సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా, దుబ్బాకను నగర పంచాయతీగా మారుస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓను కొట్టివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
మెదక్ జిల్లాలోని ధర్మాజీపేట, లచ్చపేట, చెర్వపూర్, దుంపలపల్లి, చెల్లాపూర్, మల్లయ్యపల్లి గ్రామ పంచాయతీలను కలిపి దుబ్బాక నగర పంచాయతీగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 31న జీఓ జారీ చేసింది. ఈ జీఓను సవాలు చేస్తూ దుబ్బాకకు చెందిన గుండబోయిన ఆంజనేయులు, కూరపాటి బంగారయ్య మరో 16 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ రమేష్ రంగనాథన్ ఈ ఏడాది జూన్ 27న తీర్పునిస్తూ.. గ్రామ పంచాయతీల అభిప్రాయాలను, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే ప్రభుత్వం నగర పంచాయతీని ఏర్పాటు చేసిందని, అందువల్ల జీఓను కొట్టివేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ తీర్పును సవాలు చేస్తూ మెదక్‌కు చెందిన వి.సుభద్ర ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌ను ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, గురువారం మరోసారి విచారించింది. సుభద్ర తరఫున ఎన్.శ్రీధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, అసలు సింగిల్ జడ్జి ముందు పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్లు ఆ పిటిషన్‌లో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చలేదని తెలిపారు.
రాష్ట్ర విభజనకు ముందు పిటిషన్ దాఖలు చేశారని, విభజన తర్వాత పిటిషన్‌కు సవరణలు చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చలేదని, అందువల్ల సింగిల్ జడ్జి ఉత్తర్వులను అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై లేదని వివరించారు. దీనికి రిట్ పిటిషనర్ల తరఫు న్యాయవాది సమాధానమిస్తూ, సవరణలు చేస్తూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశామని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే సింగిల్ జడ్జి తీర్పులో ఎక్కడా కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు ఉన్నట్లు లేకపోవడాన్ని ధర్మాసనం గుర్తించింది.
శ్రీధర్‌రెడ్డి లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తిరిగి ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టాలని సింగిల్ జడ్జిని ఆదేశించింది. వారంలోపు రిట్ పిటిషనర్లు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతివాదిగా చేరుస్తూ అనుబంధ పిటిషన్ దాఖలు చేయాలని, ఒకవేళ అలా దాఖలు చేయకపోతే పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు భావించాల్సి ఉంటుందని తెలిపింది.
కొస మెరుపు..
ఇదిలా ఉంటే నగర పంచాయతీ జీఓను కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పును అధికారులు అమలు చేయడం లేదంటూ రిట్ పిటిషనర్లు సింగిల్ జడ్జి వద్ద పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన న్యాయమూర్తి, అధికారుల చర్యలను సమోటోగా కోర్టు ధిక్కారంగా పరిగణించారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేయనందుకు పురపాలకశాఖ, పంచాయతీరాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులకు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసి, వివరణ కోరారు. తాజాగా ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలతో సింగిల్ జడ్జి కోర్టు ధిక్కార ఉత్తర్వులు కూడా రద్దయినట్లే.
దుబ్బాక నగర పంచాయతీ కేసులో మలుపు
Published Thu, Nov 20 2014 11:16 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement
Advertisement