‘సీఆర్‌డీఏ’పై హైకోర్టు నోటీసులు
ఆ సంస్థ రాజ్యాంగబద్ధత సవాలు పిటిషన్‌పై స్పందన
జూన్ 10లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశం
తదుపరి విచారణ జూన్ మూడో వారానికి వాయిదా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతాభివృద్ధి సంస్థ(సీఆర్‌డీఏ) రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ఉమ్మడి హైకోర్టు సోమవారం స్పందించింది. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ మూడో వారానికి వాయిదా వేసింది. జూన్ 10 కల్లా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సర్కార్‌కు స్పష్టం చేసిన హైకోర్టు, ఆ వెంటనే ఆ కౌంటర్‌కు తిరుగు సమాధానం (రిప్లై) ఇవ్వాలని పిటిషనర్లను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్‌డీఏ చట్టం రాజ్యాంగ విరుద్ధమే కాక, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి కూడా వ్యతిరేకమంటూ విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఎ.గోపాల్‌రావు, జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి, ప్రముఖ పాత్రికేయులు ఎ.బి.కె.ప్రసాద్, సీనియర్ న్యాయవాది సి.సదాశివరెడ్డి ఇటీవల హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఏపీ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా సీఆర్‌డీఏ చట్ట నిబంధనలు ఉన్నాయని తెలిపారు. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం రాజధాని ప్రాంత ఎంపిక కేంద్ర ప్రభుత్వానిదేనని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ణయాధికారం లేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆ సెక్షన్ ప్రకారం కేంద్రం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ గత ఏడాది ఆగస్టు 27న తన నివేదికను సమర్పించిందని తెలిపారు. వ్యవసాయ భూములకు జరిగే నష్టం కనిష్టస్థాయిలో ఉండాలన్నదే కమిటీ ప్రధాన ఉద్దేశమన్నారు. గుంటూరు జిల్లాలో 65 శాతం, కృష్ణా జిల్లాలో 56 శాతం మంది వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలుగా ఉన్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు వల్ల రైతులు భూములు కోల్పోయి, కూలీలు ఉపాధి లేక రోడ్డునపడుతారని కమిటీ తన నివేదికలో పేర్కొన్నారని ఆయన వివరించారు. విజయవాడకు 300 కిలోమీటర్ల పరిధిలో భూకంపాలు వచ్చే అవకాశం ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికను కూడా కమిటీ ప్రస్తావించిందన్నారు. భూసేకరణ చట్టం-2013 ప్రకారం బహుళ పంటల భూములను ఎట్టి పరిస్థితుల్లో సేకరించడానికి వీల్లేదని, ప్రస్తుత రాజధాని భూముల్లో బహుళ పంటలు పండే భూములే అధికంగా ఉన్నాయని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) అని పేరు పెట్టిన ప్రభుత్వం.. అంతిమంగా భూ సేకరణే చేస్తోందన్నారు. రాజధాని ప్రాంతంలో భూమిని నమ్ముకుని బతుకుతున్న కూలీలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని ప్రకాశ్‌రెడ్డి వివరించారు.
2013 భూ సేకరణ చట్టంలో వ్యవసాయ కూలీల ఉపాధికి తీసుకోవాల్సిన చర్యల గురించి స్పష్టంగా చెప్పారన్నారు. అయితే ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సీఆర్‌డీఏ చట్టంలో వ్యవసాయ కూలీల ఉపాధి గురించి ఎక్కడా ప్రస్తావన లేదన్నారు. కేంద్ర చట్టాన్ని పట్టించుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వం సీఆర్‌డీఏ చట్టాన్ని తీసుకొచ్చిందని వివరించారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం, తాము ప్రస్తుతం ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించి, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తున్నామని, కౌంటర్ పరిశీలించిన తరువాతే తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తేల్చి చెప్పింది.