ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న న్యాయవాదులు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌ను పంజాబ్–హరియాణా హైకోర్టుకు బదిలీ చేయాలన్న సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సును రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదులు విధులను బహిష్కరించడంతో బుధవారం హైకోర్టు కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. రాష్ట్రంలోని పలు కింది కోర్టుల్లోనూ ఇలాగే విధుల బహిష్కరణ జరిగింది. ఉదయం హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభం కాగానే న్యాయవాదులందరూ ప్రతీ కోర్టు హాలుకు వెళ్లి విధుల బహిష్కరణకు సహకరించాలని న్యాయమూర్తులను కోరారు. దీంతో న్యాయమూర్తులందరూ బెంచీలు దిగి తమ చాంబర్లకు వెళ్లిపోయారు. అనంతరం జస్టిస్ సంజయ్‌కుమార్ విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయాన్ని న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని హైకోర్టు వద్ద ర్యాలీ నిర్వహించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు హైకోర్టు న్యాయవాదుల సంఘం సర్వసభ్య సమావేశం మరోసారి జరిగింది. సోమవారం తమ కార్యాచరణను ప్రకటిస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యకరణ్‌రెడ్డి తెలిపారు.
సుప్రీం సీజేను కలిసే ప్రయత్నాలు..
జస్టిస్ సంజయ్‌కుమార్ బదిలీ విషయంలో హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యవర్గం, సీనియర్ న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌ను కలవాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్రపతి, న్యాయ మంత్రిని కూడా కలిసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఆందోళన విషయాన్ని సిటీ సివిల్ కోర్డు చీఫ్ జడ్జికి తెలియజేయాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా, రంగారెడ్డి జిల్లా బుద్వేలు గ్రామానికి హైకోర్టు తరలించాలని, ఆ గ్రామంలో హైకోర్టుకు కొత్త భవనాలు నిర్మించాలనే ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హైకోర్టు పరిరక్షణ సమితి పేరిట న్యాయవాదుల నిరసన కార్యక్రమం అయిదో రోజు బుధవారం కూడా కొనసాగింది. తరలింపు ఇప్పట్లో జరగదని, న్యాయవాదులకు కొత్త చాంబర్లు నిర్మిస్తామని ప్రధాన న్యాయమూర్తిని కలసినప్పుడు తమకు చెప్పారని న్యాయవాదులు తెలిపారు.
ఏపీలో నేడు, రేపు విధులకు గైర్హాజరు..
జస్టిస్ సంజయ్‌కుమార్ బదిలీని రద్దు చేయాలని ఏపీ రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం సమావేశం కోరింది. గురు, శుక్రవారాలు 2 రోజులు కోర్టులకు హాజరుకారాదని నిర్ణయించింది. సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కుమార్ బదిలీ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని, వేరే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేయాలని సమావేశం కోరింది.
Comments
Please login to add a commentAdd a comment