Justice Kalyan Jyoti Sengupta
-
ప్రభుత్వాల ఇష్టానుసారం కాదు
పార్లమెంటరీ కార్యదర్శుల నియామకంపై హైకోర్టు హైదరాబాద్: పార్లమెంటరీ కార్యదర్శుల నియామక ఆర్డినెన్స్ విషయంలో ఉమ్మడి హైకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని ప్రశ్నించింది. పార్లమెంటరీ కార్యదర్శులను నియమించే అధికారం రాజ్యాంగం ప్రకారం ఎక్కడుందో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకరికి మంత్రి హోదా కల్పించాలంటే అది రాజ్యాంగ ప్రకారమే జరగాలి తప్ప, ప్రభుత్వాల ఇష్టానుసారం కాదని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు అడ్వొకేట్ జనరల్ హాజరవుతారని, విచారణను వాయిదా వేయాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఉత్తర్వులిచ్చింది. పార్లమెంటరీ కార్యదర్శుల ఆర్డినెన్స్‌ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, ఎమ్మెల్యేలు డి.వినయ్‌భాస్కర్, జలగం వెంకటరావు, వి.శ్రీనివాస్‌గౌడ్, జి.కిషోర్‌కుమార్, వి.సతీష్‌కుమార్, కోవా లక్ష్మీలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమిస్తూ జారీ చేసిన జీవోను కొట్టివేయాలంటూ నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
‘సీఆర్డీఏ’పై హైకోర్టు నోటీసులు
ఆ సంస్థ రాజ్యాంగబద్ధత సవాలు పిటిషన్‌పై స్పందన జూన్ 10లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశం తదుపరి విచారణ జూన్ మూడో వారానికి వాయిదా హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతాభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ) రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ఉమ్మడి హైకోర్టు సోమవారం స్పందించింది. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ మూడో వారానికి వాయిదా వేసింది. జూన్ 10 కల్లా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సర్కార్‌కు స్పష్టం చేసిన హైకోర్టు, ఆ వెంటనే ఆ కౌంటర్‌కు తిరుగు సమాధానం (రిప్లై) ఇవ్వాలని పిటిషనర్లను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్డీఏ చట్టం రాజ్యాంగ విరుద్ధమే కాక, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి కూడా వ్యతిరేకమంటూ విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఎ.గోపాల్‌రావు, జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి, ప్రముఖ పాత్రికేయులు ఎ.బి.కె.ప్రసాద్, సీనియర్ న్యాయవాది సి.సదాశివరెడ్డి ఇటీవల హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఏపీ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా సీఆర్డీఏ చట్ట నిబంధనలు ఉన్నాయని తెలిపారు. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం రాజధాని ప్రాంత ఎంపిక కేంద్ర ప్రభుత్వానిదేనని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ణయాధికారం లేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆ సెక్షన్ ప్రకారం కేంద్రం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ గత ఏడాది ఆగస్టు 27న తన నివేదికను సమర్పించిందని తెలిపారు. వ్యవసాయ భూములకు జరిగే నష్టం కనిష్టస్థాయిలో ఉండాలన్నదే కమిటీ ప్రధాన ఉద్దేశమన్నారు. గుంటూరు జిల్లాలో 65 శాతం, కృష్ణా జిల్లాలో 56 శాతం మంది వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలుగా ఉన్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు వల్ల రైతులు భూములు కోల్పోయి, కూలీలు ఉపాధి లేక రోడ్డునపడుతారని కమిటీ తన నివేదికలో పేర్కొన్నారని ఆయన వివరించారు. విజయవాడకు 300 కిలోమీటర్ల పరిధిలో భూకంపాలు వచ్చే అవకాశం ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికను కూడా కమిటీ ప్రస్తావించిందన్నారు. భూసేకరణ చట్టం-2013 ప్రకారం బహుళ పంటల భూములను ఎట్టి పరిస్థితుల్లో సేకరించడానికి వీల్లేదని, ప్రస్తుత రాజధాని భూముల్లో బహుళ పంటలు పండే భూములే అధికంగా ఉన్నాయని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) అని పేరు పెట్టిన ప్రభుత్వం.. అంతిమంగా భూ సేకరణే చేస్తోందన్నారు. రాజధాని ప్రాంతంలో భూమిని నమ్ముకుని బతుకుతున్న కూలీలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని ప్రకాశ్‌రెడ్డి వివరించారు. 2013 భూ సేకరణ చట్టంలో వ్యవసాయ కూలీల ఉపాధికి తీసుకోవాల్సిన చర్యల గురించి స్పష్టంగా చెప్పారన్నారు. అయితే ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సీఆర్డీఏ చట్టంలో వ్యవసాయ కూలీల ఉపాధి గురించి ఎక్కడా ప్రస్తావన లేదన్నారు. కేంద్ర చట్టాన్ని పట్టించుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని తీసుకొచ్చిందని వివరించారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం, తాము ప్రస్తుతం ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించి, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తున్నామని, కౌంటర్ పరిశీలించిన తరువాతే తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తేల్చి చెప్పింది. -
