మార్కెట్ కమిటీ చైర్మన్ల కేసులో టీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలను రద్దు చేయడంద్వారా తొలగించిన మార్కెట్ కమిటీ చైర్మన్లను వెంటనే పునర్నియమించాలని హైకోర్టు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను హైకోర్టును ఆశ్రయించిన ఐదుగురు పిటిషనర్లకే వర్తింప చేసింది. రాష్ట్రంలో మార్కెట్ కమిటీలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 16న ఆర్డినెన్స్ జారీ చేసింది. దీనికి అనుగుణంగా రద్దు చేసిన మార్కెట్ కమిటీలకు పర్సన్ ఇన్‌చార్జిలను నియమిస్తూ వ్యవసాయశాఖ అదేనెల 18న జీవో జారీ చేసింది.
ఈ జీవోను సవాలు చేస్తూ పలు మార్కెట్ కమిటీల చైర్మన్లు హైకోర్టును ఆశ్రయించగా, సుదీర్ఘ విచారణ అనంతరం ఆర్డినెన్స్‌ను, జీవోను కొట్టివేస్తూ ధర్మాసనం ఈ నెల 7న తీర్పునిచ్చింది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ తీర్పును హైకోర్టును ఆశ్రయించిన వారికి మాత్రమే వర్తింప చేసింది. దీంతో ఆదిలాబాద్, జైనత్, కుబీర్, నిర్మల్, సారంగపూర్ మార్కెట్ కమిటీల చైర్మన్లు తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ వ్యాజ్యం విచారణకు రాగానే తెలంగాణ రాష్ట్రం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, కొంత గడువిస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. కౌంటర్ దాఖలు చేయాలంటే, తాము మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందంటూ, పిటిషనర్లను మార్కెట్ కమిటీ చైర్మన్లుగా తిరిగి నియమించాలని ఆదేశించారు. పూర్తి వివరాలతో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏజీనీ, దానికి మరో రెండు వారాల్లో సమాధానాన్ని ఇవ్వాలని పిటిషనర్లను ఆదేశిస్తూ కోర్టు విచారణను వాయిదా వేసింది.
వారిని పునర్నియమించండి
Published Sat, Nov 15 2014 1:01 AM | Last Updated on Fri, Aug 31 2018 8:53 PM
Advertisement
Advertisement