సర్వీసు వివాదాల్లో జోక్యం చేసుకోవడం తగదు
లోకాయుక్త ఆదేశాలను తప్పుబట్టిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల సర్వీసు వివాదంలో ఇద్దరు ముఖ్య కార్యదర్శులను ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ లోకాయుక్త జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు తప్పుబట్టింది. సర్వీసు వివాదాలను విచారణకు స్వీకరించడం పరిపాలనా ట్రిబ్యునల్స్ అధికారాల్లో జోక్యం చేసుకోవడమేనని అభిప్రాయపడింది. రెండు విభాగాల ముఖ్య కార్యదర్శులను హాజరుకావాలంటూ లోకాయుక్త జారీచేసిన ఉత్తర్వులను కొట్టివేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం తీర్పునిచ్చింది. పదవీ విరమణ చేసిన ఓ ఉద్యోగి సీనియారిటీ వివాదంపై దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన లోకాయుక్త... ఆర్థిక, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శులను ప్రత్యక్షంగా హాజరుకావాలంటూ గత జూన్ 16న సమన్లు జారీచేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఉద్యోగుల సర్వీసు వివాదాలను ట్రిబ్యునళ్లు మాత్రమే పరిష్కరించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది నివేదించారు. ఈ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది.