బెంగళూరు: లోకాయుక్త ప్రత్యేక కోర్టులో తనపై నమోదైన కేసులను హైకోర్టు కొట్టేసినప్పటికీ, ఆ కేసులపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవడం ద్వారా తనపై ప్రతీకార చర్యలకు దిగుతున్నారని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బి.ఎస్.యడ్యూరప్ప మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు తానెంత మాత్రం భయపడబోనని అన్నారు. గురువారమిక్కడ తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. తనపై దాఖలైన కేసుల్లో నిజం లేకపోవడం వల్లే హైకోర్టు ఆ కేసులను కొట్టేశారని అన్నారు. అయితే మరోసారి ఆ కేసులపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసేందుకు సన్నాహాలు చేస్తోందని తెలిపారు.
ఇది ప్రతీకార పూరితమైన రాజకీయాలు కాకపోతే మరేమిటని యడ్యూరప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం ద్వారా తనను మానసికంగా కుంగుబాటుకు గురిచేయాలన్నది ప్రభుత్వ దురాలోచనగా తెలుస్తోందని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ చర్యలకు తానెంతమాత్రం భయపడబోనని స్పష్టం చేశారు. హైకోర్టులో లభించినట్లుగానే సుప్రీంకోర్టులో సైతం తనకు న్యాయం లభిస్తుందని నమ్ముతున్నానని అన్నారు.