PV sanjay kumar
-
సుప్రీంకోర్టులో మరో తెలుగు న్యాయమూర్తి
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మరో తెలుగు బిడ్డ జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్ నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి శనివారం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 1963, ఆగస్టు 14న సంజయ్‌కుమార్ జన్మించారు. తల్లిదండ్రులు పద్మావతమ్మ, రామచంద్రారెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1969 నుంచి 1982 వరకు అడ్వొకేట్ జనరల్‌గా రామచంద్రారెడ్డి విధులు నిర్వహించారు. వీరిది కడప జిల్లా అయినా సంజయ్‌కుమార్ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. నిజాం కాలేజీలో డిగ్రీ చదివిన తర్వాత.. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పూర్తి చేశారు. 1988లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2000 నుంచి 2003 వరకు ప్రభుత్వ న్యాయవాదిగానూ సేవలందించారు. 2008, ఆగస్టు 8న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు అడిషనల్ జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. 2010, జనవరి 20న శాశ్వత న్యాయమూర్తిగా నియామకం అయ్యారు. 2019, అక్టోబర్ 14న పంజాబ్–హరియాణా హైకోర్టుకు బదిలీపై వెళ్లారు. ఆపై మణిపూర్ హైకోర్టు సీజేగా పదోన్నతిపై వెళ్లారు. -
హైకోర్టులో న్యాయవాదుల నిరసన
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌ను పంజాబ్–హరియాణా హైకోర్టుకు బదిలీ చేయాలన్న సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సును రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదులు విధులను బహిష్కరించడంతో బుధవారం హైకోర్టు కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. రాష్ట్రంలోని పలు కింది కోర్టుల్లోనూ ఇలాగే విధుల బహిష్కరణ జరిగింది. ఉదయం హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభం కాగానే న్యాయవాదులందరూ ప్రతీ కోర్టు హాలుకు వెళ్లి విధుల బహిష్కరణకు సహకరించాలని న్యాయమూర్తులను కోరారు. దీంతో న్యాయమూర్తులందరూ బెంచీలు దిగి తమ చాంబర్లకు వెళ్లిపోయారు. అనంతరం జస్టిస్ సంజయ్‌కుమార్ విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయాన్ని న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని హైకోర్టు వద్ద ర్యాలీ నిర్వహించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు హైకోర్టు న్యాయవాదుల సంఘం సర్వసభ్య సమావేశం మరోసారి జరిగింది. సోమవారం తమ కార్యాచరణను ప్రకటిస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యకరణ్‌రెడ్డి తెలిపారు. సుప్రీం సీజేను కలిసే ప్రయత్నాలు.. జస్టిస్ సంజయ్‌కుమార్ బదిలీ విషయంలో హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యవర్గం, సీనియర్ న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌ను కలవాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్రపతి, న్యాయ మంత్రిని కూడా కలిసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఆందోళన విషయాన్ని సిటీ సివిల్ కోర్డు చీఫ్ జడ్జికి తెలియజేయాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా, రంగారెడ్డి జిల్లా బుద్వేలు గ్రామానికి హైకోర్టు తరలించాలని, ఆ గ్రామంలో హైకోర్టుకు కొత్త భవనాలు నిర్మించాలనే ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హైకోర్టు పరిరక్షణ సమితి పేరిట న్యాయవాదుల నిరసన కార్యక్రమం అయిదో రోజు బుధవారం కూడా కొనసాగింది. తరలింపు ఇప్పట్లో జరగదని, న్యాయవాదులకు కొత్త చాంబర్లు నిర్మిస్తామని ప్రధాన న్యాయమూర్తిని కలసినప్పుడు తమకు చెప్పారని న్యాయవాదులు తెలిపారు. ఏపీలో నేడు, రేపు విధులకు గైర్హాజరు.. జస్టిస్ సంజయ్‌కుమార్ బదిలీని రద్దు చేయాలని ఏపీ రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం సమావేశం కోరింది. గురు, శుక్రవారాలు 2 రోజులు కోర్టులకు హాజరుకారాదని నిర్ణయించింది. సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కుమార్ బదిలీ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని, వేరే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేయాలని సమావేశం కోరింది. -
పరిమితికి మించి ఖర్చు చేస్తున్న పార్టీలపై ఏం చర్యలు తీసుకున్నారు?
