‘విభజన’పై పిటిషన్ విచారణకు స్వీకరణ
కేంద్రానికి రాష్ట్ర హైకోర్టు నోటీసులు..
కౌంటర్ల దాఖలుకు ఆదేశం
మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయం వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను అమలు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు సోమవారం విచారణకు స్వీకరించింది. కేంద్రప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ల దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఇదే సమయంలో పునర్వ్యవస్థీకరణ చట్టం అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్న అనుబంధ పిటిషన్‌పై ధర్మాసనం తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. పునర్వ్యవస్థీకరణ చట్టం రాజ్యాంగంలోని అధికరణలు 3, 4, 371డిలకు విరుద్ధమని, అందువల్ల ఈ చట్టాన్ని రద్దుచేయాలని కోరుతూ న్యాయవాది పి.వి.కృష్ణయ్య హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు.
దీనిని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కృష్ణయ్య ధర్మాసనాన్ని అభ్యర్థించారు. దీనిపై ధర్మాసనం కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్(ఏఎస్‌జీ) అభిప్రాయాన్ని కోరగా.. అధికరణ 3 ప్రకారం రాష్ట్ర విభజన చేసే అధికారం కేంద్రానికుందని ఆయన నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులకోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై నిర్ణయాన్ని వాయిదా వేసి... ప్రధాన పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.