రాష్ట్ర విభజనపై వ్యాజ్యం కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)ను హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర విభజన, కొత్త రాష్ట్రాల ఏర్పాటు తదితర అంశాలు పూర్తిగా పార్లమెంట్ నిర్ణయాలని, వాటి విషయంలో జోక్యం చేసుకునే అధికారం న్యాయస్థానాలకు లేదని తేల్చి చెప్పింది. ఫలానా విధంగా వ్యవహరించాలని చట్టసభలను న్యాయస్థానాలు నిర్ధేశించలేవని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 3వ అధికరణ ప్రకారం ప్రజాప్రతినిధులు, రాష్ట్రపతి తగిన విధంగా స్పందిస్తారని, ఈ విషయంలో న్యాయస్థానాలు ఎటువంటి ఆదేశాలూ జారీ చేయలేవని పేర్కొంది. కేంద్ర కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర విభజనపై రాజ్యాంగంలోని 3వ అధికరణ ప్రకారం తదుపరి చర్యలేవీ చేపట్టకుండా కేంద్ర కేబినెట్, కేంద్ర హోంశాఖ కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టు న్యాయవాది పీవీ కృష్ణయ్య పిల్‌ను దాఖలుచేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది.
రాష్ట్ర విభజనకు సంబంధించి రాష్ట్రపతి పంపే డ్రాఫ్ట్ బిల్లుపై నిర్ణీత గడువులోగా రాష్ట్ర శాసనసభ తన అభిప్రాయాలను వెల్లడించాలని, లేని పక్షంలో రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవచ్చునంటూ 1955లో 3వ అధికరణకు చేసిన రాజ్యాంగ సవరణను కొట్టివేయాలన్న పిటిషనర్ అభ్యర్థననూ ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ సవరణ చట్ట విరుద్ధమో, రాజ్యాంగ విరుద్ధమో కాదని తేల్చి చెప్పింది. ‘‘అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని తన వివేచనతో రాష్ట్రపతి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాజ్యాంగ మౌలిక సూత్రాన్ని సవరించే అధికారం పార్లమెంట్‌కు సైతం లేదు. బిల్లుపై నిర్ణయం తీసుకునే పూర్తి స్వేచ్ఛ, అధికారం రాష్ట్రపతికి ఉన్నాయి. ఈ విషయంలో జోక్యం చేసుకొనేందుకు కోర్టుకు ఎలాంటి అధికారమూ లేదు. రాష్ట్ర విభజన విషయంలో అంతిమ నిర్ణయం రాష్ట్రపతి, పార్లమెంట్‌లదే’’ అని ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది.
రాష్ట్రంలో అధికరణ 371(డి) అమల్లో ఉండగా, అధికరణ 3 కింద రాష్ట్ర విభజన చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదన్న పిటిషనర్ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. అధికరణ 371(డి) ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ఉద్దేశించినదని, ఉద్యోగావకాశాల్లో కొన్ని రక్షణలు కల్పిస్తూ ప్రత్యేకంగా తీసుకువచ్చిన ఇది అధికరణ 3 అమలుకు అడ్డంకి కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది. అధికరణ 371(డి)ని అమల్లో ఉంచాలా, తొలగించాలా అనేది పార్లమెంట్‌కు సంబంధించిన విషయమని, కోర్టులు ఎటువంటి ఉత్తర్వులూ ఇవ్వజాలవని స్పష్టం చేసింది. అలాగే అధికరణ 3 రాజ్యాంగ మౌలిక సూత్రాలకు, ప్రవేశికకు విరుద్ధంగా ఉన్నందున దాన్ని కొట్టివేయాలన్న పిటిషనర్ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. రాష్ట్ర విభజనకు సంబంధించి కేబినెట్ సిఫారసులపై అధికరణ 3 కింద రాజ్యాంగపరమైన అధికారాలను ఉపయోగించకుండా రాష్ట్రపతిని నియంత్రిస్తూ ఆదేశాలివ్వాలన్న అభ్యర్థనను తిరస్కరించింది.
రాష్ట్ర విభజనకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఎటువంటి సమ్మెలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించకుండా ఉద్యోగ సంఘాలను ఆదేశించాలన్న పిటిషనర్ అభ్యర్థనకు సంబంధించి ఇప్పటికే తమ ముందు కొన్ని పిటిషన్లు ఉన్నాయని, వాటిపై తాము తీర్పును వాయిదా వేశామని ధర్మాసనం తెలిపింది. రాజకీయ పార్టీలు, ప్రజలు చేస్తున్న ఆందోళనలపై తాజాగా పిటిషన్ దాఖలు చేస్తే విచారిస్తామని పేర్కొంది.