
బలవంతంగా సర్వే చేయొద్దు: హైకోర్టు
హైదరాబాద్: సమగ్ర కుటుంబ సర్వేలో ప్రజలు పాల్గొనడం తప్పనిసరి కాదని హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. సర్వేలో పాల్గొనడం, పాల్గొనకపోవడం ప్రజల ఇష్టమని కోర్టుకు తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి తాము చొరబడడం లేదని అన్నారు. సంక్షేమ పథకాల అమలు కోసమే సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు.
వాదనలు విన్న తర్వాత సమగ్ర సర్వేకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. స్వచ్ఛందంగా సర్వే నిర్వహించుకుంటే అభ్యంతరం లేదని పేర్కొంది. వ్యక్తిగత వివరాలు అడిగి ఇబ్బంది పెట్టొద్దని హైకోర్టు సూచించింది. బలవంతంగా సర్వే చేయొద్దని, సర్వే సమయంలో ప్రజలపై ఒత్తిడి తేవొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. బ్యాంకు ఖాతా, తపాల ఖాతా, మొబైల్ నంబర్లు ప్రజల వ్యక్తిగతమని పేర్కొంది. సర్వే ఐచ్చికమన్న తెలంగాణ అడ్వకేట్ జనరల్ ప్రకటనను కోర్టు రికార్డు చేసింది.