'జనాభా నిష్పత్తికి తగినట్లుగా జడ్జీలు లేరు'
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా సాక్షి, హైదరాబాద్: జనాభా నిష్పత్తికి అనుగుణంగా న్యాయమూర్తులు లేరని, దీంతో న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు పేరుకుపోతున్నాయని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా అన్నారు. నేటి రోజుల్లో కోర్టులకు వెళ్లడం ఖర్చుతో కూడుకున్నది కావడంతోపాటు పరిష్కారంలో జాప్యం జరిగే పరిస్థితి ఉందన్నారు. తనకు ఏదైనా సమస్య వస్తే న్యాయస్థానాలకు వెళ్లకుండా ప్రత్యామ్నాయ విధానాల ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తానని సీజే చెప్పారు. నల్సార్, ఐసీఏడీఆర్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారం (ఏడీఆర్), కుటుంబ వివాదాల పరిష్కారం (ఎఫ్డీఆర్)లో పీజీ డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులకు డిగ్రీలు ప్రదానం చేసే కార్యక్రమానికి సీజే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్థిక అసమానతలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం అందాలనే లక్ష్యంతో ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కార (ఏడీఆర్) విధానం పనిచేస్తోంద న్నారు. న్యాయవ్యవస్థకు నిధుల కేటాయింపు తక్కువగా ఉందని, స్థూల జాతీయాదాయంలో ఒక శాతం నిధులను న్యాయవ్యవస్థకు కేటాయించాలని సూచించారు. జడ్జీల ఖాళీలన్నింటినీ వెంటనే భర్తీ చేస్తే పెండింగ్ కేసులన్నీ పరిష్కారమవుతాయని చెప్పారు. ఈ సందర్భంగా ఏడీఆర్ కోర్సుల్లో బంగారు, వెండి పతకాలు సాధించిన ఎం.పార్థసారథి, కె.సంహితలతోపాటు కోర్సులు పూర్తి చేసిన 124 మంది అభ్యర్థులకు జస్టిస్ సేన్‌గుప్తా డిగ్రీలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నల్సార్ వీసీ ప్రొఫెసర్ ఫైజాన్ ముస్తఫా, రిజిస్ట్రార్ వి.బాలకిష్టారెడ్డి, ఐసీఏడీఆర్ ప్రాంతీయ కార్యాలయం ఇన్చార్జి పాల్గొన్నారు. అందరికీ న్యాయఫలాలు అందాలి అంబేడ్కర్ ఆశయం నెరవేరాలంటే.. ప్రజలందరికీ ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు న్యాయఫలాలు అందాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్ గుప్తా అన్నారు. హైకోర్టు ప్రాంగణంలో ఏపీ బార్ కౌన్సిల్, హైకోర్టు న్యాయవాదుల సంఘం సంయుక్తంగా నిర్వహించిన అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలకు సీజే ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు జస్టిస్ గుండా చంద్రయ్య, జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, ఏపీ అడ్వొకేట్ జనరల్ పి.వేణుగోపాల్, తెలంగాణ అదనపు ఏజీ జె.రామచంద్రరావు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. -
వేర్వేరు హైకోర్టుల ఏర్పాటును పరిశీలించండి...
ఉమ్మడి హైకోర్టు సీజేకు కేంద్ర మంత్రి సదానందగౌడ లేఖ ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది గచ్చిబౌలిలో భవనాన్ని కూడా గుర్తించింది లేఖలో సీజే దృష్టికి తీసుకొచ్చిన కేంద్ర న్యాయశాఖ మంత్రి హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలకూ రెండు వేర్వేరు హైకోర్టులు ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తాకు కేంద్ర న్యాయశాఖ మంత్రి డి.వి.సదానందగౌడ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన రెండు రోజుల క్రితం జస్టిస్ సేన్‌గుప్తాకు ఓ లేఖ రాశారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా గత ఏడాది జూన్ 2న ఏర్పడిన విషయం మీకు తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సచివాలయం, శాసనసభ, మండలి భవనాలను రెండు రాష్ట్రాలకూ విభజించారు. ఇవి రెండూ అన్ని సౌకర్యాలతో ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో కొనసాగుతున్నాయి. అయితే రెండు రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టుల ఏర్పాటు మాత్రం జరగలేదు. తెలంగాణకు చెందిన న్యాయవాదులు, ప్రజా ప్రతినిధులు తెలంగాణ రాష్ట్రానికి వేరే హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 18న రెండు రాష్ట్రాలకూ రెండు వేర్వేరు హైకోర్టుల ఏర్పాటు చేయాలని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. హైకోర్టుకు గచ్చిబౌలి ప్రాంతంలో 4.9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణమున్న ఓ బహుళ అంతస్తుల భవనాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించి, అందులో అన్ని సౌకర్యాల కల్పనకు ముందుకొచ్చింది. ఇదే సమయంలో హైదరాబాద్‌లో రెండు వేర్వేరు హైకోర్టుల ఏర్పాటుకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రత్యేక హైకోర్టు డిమాండ్‌తో న్యాయవాదులు గత కొంత కాలంగా కోర్టు విధులను బహిష్కరించారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు విషయంలో తగిన చర్యలు తీసుకుంటామన్న హామీతో వారు ఆందోళన విరమించారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా హైదరాబాద్‌లో రెండు రాష్ట్రాలకూ రెండు వేర్వేరు హైకోర్టులను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించగలరు’ అని సదానందగౌడ తన లేఖలో పేర్కొన్నారు. -