పూర్తి వివరాలను కోర్టు ముందుంచండి కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో నిర్దేశించిన దాని కంటే అధిక మొత్తాలు ఖర్చు చేస్తున్న రాజకీయ పార్టీలపై ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారో, ఇకపై ఏం చర్యలు తీసుకుంటారో వివరించాలని హైకోర్టు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ విషయంలో రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవాలని, అసలు దేశంలో ఎన్ని గుర్తింపు పొందిన, రిజిస్టర్ అయిన పార్టీలు ఉన్నాయో కూడా తెలియజేయాలని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో అధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నాయని, ఈ విషయంలో కొత్త నిబంధనలను రూపొందించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన కింగ్షుక్ నాగ్ అనే వ్యక్తి హైకోర్టుకు లేఖ రాశారు. దీన్ని పరిశీలించిన హైకోర్టు.. పిల్‌గా పరిగణించి హైకోర్టు విచారించింది. -
దుబ్బాక నగర పంచాయతీ కేసులో మలుపు
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా, దుబ్బాకను నగర పంచాయతీగా మారుస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓను కొట్టివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లాలోని ధర్మాజీపేట, లచ్చపేట, చెర్వపూర్, దుంపలపల్లి, చెల్లాపూర్, మల్లయ్యపల్లి గ్రామ పంచాయతీలను కలిపి దుబ్బాక నగర పంచాయతీగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 31న జీఓ జారీ చేసింది. ఈ జీఓను సవాలు చేస్తూ దుబ్బాకకు చెందిన గుండబోయిన ఆంజనేయులు, కూరపాటి బంగారయ్య మరో 16 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ రమేష్ రంగనాథన్ ఈ ఏడాది జూన్ 27న తీర్పునిస్తూ.. గ్రామ పంచాయతీల అభిప్రాయాలను, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే ప్రభుత్వం నగర పంచాయతీని ఏర్పాటు చేసిందని, అందువల్ల జీఓను కొట్టివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ తీర్పును సవాలు చేస్తూ మెదక్‌కు చెందిన వి.సుభద్ర ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌ను ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, గురువారం మరోసారి విచారించింది. సుభద్ర తరఫున ఎన్.శ్రీధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, అసలు సింగిల్ జడ్జి ముందు పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్లు ఆ పిటిషన్లో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చలేదని తెలిపారు. రాష్ట్ర విభజనకు ముందు పిటిషన్ దాఖలు చేశారని, విభజన తర్వాత పిటిషన్‌కు సవరణలు చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చలేదని, అందువల్ల సింగిల్ జడ్జి ఉత్తర్వులను అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై లేదని వివరించారు. దీనికి రిట్ పిటిషనర్ల తరఫు న్యాయవాది సమాధానమిస్తూ, సవరణలు చేస్తూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశామని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే సింగిల్ జడ్జి తీర్పులో ఎక్కడా కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు ఉన్నట్లు లేకపోవడాన్ని ధర్మాసనం గుర్తించింది. శ్రీధర్‌రెడ్డి లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తిరిగి ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టాలని సింగిల్ జడ్జిని ఆదేశించింది. వారంలోపు రిట్ పిటిషనర్లు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతివాదిగా చేరుస్తూ అనుబంధ పిటిషన్ దాఖలు చేయాలని, ఒకవేళ అలా దాఖలు చేయకపోతే పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు భావించాల్సి ఉంటుందని తెలిపింది. కొస మెరుపు.. ఇదిలా ఉంటే నగర పంచాయతీ జీఓను కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పును అధికారులు అమలు చేయడం లేదంటూ రిట్ పిటిషనర్లు సింగిల్ జడ్జి వద్ద పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన న్యాయమూర్తి, అధికారుల చర్యలను సమోటోగా కోర్టు ధిక్కారంగా పరిగణించారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేయనందుకు పురపాలకశాఖ, పంచాయతీరాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులకు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసి, వివరణ కోరారు. తాజాగా ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలతో సింగిల్ జడ్జి కోర్టు ధిక్కార ఉత్తర్వులు కూడా రద్దయినట్లే. -
ఆ చికిత్స దేశంలో అందుబాటులో లేదా?
