'జనాభా నిష్పత్తికి తగినట్లుగా జడ్జీలు లేరు'
- హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా
సాక్షి, హైదరాబాద్: జనాభా నిష్పత్తికి అనుగుణంగా న్యాయమూర్తులు లేరని, దీంతో న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు పేరుకుపోతున్నాయని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా అన్నారు. నేటి రోజుల్లో కోర్టులకు వెళ్లడం ఖర్చుతో కూడుకున్నది కావడంతోపాటు పరిష్కారంలో జాప్యం జరిగే పరిస్థితి ఉందన్నారు. తనకు ఏదైనా సమస్య వస్తే న్యాయస్థానాలకు వెళ్లకుండా ప్రత్యామ్నాయ విధానాల ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తానని సీజే చెప్పారు. నల్సార్, ఐసీఏడీఆర్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారం (ఏడీఆర్), కుటుంబ వివాదాల పరిష్కారం (ఎఫ్‌డీఆర్)లో పీజీ డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులకు డిగ్రీలు ప్రదానం చేసే కార్యక్రమానికి సీజే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆర్థిక అసమానతలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం అందాలనే లక్ష్యంతో ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కార (ఏడీఆర్) విధానం పనిచేస్తోంద న్నారు. న్యాయవ్యవస్థకు నిధుల కేటాయింపు తక్కువగా ఉందని, స్థూల జాతీయాదాయంలో ఒక శాతం నిధులను న్యాయవ్యవస్థకు కేటాయించాలని సూచించారు. జడ్జీల ఖాళీలన్నింటినీ వెంటనే భర్తీ చేస్తే పెండింగ్ కేసులన్నీ పరిష్కారమవుతాయని చెప్పారు. ఈ సందర్భంగా ఏడీఆర్ కోర్సుల్లో బంగారు, వెండి పతకాలు సాధించిన ఎం.పార్థసారథి, కె.సంహితలతోపాటు కోర్సులు పూర్తి చేసిన 124 మంది అభ్యర్థులకు జస్టిస్ సేన్‌గుప్తా డిగ్రీలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నల్సార్ వీసీ ప్రొఫెసర్ ఫైజాన్ ముస్తఫా, రిజిస్ట్రార్ వి.బాలకిష్టారెడ్డి, ఐసీఏడీఆర్ ప్రాంతీయ కార్యాలయం ఇన్‌చార్జి పాల్గొన్నారు.
అందరికీ న్యాయఫలాలు అందాలి
అంబేడ్కర్ ఆశయం నెరవేరాలంటే.. ప్రజలందరికీ ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు న్యాయఫలాలు అందాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్ గుప్తా అన్నారు. హైకోర్టు ప్రాంగణంలో ఏపీ బార్ కౌన్సిల్, హైకోర్టు న్యాయవాదుల సంఘం సంయుక్తంగా నిర్వహించిన అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలకు సీజే ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు జస్టిస్ గుండా చంద్రయ్య, జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, ఏపీ అడ్వొకేట్ జనరల్ పి.వేణుగోపాల్, తెలంగాణ అదనపు ఏజీ జె.రామచంద్రరావు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.