ప్రకాశం జెడ్పీ వైస్ చైర్మనే.. చైర్మన్
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: ప్రకాశం జెడ్పీ వ్యవహారంలో హైకోర్టు బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ప్రకాశం జెడ్పీ చైర్మన్ బాధ్యతలను వైస్ చైర్మనే నిర్వర్తిస్తారని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పొన్నలూరు జెడ్పీటీసీ సభ్యునిగా, జెడ్పీ చైర్మన్‌గా తనపై పడ్డ అనర్హత వేటు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈదర హరిబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను 3 నెలల్లో పరిష్కరించాలని కింది కోర్టును ధర్మాసనం ఆదేశించింది. జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సమయంలో జరిగిన పరిణామాలపై దాఖలైన వివిధ పిటిషన్లను, అప్పీళ్లను వాదనలు విని ఇటీవల తన నిర్ణయాన్ని వాయిదా వేసిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యక్షుడిగా ఉన్న నూకసాని బాలాజీనే చైర్మన్‌గా విధులు నిర్వర్తించాలని ఆదేశిస్తూ, ఈ అప్పీళ్లపై తుది విచారణను రెండు నెలలకు వాయిదా వేసింది. -
వారిని పునర్నియమించండి
మార్కెట్ కమిటీ చైర్మన్ల కేసులో టీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలను రద్దు చేయడంద్వారా తొలగించిన మార్కెట్ కమిటీ చైర్మన్లను వెంటనే పునర్నియమించాలని హైకోర్టు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను హైకోర్టును ఆశ్రయించిన ఐదుగురు పిటిషనర్లకే వర్తింప చేసింది. రాష్ట్రంలో మార్కెట్ కమిటీలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 16న ఆర్డినెన్స్ జారీ చేసింది. దీనికి అనుగుణంగా రద్దు చేసిన మార్కెట్ కమిటీలకు పర్సన్ ఇన్చార్జిలను నియమిస్తూ వ్యవసాయశాఖ అదేనెల 18న జీవో జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ పలు మార్కెట్ కమిటీల చైర్మన్లు హైకోర్టును ఆశ్రయించగా, సుదీర్ఘ విచారణ అనంతరం ఆర్డినెన్స్‌ను, జీవోను కొట్టివేస్తూ ధర్మాసనం ఈ నెల 7న తీర్పునిచ్చింది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ తీర్పును హైకోర్టును ఆశ్రయించిన వారికి మాత్రమే వర్తింప చేసింది. దీంతో ఆదిలాబాద్, జైనత్, కుబీర్, నిర్మల్, సారంగపూర్ మార్కెట్ కమిటీల చైర్మన్లు తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ వ్యాజ్యం విచారణకు రాగానే తెలంగాణ రాష్ట్రం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, కొంత గడువిస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. కౌంటర్ దాఖలు చేయాలంటే, తాము మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందంటూ, పిటిషనర్లను మార్కెట్ కమిటీ చైర్మన్లుగా తిరిగి నియమించాలని ఆదేశించారు. పూర్తి వివరాలతో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏజీనీ, దానికి మరో రెండు వారాల్లో సమాధానాన్ని ఇవ్వాలని పిటిషనర్లను ఆదేశిస్తూ కోర్టు విచారణను వాయిదా వేసింది. -
జస్టిస్ ప్రసాద్‌కు హైకోర్టు ఘన నివాళి
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యంతో మృతి చెందిన విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సి.హెచ్.ఎస్.ఆర్.కె.ప్రసాద్‌కు హైకోర్టు గురువారం ఘనంగా నివాళులర్పించింది. జస్టిస్ ప్రసాద్‌కు శ్రద్ధాంజలి ఘటించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా నేతృత్వంలో న్యాయమూర్తులందరూ సమావేశమయ్యారు. ఏపీ, తెలంగాణ అడ్వకేట్స్ జనరల్ పి.వేణుగోపాల్, కె.రామకృష్ణారెడ్డిలు ప్రసాద్ సేవలను కొ నియాడారు. న్యాయవ్యవస్థకు ఆయ న అందించిన సేవలను ప్రధాన న్యా యమూర్తి గుర్తు చేశారు. అనంతరం రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో జస్టిస్ ప్రసాద్ కుటుంబ సభ్యులు, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎ.గిరిధరరావు, అదనపు ఏజీలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదు లు పాల్గొన్నారు. సంతాపంగా మధ్యాహ్నం 3 గంటల తరువాత హై కోర్టు కార్యకలాపాలను రద్దు చేశారు. -
