బిల్లును కోర్టుల్లో సవాలు చేయడానికి వీల్లేదు
సాక్షి, హైదరాబాద్: చట్టరూపం దాల్చని ఏ బిల్లును కూడా న్యాయస్థానాల్లో సవాలు చేయడానికి వీల్లేదని, బిల్లు చట్ట రూపం దాల్చిన తరువాత ఎవరైనా దానిని సవాలు చేసుకోవచ్చునని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన వల్ల ప్రాథమిక హక్కులు ఏ విధంగా ప్రభావితం కావని, హక్కులకు భంగం కలుగుతుందనేది కేవలం ఊహ మాత్రమేనని, ఏ ప్రభుత్వం కూడా ఏ వ్యక్తిని తాను ఉంటున్న ఇంటి నుంచి గెంటివేయదని తెలిపారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తి దేశంలో ఎక్కడైనా ఉండొచ్చునని, ఆ వ్యక్తిని చట్టాలే రక్షిస్తాయని చెప్పారు.
ప్రస్తుతం జరుగుతున్నది దేశ విభజన కాదని, కేవలం రాష్ట్ర విభజన మాత్రమేనని తెలిపారు. అధికరణ 371(డి), (ఈ)లను సవరించకుండా.. బిల్లును ఏకగ్రీవంగా తిరస్కరిస్తూ శాసనవ్యవస్థ చేసిన తీర్మానాలను పరిగణనలోకి తీసుకోకుండా.. కేంద్రం విభజన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడుతోందని, దాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలంటూ న్యాయవాది పి.వి.కృష్ణయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని గురువారం సీజే జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. విచారణ వివరాలిలా ఉన్నాయి...
సీజే స్పందిస్తూ... విభజన నిర్ణయం మీపై ఏవిధంగా ప్రభావితం చూపుతుందో వివరించాలని ఆదేశించారు.
ప్రకాశం జిల్లాకు చెందిన తాను 1985 నుంచి హైదరాబాద్‌లో ఉంటూ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నానని కృష్ణయ్య తెలిపారు. రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాద్ సిటీ తెలంగాణలో అంతర్భాగం అవుతుందన్నారు. దీనివల్ల రాబోయే ఎన్నికల్లో తన సొంత జిల్లా ప్రకాశం నుంచి పోటీ చేసే అవకాశం కోల్పోతానన్నారు. అంతేకాక తాను హైదరాబాద్‌ను విడిచి వెళ్లాల్సి ఉంటుందన్నారు.
విభజనతో ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందనే ది ఊహ మాత్రమేనని సీజే వ్యాఖ్యానించారు. చట్టరూపం దాల్చని ఏ బిల్లును కూడా కోర్టు ముందు సవాలు చేయడానికి వీల్లేదన్నారు. వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుని పిల్ రూపంలో దాఖలు చేసుకునేందుకు అనుమతినిచ్చారు.