ హాజరై, విచారణను రెండు వారాలకు వాయిదా వేయాలని కోరారు. ఫాస్ట్ జీవోపై ఇటీవల జరిగిన పరిణామాలను కోర్టు ముం దుంచుతామని తెలిపారు. దీనిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. జీవోపై కౌంటర్ దాఖలు చేయాలని గత విచారణ సమయంలో ఆదేశించామని, అడ్వొకేట్ జనరల్ మొహం చూసి కౌంటర్ దాఖలుకు చివరి అవకాశం ఇచ్చామని, అయినా కౌంటర్ వేయకపోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించింది.
మీకు (ప్రభుత్వానికి) కౌంటర్ దాఖలు చేయాలని అనిపించడం లేదా అని నిలదీసింది. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ వచ్చి ఫాస్ట్‌పై ప్రభుత్వం పునరాలోచన చేస్తోందని, త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీంతో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.