తెలంగాణ గవర్నర్‌గా నరసింహన్ ప్రమాణస్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా ఈఎస్ఎల్ నరసింహన్‌తో హైకోర్టు చీఫ్ జస్టిస్ కల్యాణ్‌సేన్ గుప్తా ప్రమాణస్వీకారం చేయించారు. రాజ్‌భవన్‌లోని దర్బారు హాలులో సోమవారం ఉద యం 6.32 గంటలకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా నరసింహన్ ప్రమాణం చేశారు. కేసీఆర్ కొంత ఆలస్యంగా ఈ కార్యక్రమం పూర్తయ్యే సమయంలో చేరుకున్నారు. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ చక్రపాణి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్‌రెడ్డి, సీపీఐ నేత నారాయణ, బీజేపీ తెలంగా ణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం జరిగిన తేనీటి విందులో గవర్నర్ సతీసమేతంగా అందరినీ పలకరించారు. మీకు ఇద్దరు భార్యలు: గవర్నర్‌తో నారాయణ ‘మీకు ఇద్దరు భార్యలన్న మాట.. జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందేమో..’ అని గవర్నర్ నరసింహన్‌తో సీపీఐ నేత నారాయణ సరదాగా వ్యాఖ్యానించారు. ‘ఒహ్ గాడ్.. పక్కనే మా శ్రీమతి ఉంది. నిజమే అనుకుంటే నాకు కష్టం..’ అని నరసింహన్ బదులిచ్చారు. పక్కనే ఉన్న గవర్నర్ భార్య విమల జోక్యం చేసుకుని ‘నేను ఇక్కడ ఉండగానే ఆయనతో మరొకరు ఉన్నారని అంటారా?’ అని నవ్వుతూనే ప్రశ్నించారు. ‘ఇప్పుడే కదా మేడమ్ మీ ఆయన, మీ సమక్షంలోనే రెండో పెళ్లి చేసుకున్నారు (ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా ఉంటూనే తెలంగాణకు ప్రమాణ స్వీకారం చేశారనే అర్థంలో) కదా..’ అని నారాయణ బదులివ్వడంతో అక్కడే ఉన్న కిషన్‌రెడ్డి, చక్రపాణి, అధికారులంతా చిరునవ్వులు చిందించారు. ‘ఇప్పటిదాకా ఉద్యమాలు, రాజకీయాల్లో ఎన్నో జరిగాయి. ఇక నుండి రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలసి పనిచేయండి’ అని కిషన్‌రెడ్డిని గవర్నర్ కోరగా.. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. -
ఆ చికిత్స దేశంలో అందుబాటులో లేదా?
అసలు ఈ విషయాన్ని కనీసం పరిశీలించారా? శైలజానాథ్ చికిత్సకు రూ.43.66 లక్షలు కేటాయింపుపై సర్కారును నిలదీసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: అమెరికాలో చికిత్స చేయించుకునేందుకు మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌కు రూ.43.66 లక్షలు కేటాయిస్తూ జారీ చేసిన జీవోపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. శైలజానాథ్‌కు అవసరమైన చికిత్స మనదేశంలో అందుబాటులో లేదా? అని ప్రశ్నించింది. అసలు ఈ విషయాన్ని కనీసం పరిశీలించారా? అని అధికారులను నిలదీసింది. ఈ కేటాయింపులను ఎలా సమర్థించుకుంటారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. శైలజానాథ్‌కు వైద్యం కోసం రూ.43.66 లక్షలు కేటాయించడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్, శాంతినగర్‌కు చెందిన మంగీలాల్ వంకోదూత్ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం లోని ధర్మాసనం సోమవారం విచారించింది. ఛాతీ ఎడమభాగంలో వచ్చిన ట్యూమర్‌కు అమెరికా న్యూజెర్సీలోని మెమోరియల్ స్లాన్ కెట్టరింగ్ కేన్సర్ సెంటర్లో చికిత్స చేయించుకునేందుకు రూ.43.66 లక్షలు కేటాయిస్తూ ప్రభుత్వం గతనెల 17న జీవో జారీ చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది నివేదించారు. ఇందులో రూ.23.66 లక్షలు వైద్యఖర్చులకు, రూ.5 లక్షలు ప్రయాణ ఖర్చులకు, న్యూజెర్సీలో ఉండేందుకు రూ.15లక్షలు కేటాయించినట్టు తెలిపారు. శైలజానాథ్ పేదవాడు కాదని, ఆర్థికంగా ఉన్నవ్యక్తేనని, అలాంటి ఆయనకు ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడం అన్యాయమన్నారు. ఇది ప్రజాధనాన్ని దుర్విని యోగం చేయడమేనన్నారు. ఈ వాదనలతో ప్రధాన న్యాయమూర్తి ఏకీభవిస్తూ.. పూర్తి వివరాలతో కౌంటర్ల దాఖలుకు ఆదేశించారు. విచారణను మూడు వారాలపాటు వాయిదా వేశారు. -
‘విభజన’పై పిటిషన్ విచారణకు స్వీకరణ
కేంద్రానికి రాష్ట్ర హైకోర్టు నోటీసులు.. కౌంటర్ల దాఖలుకు ఆదేశం మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయం వాయిదా సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను అమలు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు సోమవారం విచారణకు స్వీకరించింది. కేంద్రప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ల దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఇదే సమయంలో పునర్వ్యవస్థీకరణ చట్టం అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్న అనుబంధ పిటిషన్‌పై ధర్మాసనం తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. పునర్వ్యవస్థీకరణ చట్టం రాజ్యాంగంలోని అధికరణలు 3, 4, 371డిలకు విరుద్ధమని, అందువల్ల ఈ చట్టాన్ని రద్దుచేయాలని కోరుతూ న్యాయవాది పి.వి.కృష్ణయ్య హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కృష్ణయ్య ధర్మాసనాన్ని అభ్యర్థించారు. దీనిపై ధర్మాసనం కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ) అభిప్రాయాన్ని కోరగా.. అధికరణ 3 ప్రకారం రాష్ట్ర విభజన చేసే అధికారం కేంద్రానికుందని ఆయన నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులకోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై నిర్ణయాన్ని వాయిదా వేసి... ప్రధాన పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
జోక్యం చేసుకోలేం..
* మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు స్పష్టీకరణ * మొత్తం ఎన్నికల ప్రక్రియను ఏప్రిల్ 10 నాటికి పూర్తి చేయండి * చట్ట ప్రకారం ఎన్నికలను నిర్వహించండి * ఎన్నికల కమిషన్‌కు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ఎన్నికల వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ జారీ చేసినందున.. తాము ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. మొత్తం ఎన్నికల ప్రక్రియ (మేయర్లు, చైర్మన్, చైర్పర్సన్ ఎన్నికతో సహా)ను ఏప్రిల్ 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని.. దీనంతటినీ చట్టప్రకారం నిర్వహించాలని ఎన్నికల సంఘానికి ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయలేదని.. చట్ట ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ రిటైర్డ్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్‌రావు హైకోర్టులో సోమవారం అత్యవసరంగా ప్రజాహిత వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ... బీసీ రిజర్వేషన్ల వ్యవహారంలో అధికారులు రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ... ‘మీరు ఎన్నికలను నిలుపుదల చేయాలని కోరుతున్నారా..?’ అని ప్రశ్నించింది. అటువంటిదేమీ లేదని, చట్టప్రకారం ఎన్నికలు నిర్వహించాలని మాత్రమే కోరుతున్నామని రామకృష్ణారెడ్డి జవాబిచ్చారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘మీరు కొంచెం ముందుగా కోర్టుకు వచ్చి ఉండాల్సింది. చివరి క్షణంలో వచ్చారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను సైతం జారీ చేసింది. ఒకసారి షెడ్యూల్ విడుదలయ్యాక న్యాయస్థానాలు అందులో ఏ రకంగానూ జోక్యం చేసుకోజాలవు. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా..!’’ అని వ్యాఖ్యానించింది. ఈ సమయంలో రామకృష్ణారెడ్డి రాజకీయపార్టీల గురించి ప్రస్తావించగా.. రాజ్యాంగంలో ఎక్కడా రాజకీయ పార్టీల గురించి ఎటువంటి ప్రస్తావన లేదని, కేవలం పౌరుల ప్రస్తావన మాత్రమే ఉందని గుర్తు చేసింది. తరువాత వాదనల్లో రాష్ట్ర విభజన ప్రస్తావన వచ్చింది. ‘‘చట్టప్రకారం ఇంకా తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు. ‘అపాయింటెడ్ డే’ రోజు నుంచి రాష్ట్రం విడిపోయినట్లు లెక్క. ఇంకా ఇది ఆంధ్రప్రదేశే. విభజన విషయంలో గెజిట్ కన్నా కూడా ‘అపాయింటెడ్ డే’ ముఖ్యం. ఈ విషయం అందరూ తెలుసుకోవాలి’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతకుముందు మున్సిపల్ ఎన్నికలను 4 వారాల్లో నిర్వహించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి కోర్టు ముందుం చారు. దానిని పరిశీలించిన ధర్మాసనం... ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల కంటే ముందు.. ఎన్నికల నిర్వహణకు తామిచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. సీఎస్ వ్యవహారశైలిని కోర్టు ధిక్కారం కింద ఎందుకు పరిగణించకూడదని ఏజీని నిలదీసింది. ఎన్నికల నిర్వహణకు గడువు కోరుతూ దరఖాస్తు చేసుకున్నామని, దానిని హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంకోర్టుకు వెళ్లామని, అక్కడా పిటిషన్‌ను కొట్టివేయడంతో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేశామని ఏజీ తెలిపారు. అయినప్పటికీ ధర్మాసనం శాంతించలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తమ ఉత్తర్వులను పట్టించుకున్నట్లు కనిపించలేదంటూ వ్యాఖ్యానించింది. -
బిల్లును కోర్టుల్లో సవాలు చేయడానికి వీల్లేదు
సాక్షి, హైదరాబాద్: చట్టరూపం దాల్చని ఏ బిల్లును కూడా న్యాయస్థానాల్లో సవాలు చేయడానికి వీల్లేదని, బిల్లు చట్ట రూపం దాల్చిన తరువాత ఎవరైనా దానిని సవాలు చేసుకోవచ్చునని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన వల్ల ప్రాథమిక హక్కులు ఏ విధంగా ప్రభావితం కావని, హక్కులకు భంగం కలుగుతుందనేది కేవలం ఊహ మాత్రమేనని, ఏ ప్రభుత్వం కూడా ఏ వ్యక్తిని తాను ఉంటున్న ఇంటి నుంచి గెంటివేయదని తెలిపారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తి దేశంలో ఎక్కడైనా ఉండొచ్చునని, ఆ వ్యక్తిని చట్టాలే రక్షిస్తాయని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్నది దేశ విభజన కాదని, కేవలం రాష్ట్ర విభజన మాత్రమేనని తెలిపారు. అధికరణ 371(డి), (ఈ)లను సవరించకుండా.. బిల్లును ఏకగ్రీవంగా తిరస్కరిస్తూ శాసనవ్యవస్థ చేసిన తీర్మానాలను పరిగణనలోకి తీసుకోకుండా.. కేంద్రం విభజన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడుతోందని, దాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలంటూ న్యాయవాది పి.వి.కృష్ణయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని గురువారం సీజే జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. విచారణ వివరాలిలా ఉన్నాయి... సీజే స్పందిస్తూ... విభజన నిర్ణయం మీపై ఏవిధంగా ప్రభావితం చూపుతుందో వివరించాలని ఆదేశించారు. ప్రకాశం జిల్లాకు చెందిన తాను 1985 నుంచి హైదరాబాద్‌లో ఉంటూ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నానని కృష్ణయ్య తెలిపారు. రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాద్ సిటీ తెలంగాణలో అంతర్భాగం అవుతుందన్నారు. దీనివల్ల రాబోయే ఎన్నికల్లో తన సొంత జిల్లా ప్రకాశం నుంచి పోటీ చేసే అవకాశం కోల్పోతానన్నారు. అంతేకాక తాను హైదరాబాద్‌ను విడిచి వెళ్లాల్సి ఉంటుందన్నారు. విభజనతో ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందనే ది ఊహ మాత్రమేనని సీజే వ్యాఖ్యానించారు. చట్టరూపం దాల్చని ఏ బిల్లును కూడా కోర్టు ముందు సవాలు చేయడానికి వీల్లేదన్నారు. వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుని పిల్ రూపంలో దాఖలు చేసుకునేందుకు అనుమతినిచ్చారు. -
సమర్థులకే ఓటు వేయండి
ప్రతి ఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొని దేశ భవిష్యత్తును నిర్ణయించాలి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా సాక్షి, హైదరాబాద్: ఓటర్లు పాలకుల సామర్థ్యాన్ని అంచనా వేసి ఓటు వేయాలని, ప్రతి పౌరుడూ తప్పనిసరిగా ఓటింగ్‌లో పాల్గొనాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జస్టిస్ గుప్తా ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం దేశంపై ప్రతి ఒక్కరికీ హక్కు ఉందని... పోలింగ్‌లో పాల్గొని దేశ భవిష్యత్తును నిర్ణయించే బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. రాజ్యాంగం నిర్దేశించిన మేరకు పోలింగ్ ప్రక్రియ నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుతంగా జరగాలని... అందుకు ప్రతి పౌరుడూ కృషి చేయాలని సూచించారు. ప్రతి సార్వత్రిక ఎన్నిక ఒక కొత్త ప్రభుత్వానికి జన్మనిస్తోందని, ఎన్నికల సంఘం ఇందుకు ప్రసూతి కేంద్రంగా పనిచేస్తోందని కొనియాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ఆయన బహుమతులు ప్రదానం చేశారు. అలాగే కొత్త ఓటరు గుర్తింపు కార్డులను కొందరికి అందజేశారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, కంటోన్మెంట్ బోర్డు సీఈవో సుజాతాగుప్తా తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఎవరేమన్నారు... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీఎస్ మహంతి: రాష్ట్రవ్యాప్తంగా 4,800 ఈ-సేవా కేంద్రాల ద్వారా ఓటరు గుర్తింపు కార్డులు జారీచేస్తున్నాం. ఓటర్లందరికీ గుర్తింపు కార్డులు అందేలా చర్యలు తీసుకుంటాం. ఓటరుగా నమోదైన వారు వారి పేర్లను జాబితాలో చెక్ చేసుకోవాలి. ఈ నెలాఖరు నాటికి ఓటర్ల జాబితాను ముద్రిస్తాం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి: 18 ఏళ్లు నిండిన వారు ఎప్పుడైనా ఓటరుగా రిజిస్ట్రర్ చేసుకోవచ్చు, ఇందుకు ఆఖరు తేదీ ఉండదు. ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్: ఇటీవల కాలంలో రికార్డు స్థాయిలో 76 లక్షల మంది కొత్తగా ఓటర్లుగా రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో యువత ఎక్కువగా ఉన్నారు. రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 6.24 కోట్లకు చేరింది. గత ఏడాది 54 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. ఈ ఏడాది 100 శాతం పోలింగ్ జరిగేలా అందరూ కృషి చేయాలి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి నవీన్ మిట్టల్: జంట నగరాల పరిధిలో ఐదు లక్షల మంది కొత్తగా ఓటర్లుగా రిజిస్టర్ చేసుకున్నారు. ప్రతి ఓటరు ఓటు వేసేలా చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. -
‘మధ్యవర్తిత్వం’తో కేసుల సత్వర పరిష్కారం
శామీర్‌పేట్, న్యూస్‌లైన్: పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వ కోర్సులు ఎంతగానో దోహదం చేస్తాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేటలోని నల్సార్ లా యూనివర్సిటీలో శనివారం ఫ్యామిలీ డిస్ప్యూట్ రిసల్యూషన్ (ఎఫ్డీఆర్), ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిసల్యూషన్ (ఎఫ్డీఆర్) పీజీ డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న గొడవలతోనే ప్రజలు కోర్టులను ఆశ్రయిస్తున్నారని, దీంతో అనేక కేసులు కుప్పలుగా పేరుకుపోతున్నాయని చెప్పారు. ఇలాంటి కేసుల్లో ఇరువర్గాలకు సర్దిచెప్పి రాజీ కుదిర్చేందుకు మధ్యవర్తిత్వ కోర్సులు అభ్యసించిన విద్యార్థులు కృషి చేయాలని కోరారు. క్రిమినల్ కేసులు కూడా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమయ్యాయని పలు ఉదాహరణలతో ఆయన వివరించారు. నల్సార్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఫైజాన్ ముస్తఫా మాట్లాడుతూ ఇప్పటివరకు 1100మంది పట్టభద్రులయ్యారని చెప్పారు. అనంతరం ఎఫ్డీఆర్, ఏడీఆర్ కోర్సులు పూర్తిచేసుకున్న 163మంది విద్యార్థులకు హైకోర్టు చీఫ్ జస్టిస్ చేతుల మీదుగా పట్టాలు ప్రదానం చేశారు. ఏడీఆర్ కోర్సులో మారెల్లి రాజేశ్వరి బంగారు పతకం సాధించగా, డాక్టర్ పున్న రాజారాం స్వర్ణ పతకం అందుకున్నారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిసల్యూషన్ (ఐసీడీఆర్) హైదరాబాద్ రీజనల్ సెంటర్ కార్యదర్శి కె.వి.సత్యనారాయణ, నల్సార్ లా యూనివర్సిటీ రిజిస్ట్రార్ విజేందర్ కుమార్, పట్టభద్రుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
స్థానిక కోర్టుల్లోనూ ‘పిల్’!
సాక్షి, విజయవాడ: ప్రజా ప్రయోజన వ్యాజ్యాల(పిల్)ను కింది కోర్టుల్లోనూ విచారణకు స్వీకరించవచ్చని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతిసేన్‌గుప్తా వెల్లడించారు. ఇటీవల మరణించిన సీనియర్ న్యాయవాది పద్మనాభరెడ్డి స్మారక సభలో ‘సామాజిక న్యాయం-ప్రజా ప్రయోజన వ్యాజ్యం’ అనే అంశంపై శనివారం ఆయన కీలకోపన్యాసం చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టులతోపాటు అన్ని న్యాయస్థానాల్లోనూ ఒకే న్యాయవ్యవస్థ ఉంటుందని, కాబట్టి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను కింది కోర్టుల్లోనూ స్వీకరించవచ్చని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించడానికి ‘పిల్’ ఉపయోగపడుతుందన్నారు. ‘పిల్’ ప్రధాన ధ్యేయం ప్రజా సమస్యల పరిష్కారమేనని, అదే సమయంలో ఏ ఒక్కరి ప్రయోజనం కాంక్షించే విధంగా అది ఉండకూడదని జస్టిస్ గుప్తా స్పష్టం చేశారు. పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు 1987లో న్యాయ సేవాధికార సంస్థలను ఏర్పాటు చేశారని తెలిపారు. సామాజిక అంతరాలను తొలగించేందుకు ఆర్టికల్ 371-డి అధికరణ ఉపయోగపడుతుందని తెలిపారు. దీనిద్వారా సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ సమాజంలో సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. పద్మనాభరెడ్డి తనయుడు, హైకోర్టు జడ్జి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ పేదలకు సమాన న్యాయం గురించి నిత్యం ఆలోచించిన మానవతావాది పద్మనాభరెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి జి.చక్రధరరావు, ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, హైకోర్టు ఏపీపీ వినోద్‌దేశ్‌పాండే, నగర మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి ఆర్.మురళి, ఐఏఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్, ఐఏఎల్ కార్యనిర్వాహక అధ్యక్షుడు చలసాని అజయ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర విభజనపై వ్యాజ్యం కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)ను హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర విభజన, కొత్త రాష్ట్రాల ఏర్పాటు తదితర అంశాలు పూర్తిగా పార్లమెంట్ నిర్ణయాలని, వాటి విషయంలో జోక్యం చేసుకునే అధికారం న్యాయస్థానాలకు లేదని తేల్చి చెప్పింది. ఫలానా విధంగా వ్యవహరించాలని చట్టసభలను న్యాయస్థానాలు నిర్ధేశించలేవని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 3వ అధికరణ ప్రకారం ప్రజాప్రతినిధులు, రాష్ట్రపతి తగిన విధంగా స్పందిస్తారని, ఈ విషయంలో న్యాయస్థానాలు ఎటువంటి ఆదేశాలూ జారీ చేయలేవని పేర్కొంది. కేంద్ర కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర విభజనపై రాజ్యాంగంలోని 3వ అధికరణ ప్రకారం తదుపరి చర్యలేవీ చేపట్టకుండా కేంద్ర కేబినెట్, కేంద్ర హోంశాఖ కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టు న్యాయవాది పీవీ కృష్ణయ్య పిల్‌ను దాఖలుచేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. రాష్ట్ర విభజనకు సంబంధించి రాష్ట్రపతి పంపే డ్రాఫ్ట్ బిల్లుపై నిర్ణీత గడువులోగా రాష్ట్ర శాసనసభ తన అభిప్రాయాలను వెల్లడించాలని, లేని పక్షంలో రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవచ్చునంటూ 1955లో 3వ అధికరణకు చేసిన రాజ్యాంగ సవరణను కొట్టివేయాలన్న పిటిషనర్ అభ్యర్థననూ ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ సవరణ చట్ట విరుద్ధమో, రాజ్యాంగ విరుద్ధమో కాదని తేల్చి చెప్పింది. ‘‘అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని తన వివేచనతో రాష్ట్రపతి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాజ్యాంగ మౌలిక సూత్రాన్ని సవరించే అధికారం పార్లమెంట్‌కు సైతం లేదు. బిల్లుపై నిర్ణయం తీసుకునే పూర్తి స్వేచ్ఛ, అధికారం రాష్ట్రపతికి ఉన్నాయి. ఈ విషయంలో జోక్యం చేసుకొనేందుకు కోర్టుకు ఎలాంటి అధికారమూ లేదు. రాష్ట్ర విభజన విషయంలో అంతిమ నిర్ణయం రాష్ట్రపతి, పార్లమెంట్లదే’’ అని ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది. రాష్ట్రంలో అధికరణ 371(డి) అమల్లో ఉండగా, అధికరణ 3 కింద రాష్ట్ర విభజన చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదన్న పిటిషనర్ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. అధికరణ 371(డి) ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ఉద్దేశించినదని, ఉద్యోగావకాశాల్లో కొన్ని రక్షణలు కల్పిస్తూ ప్రత్యేకంగా తీసుకువచ్చిన ఇది అధికరణ 3 అమలుకు అడ్డంకి కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది. అధికరణ 371(డి)ని అమల్లో ఉంచాలా, తొలగించాలా అనేది పార్లమెంట్‌కు సంబంధించిన విషయమని, కోర్టులు ఎటువంటి ఉత్తర్వులూ ఇవ్వజాలవని స్పష్టం చేసింది. అలాగే అధికరణ 3 రాజ్యాంగ మౌలిక సూత్రాలకు, ప్రవేశికకు విరుద్ధంగా ఉన్నందున దాన్ని కొట్టివేయాలన్న పిటిషనర్ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. రాష్ట్ర విభజనకు సంబంధించి కేబినెట్ సిఫారసులపై అధికరణ 3 కింద రాజ్యాంగపరమైన అధికారాలను ఉపయోగించకుండా రాష్ట్రపతిని నియంత్రిస్తూ ఆదేశాలివ్వాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. రాష్ట్ర విభజనకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఎటువంటి సమ్మెలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించకుండా ఉద్యోగ సంఘాలను ఆదేశించాలన్న పిటిషనర్ అభ్యర్థనకు సంబంధించి ఇప్పటికే తమ ముందు కొన్ని పిటిషన్లు ఉన్నాయని, వాటిపై తాము తీర్పును వాయిదా వేశామని ధర్మాసనం తెలిపింది. రాజకీయ పార్టీలు, ప్రజలు చేస్తున్న ఆందోళనలపై తాజాగా పిటిషన్ దాఖలు చేస్తే విచారిస్తామని పేర్కొంది. -
కోర్టు విధులకు ఆటంకం కలిగించొద్దు
విశాఖపట్నం-లీగల్, న్యూస్‌లైన్: న్యాయస్థానాలు కూడా అత్యవసర సేవలందించేవేనని, ఏ సమస్యపై ఆందోళనలు చేసినా సరే కోర్టు విధులకు ఆటంకం కలిగించవద్దని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నంలోని జిల్లా కోర్టు న్యాయవాదుల గ్రంథాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, కోర్టుల తీర్పులు వెలువరించే ప్రక్రియలో జాప్యం మంచిది కాదన్నారు. త్వరలోనే సంచార లోక్ అదాలత్‌లు పనిచేస్తాయని చెప్పారు. తీర్పుల జాప్యం వల్ల పౌరులకు న్యాయప్రక్రియపై నమ్మకం సన్నగిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా.. చీఫ్ జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా శనివారం సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద అర్చకులు, ఈవో కె.రామచంద్రమోహన్ పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్ సేన్‌గుప్తా కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా చుట్టూ ప్రదక్షిణ చేశారు.