అసలు ఈ విషయాన్ని కనీసం పరిశీలించారా? శైలజానాథ్ చికిత్సకు రూ.43.66 లక్షలు కేటాయింపుపై సర్కారును నిలదీసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: అమెరికాలో చికిత్స చేయించుకునేందుకు మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌కు రూ.43.66 లక్షలు కేటాయిస్తూ జారీ చేసిన జీవోపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. శైలజానాథ్‌కు అవసరమైన చికిత్స మనదేశంలో అందుబాటులో లేదా? అని ప్రశ్నించింది. అసలు ఈ విషయాన్ని కనీసం పరిశీలించారా? అని అధికారులను నిలదీసింది. ఈ కేటాయింపులను ఎలా సమర్థించుకుంటారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. శైలజానాథ్‌కు వైద్యం కోసం రూ.43.66 లక్షలు కేటాయించడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్, శాంతినగర్‌కు చెందిన మంగీలాల్ వంకోదూత్ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం లోని ధర్మాసనం సోమవారం విచారించింది. ఛాతీ ఎడమభాగంలో వచ్చిన ట్యూమర్‌కు అమెరికా న్యూజెర్సీలోని మెమోరియల్ స్లాన్ కెట్టరింగ్ కేన్సర్ సెంటర్లో చికిత్స చేయించుకునేందుకు రూ.43.66 లక్షలు కేటాయిస్తూ ప్రభుత్వం గతనెల 17న జీవో జారీ చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది నివేదించారు. ఇందులో రూ.23.66 లక్షలు వైద్యఖర్చులకు, రూ.5 లక్షలు ప్రయాణ ఖర్చులకు, న్యూజెర్సీలో ఉండేందుకు రూ.15లక్షలు కేటాయించినట్టు తెలిపారు. శైలజానాథ్ పేదవాడు కాదని, ఆర్థికంగా ఉన్నవ్యక్తేనని, అలాంటి ఆయనకు ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడం అన్యాయమన్నారు. ఇది ప్రజాధనాన్ని దుర్విని యోగం చేయడమేనన్నారు. ఈ వాదనలతో ప్రధాన న్యాయమూర్తి ఏకీభవిస్తూ.. పూర్తి వివరాలతో కౌంటర్ల దాఖలుకు ఆదేశించారు. విచారణను మూడు వారాలపాటు వాయిదా వేశారు. -
‘విభజన’పై పిటిషన్ విచారణకు స్వీకరణ
కేంద్రానికి రాష్ట్ర హైకోర్టు నోటీసులు.. కౌంటర్ల దాఖలుకు ఆదేశం మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయం వాయిదా సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను అమలు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు సోమవారం విచారణకు స్వీకరించింది. కేంద్రప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ల దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఇదే సమయంలో పునర్వ్యవస్థీకరణ చట్టం అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్న అనుబంధ పిటిషన్‌పై ధర్మాసనం తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. పునర్వ్యవస్థీకరణ చట్టం రాజ్యాంగంలోని అధికరణలు 3, 4, 371డిలకు విరుద్ధమని, అందువల్ల ఈ చట్టాన్ని రద్దుచేయాలని కోరుతూ న్యాయవాది పి.వి.కృష్ణయ్య హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కృష్ణయ్య ధర్మాసనాన్ని అభ్యర్థించారు. దీనిపై ధర్మాసనం కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ) అభిప్రాయాన్ని కోరగా.. అధికరణ 3 ప్రకారం రాష్ట్ర విభజన చేసే అధికారం కేంద్రానికుందని ఆయన నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులకోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై నిర్ణయాన్ని వాయిదా వేసి... ప్రధాన పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
సర్వీసు వివాదాల్లో జోక్యం చేసుకోవడం తగదు
లోకాయుక్త ఆదేశాలను తప్పుబట్టిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల సర్వీసు వివాదంలో ఇద్దరు ముఖ్య కార్యదర్శులను ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ లోకాయుక్త జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు తప్పుబట్టింది. సర్వీసు వివాదాలను విచారణకు స్వీకరించడం పరిపాలనా ట్రిబ్యునల్స్ అధికారాల్లో జోక్యం చేసుకోవడమేనని అభిప్రాయపడింది. రెండు విభాగాల ముఖ్య కార్యదర్శులను హాజరుకావాలంటూ లోకాయుక్త జారీచేసిన ఉత్తర్వులను కొట్టివేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం తీర్పునిచ్చింది. పదవీ విరమణ చేసిన ఓ ఉద్యోగి సీనియారిటీ వివాదంపై దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన లోకాయుక్త... ఆర్థిక, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శులను ప్రత్యక్షంగా హాజరుకావాలంటూ గత జూన్ 16న సమన్లు జారీచేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఉద్యోగుల సర్వీసు వివాదాలను ట్రిబ్యునళ్లు మాత్రమే పరిష్కరించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది నివేదించారు. ఈ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది.