Public Interest Litigation
-
రహస్య కెమెరాల విక్రయాలు.. హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం
సాక్షి, హైదరాబాద్: రహస్య కెమెరాల విక్రయంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రహస్య కెమెరాల విక్రయాన్ని సవాలు చేస్తూ హెవెన్ హోమ్స్ సొసైటీ పిటిషన్ వేసింది. రహస్య కెమెరాలను మార్కెట్, ఆన్లైన్లో నేరుగా విక్రయిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు.హోటళ్లు, షాపింగ్ మాల్స్‌లో రహస్య కెమెరాలు పెడుతున్నారన్న పిటిషనర్.. వాష్‌రూమ్‌లు, ఎక్స్‌రే గదుల్లో కూడా రహస్య కెమెరాలు పెడుతున్నారని పిటిషనర్ తెలిపారు. రహస్య కెమెరాల విక్రయాలపై నియంత్రణ ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు.ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పిటిషనర్ చేర్చారు. కౌంటర్ దాఖలుకు కేంద్రం తరఫు న్యాయవాది సమయం కోరారు. వచ్చే నెల 28వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025.. మురిపించేనా.. మొండిచెయ్యేనా? -
రాష్ట్ర ప్రాజెక్టులపై కేంద్ర పెత్తనం చట్టవిరుద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులను కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల (కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ) పరిధిలోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ చట్టవిరుద్ధమని హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. తెలంగాణ ప్రజల ప్రాథమిక హక్కులను, సమాఖ్య స్ఫూర్తిని ఉల్లంఘిస్తూ.. 2021 జూలై 15న జారీ చేసిన గెజిట్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) చీఫ్ అడ్వైజర్ డి. పాండురంగారెడ్డితో పాటు ఇద్దరు పిల్ దాఖలు చేశారు. ఇందులో కేంద్ర జల శక్తి కార్యదర్శి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి, గోదావరి రివర్ మేనేజిమెంట్ బోర్డు సభ్య కార్యదర్శి, కేంద్ర జలవనరుల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. నంబర్ కేటాయించండి... తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య జల వివాదంపై తాము పిల్ దాఖలు చేయలేదని, పిల్‌కు నంబర్ కేటాయించేలా హైకోర్టు రిజిస్ట్రీ ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని నీటిపారుదల ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం చేసేలా నోటిఫికేషన్ ఉందని వెల్లడించారు. కృష్ణా, గోదావరి బేసిన్‌లోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టులపై నియంత్రణ, నిర్వహణ చేసేలా కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ప్రాజెక్టులపై రాష్ట్రాలకు ఉన్న అధికారాలను కేంద్రం లాక్కోవడమేనని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను తన పరిధిలోకి తీసుకుంటోందని చెప్పారు. ‘తెలంగాణకు జలవనరుల వాటాను పెంచకుండా కేంద్రం దగా చేస్తోంది. నోటిఫికేషన్ ప్రకారం ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి వెళతాయి. ఇది తెలంగాణ పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే. రాజ్యాంగంలోని సమాఖ్య పాలన స్ఫూర్తికి, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. కేంద్ర నోటిఫికేషన్ ప్రకారం ఏర్పాటయ్యే నదీ జలాల యాజమాన్య బోర్డులకు తెలుగు రాష్ట్రాలు.. సిబ్బంది, అధికారులు, ఫైళ్లు, వాహనాలను అందించాలి. అంతేకాకుండా రివర్ బోర్డులకు తెలంగాణ, ఏపీ రూ.200 కోట్లు చొప్పున రూ.400 కోట్లు చెల్లించాలి. ఈ మొత్తాన్ని ఏ ప్రాతిపదికన నిర్ణయించిందీ కేంద్రం చెప్పలేదు. నిధులు ఇచ్చేందుకు, నోటిఫికేషన్‌ను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖంగా లేవు. హైకోర్టు జోక్యం చేసుకుని.. కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి సమాఖ్య పాలన స్ఫూర్తిని కాపాడాలి’అని పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. విచారణార్హత ఉంది.. పిల్లోని అంశాలు అంతర్రాష్ట్ర జల వివాద అంశం కాదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వెలువరించిన నోటిఫికేషన్‌ను సవాలు చేసిన పిల్‌కు విచారణార్హత ఉందన్నారు. పిల్ దవిచారణార్హతపై పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించే నిమిత్తం విచారణ సెప్టెంబర్ 20వ తేదీకి వాయిదా పడింది. -
బ్యాటిల్ గ్రౌండ్ గేమ్‌ని నిషేధించండి.. తెలంగాణ హైకోర్టులో పిల్
యూత్‌లో ఎంతో క్రేజ్ ఉన్న వివాస్పద గేమ్ బ్యాటిల్ గ్రౌండ్‌ని నిషేధించాలంటూ తెలంగాణ హై కోర్టులో ప్రజా ప్రయోజనాల వాజ్యం దాఖలైంది. మొబైల్, కంప్యూటర్ వెర్షన్లలో ఈ గేమ్‌ని నిషేధించడంతో పాటు ఆన్లైన్ గేమ్ సేఫ్టీ రేటింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ ఈ పిటిషన్లో కోరారు. అదేవిధంగా గేమ్‌లకు నియమ నిబంధనలు రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గతంలో పబ్జీ పేరుతో యూత్‌లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే చైనాతో సరిహద్దు వివాదం మొదలైన తర్వాత డేటా ప్రైవసీ లేదంటూ కేంద్రం ఈ గేమ్‌ను నిషేధించింది. ఆ తర్వాత కాలంలో పలు నియమ నిబంధనలు విధించి 2021 జులైలో ఈ గేమ్‌ను అనుమతించగా .. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పేరుతో మళ్లీ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే బాంబే హైకోర్టులో కూడా ఈ గేమ్‌పై కేసు విచారణలో ఉంది. ఈ కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు ఆరు వారాల గుడువు ఇవ్వాలంటూ కేంద్రం న్యాయస్థానాన్ని కోరింది. ఇంతలో తెలంగాణ హైకోర్టులో మరో వాజ్యం దాఖలైంది. 2022 మార్చి 14న తెలంగాణ హైకోర్టు ఈ వాజ్యంపై విచారణ చేపట్టనుంది. ఇండియాలోనే కాకుండా బంగ్లాదేశ్, పాకిస్తాన్లలో కూడా ఈగేమ్ని నిషేధించాలంటూ న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. -
పోస్టింగ్‌లు లేకుండా జీతాలా? తెలంగాణ సీఎస్‌పై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో విధులు నిర్వహిస్తున్న పదుల సంఖ్యలో ఉద్యోగులకు కొన్ని నెలలుగా పోస్టింగులివ్వకుండా వేధిస్తున్నా రంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దాదాపు 10 నెలలైనా కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని, సీఎస్సే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలాగని ప్రశ్నించింది. మార్చి 14లోగా కౌంటర్ దా ఖలు చేయాలని, లేకపోతే సీఎస్ వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఏయే విభాగాల్లో ఎంత మంది అధికారులకు పోస్టింగ్ లేకుండా జీతాలిస్తున్నారు? తదితర వివరాలు సమర్పించాలంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలిల ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అది ప్రజాధన దుర్వినియోగమే.. రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ విభాగా ల్లో దాదాపు 40 నుంచి 50 మంది అధికారుల కు నెలల తరబడి పో స్టింగులు ఇవ్వడం లేదని, విధులు నిర్వహించకపోయినా వారికి వేతనాలు ఇస్తున్నారని మాజీ ఉద్యోగి బి. నాగధర్‌సింగ్ వ్యాజ్యం దాఖలు చేశారు. ‘పోస్టిం గ్ ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ విభా గం ఉన్నతాధికారి నుంచి ఆ ఉద్యోగికి చెల్లించిన జీతభత్యాలను వసూలు చేయాలి. క్రమశిక్షణా చర్యలు చేపట్టాలి’అని కోరారు. ఆ పిటిషన్‌ను ధర్మాసనం మరోసారి విచారించింది. పిటిషన్‌పై సీఎస్ ఇంకా కౌంటర్ వేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వెంకన్న అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌంటర్ దాఖలుకు మరో 4 వారాలు గడువు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థించారు. ధర్మాసనం స్పందిస్తూ.. విధులు నిర్వహించకపోయినా జీతాలు చెల్లించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని పేర్కొంది. కౌంటర్ దాఖలుకు ఇదే చివరి అవకాశమంటూ విచారణను వాయిదా వేసింది. -
‘గురుకుల’ పోస్టులపై పిల్.. పార్ట్‌టైమ్ ట్యూటర్‌పై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయాలంటూ ఓ పార్ట్‌టైమ్ ట్యూటర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయాలంటూ గత ఏప్రిల్‌లో వినతిపత్రం ఇచ్చి కనీసం నాలుగు వారాల సమయం కూడా ఇవ్వకుండా వెంటనే పిల్ దాఖలు చేయడం ఏంటని ప్రశ్నించింది. పార్ట్‌టైమ్ ట్యూటర్‌గా ఉంటూ అధ్యాపకుల నియామకాలు చేయాలని కోరుతూ పిల్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. గురుకుల పోస్టులకు దరఖాస్తు చేయనంటూ అఫిడవిట్ సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. సిద్దిపేట జిల్లాకు చెందిన ఎం.మధు ఈ పిల్ దాఖలు చేశారు. -
చంద్రబాబుపై పిల్.. ముగిసిన విచారణ
సాక్షి, అమరావతి : లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌తో పాటు మరికొందరు ఎమ్మెల్యేలపై హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ ముగిసింది. దాదాపు మూడుగంటల పాటు వాదనలు విన్న న్యాయస్థానం చివరకు తీర్పును వెలువరించింది. కరోనా వైరస్ కట్డడికి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రకృతి విపత్తు నివారణ చట్టం 2005 ప్రకారం ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. అలాగే తొలుత సంబంధిత శాఖకు ఫిర్యాదు చేయకుండా నేరుగా హైకోర్టును ఆశ్రయించడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. (లాక్డౌన్ నిబంధనలు చంద్రబాబు బేఖాతర్) నేరుగా పిల్ వేయటం మూలంగా వాస్తవ విషయాలపై విచారణ చేయలేమని పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అలాగే నిబంధనల ఉల్లంఘనలపై చట్టం ప్రకారం సంబంధిత శాఖలో ఫిర్యాదు చేసేందుకు అనుమతినిస్తూ హైకోర్టు తీర్పును వెలువరించింది. ఫిర్యాదులు అందగానే చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కాగా, లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ వంగా వెంకట్రామిరెడ్డి, న్యాయవాది పోనక జనార్ధన్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. (చంద్రబాబుపై హైకోర్టులో పిల్..) -
రాజకీయ ప్రయోజన వ్యాజ్యంగా మారుస్తారా?
సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీకి చెందిన కొందరు ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం సూర్యాపేటలో పట్టణానికి దూరంగా కలెక్టరేట్ నిర్మాణం చేపడుతోందని ఆరోపిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు గురువారం కొట్టేసింది. ఇదే అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను కూడా తోసిపుచ్చింది. పిల్ దాఖలు చేసిన చక్కిలం రాజేశ్వరరావు తాను ఓ జాతీయ పార్టీకి చెందిన వ్యక్తినని, ఆ పార్టీ అధికార ప్రతినిధినని ఎక్కడా చెప్పకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని రాజకీయ ప్రయోజన వ్యాజ్యంగా మార్చడం ఎంత మాత్రం తగదని హితవు పలికింది. బ్యాలెట్ ద్వారా చేయాల్సిన యుద్ధాలకు న్యాయస్థానాలను వేదికగా చేసుకోవడం మంచిది కాదని సూచించింది. ఈ వ్యాజ్యంలో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారని, దీంతో ఈ పిల్ వెనుక ఉన్న ఉద్దేశాలు బహిర్గతమయ్యాయని వ్యాఖ్యానించింది. కలెక్టరేట్ నిర్మించతలపెట్టిన భూమి పక్కనే మునిసిపల్ చైర్మన్ భర్త భూమి కొన్నారని, ఈ భూములకు రేట్లు పెరిగేలా చేసేందుకే ప్రభుత్వం అక్కడ కలెక్టరేట్‌ను నిర్మిస్తోందన్న పిటిషనర్ల వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. సూర్యాపేట జిల్లా ఏర్పడటానికి ముందే అక్కడ మునిసిపల్ చైర్మన్ భర్త శ్రీసాయి డెవలపర్స్ పేరుతో భూమి కొన్నారని గుర్తు చేసింది. కలెక్టరేట్ నిర్మాణం కోసం అవసరమైన మొత్తం 25 ఎకరాల భూమిలో ప్రభుత్వం మునిసిపల్ చైర్మన్ భర్తకు చెందిన శ్రీసాయి డెవలపర్స్ నుంచి 8 ఎకరాల భూమి మాత్రమే కొనుగోలు చేసిందని, మిగిలిన భూమిని ఇతర వ్యక్తుల నుంచి కొనుగోలు చేసిందని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. దురుద్దేశాలు అంటగట్టడం సరికాదు.. సూర్యాపేటలో ప్రభుత్వ భూమి ఉన్నా.. పట్టణానికి దూరంగా కుడకుడ, బీబీగూడెం గ్రామాల పరిధిలోని ప్రైవేటు భూములను రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందని, అందులో కలెక్టరేట్ నిర్మించాలని నిర్ణయించిందని ఆరోపిస్తూ సీహెచ్.రాజేశ్వరరావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే మంత్రి జగదీశ్‌రెడ్డికి చెందిన వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకే పట్టణానికి దూరంగా కలెక్టరేట్‌ను ప్రైవేటు భూముల్లో నిర్మిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కలెక్టరేట్ నిర్మాణం చేస్తున్న భూమి పక్కనే మునిసిపల్ చైర్మన్ భర్త భూములున్నాయన్న కారణంతో ప్రభుత్వ జీవోకు దురుద్దేశాలు అంటగట్టడం సరికాదన్న శ్రీసాయి డెవలపర్స్ తరఫు న్యాయవాది పి.శ్రీహర్ష వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. సూర్యపేట కలెక్టరేట్ నిర్మాణం విషయంలో ప్రభుత్వ చర్యల వెనుక దురుద్దేశాలు ఉన్నాయని చెప్పలేమని తేల్చి చెప్పింది. -
‘ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలి’
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ నుంచి గెలిచి, తర్వాత టీడీపీలోకి ఫిరాయించిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వెంటనే చర్యలు తీసుకునేలా లోక్‌సభ, అసెంబ్లీ సెక్రటరీలను ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ ధర్మాసనం విచారణ జరపనుంది. -
‘ఉరి’శిక్షపై స్పందించండి: సుప్రీం
న్యూఢిల్లీ: మెడకు ఉరి బిగించడం ద్వారా మరణ దండన విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై స్పందనను తెలియజేయాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా పిటిషనర్ రిషీ మల్హోత్రా వాదిస్తూ.. ‘రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రకారం ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఉంటుందనీ, ఇది ఖైదీలకు సైతం వర్తిస్తుంద’ని కోర్టుకు విన్నవించారు. ఖైదీలు గౌరవప్రదంగా, తక్కువ బాధతో చనిపోయేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఉరి బిగించడం ద్వారా కాకుండా విషపూరిత ఇంజెక్షన్ ఇవ్వడం, తుపాకీతో కాల్చటం, కరెంట్ చైర్, గ్యాస్ ఛాంబర్లో బంధించడం వంటి ఇతర మార్గాలను పరిశీలించవచ్చని వెల్లడించారు. పిటిషనర్ వాదనలు విన్న సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం.. మూడు వారాల్లోగా స్పందనను తెలియజేయాలని కేంద్రానికి నోటీసులు జారీచేసింది. -
గాంధీ హత్య.. నాలుగో బుల్లెట్ ఎక్కడిది?
సాక్షి, న్యూఢిల్లీ : జాతి పిత మహాత్మా గాంధీజీ హత్యకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం కోర్టు నేడు(శుక్రవారం) విచారణ చేపట్టనుంది. బాపూజీ హత్యపై పలు అనుమానాలు ఉన్నాయంటూ అభినవ్ భారత్ ట్రస్ట్ సభ్యుడు పంకజ్ ఫడ్నవిస్ ఈ పిల్ దాఖలు చేశారు. జనవరి 30, 1948న జరిగిన అంశాలను ప్రస్తావిస్తూ.. నిజాలను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందంటూ ఆయన న్యాయస్థానాన్ని కోరారు. గాంధీని నాథురం గాడ్సే ఒక్కడే హత్య చేయలేదని.. అతనితోపాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడని పంకజ్ చెబుతున్నారు. నిజానికి గాడ్సే గాంధీని కాల్చిన సమయంలో మూడు బుల్లెట్లే తగిలాయంటూ చెప్పారు. కానీ, నాలుగో బుల్లెట్ మూలంగానే గాంధీ మరణించారని అప్పట్లో అంతర్జాతీయ మీడియాలు ప్రముఖంగా ప్రచారం చేశాయి. అయితే ఆ అంశాన్ని అప్పటి పోలీసులు పక్కన పెట్టారని పంకజ్ వాదిస్తున్నారు. గాంధీజీ హత్యకు గాడ్సే ఉపయోగించింది 'బెరెట్టా' తుపాకీ. గ్వాలియర్ కు చెందిన డాక్టర్ దత్తాత్రేయ పర్చూరే వాటిని గాడ్సేకు సమకూర్చాడన్న ఆరోపణలు ఉన్నాయి. రిజిస్టర్డ్ నంబర్ 068240, 719791లతో అవి ఆయన దగ్గర ఉన్నాయి. కానీ అయితే రెండో నంబర్‌కు చెందిన రిజిస్ట్రేషన్‌తో గ్వాలియర్ కే చెందిన ఉదయ్ చాంద్ అనే వ్యక్తి వద్ద కూడా ఓ తుపాకీ ఉందని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన 1948 నాటి పోలీస్ డాక్యుమెంట్‌ను ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా బహిర్గతం కూడా చేసింది. ఇక గాడ్సే వాడిన తుపాకీ నుంచి నాలుగో బుల్లెట్ రాలేదన్న విషయాన్ని బలపరుస్తూ ఆ సమయంలో గాంధీ పక్కనే సహయంగా ఉన్న మనుబెన్ తన డైరీలో రాసుకున్నారు. ఈ నేపథ్యంలో గాంధీని గాడ్సే ఒక్కడే చంపాడా? లేక ఇద్దరు చంపారా? చంపితే ఆ వ్యక్తి ఎవరు? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందని పంకజ్ కోరుతున్నాడు. మరి సుప్రీంకోర్టు ధర్మాసనం పిల్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో మరి కొన్ని గంట్లోనే తెలియనుంది. -
తెలుగు అకాడమీని విభజించాలి
► ఏపీ విద్యార్థులకు ఆగిన పుస్తకాల సరఫరా ► హైకోర్టులో దాఖలైన పిల్ సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీని విభజించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పునర్విభజన చట్టం వచ్చాక ఏడాది మాత్రమే ఏపీ లోని విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేసిన తెలుగు అకాడమీ తర్వాత తెలంగాణకు మాత్రమే ఇస్తోందంటూ గుంటూరు జిల్లా వినుకొండ వాసి, ఆలిండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏపీ కౌన్సెల్ సభ్యుడు ఎం.వెంకట సుబ్బారావు పిల్ దాఖలు చేశారు. పునర్విభజన చట్టం సెక్షన్ 82 ప్రకారం పదో షెడ్యూల్లోని స్వతంత్ర సంస్థల్లో సిబ్బంది, ఆస్తులు, అప్పులను ఏడాదిలోగా విభజిం చాలని, మూడేళ్లయినా 61 సంస్థల్లోని వాటిని 2 రాష్ట్రాలకు పంపిణీ చేయలేద న్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిఏడాది మాత్రమే ఏపీకి పుస్తకాలను సరఫరా చేసిందన్నారు. తెలంగాణ కు మాత్రమే పుస్తకాలు సరఫరా చేయడం వల్ల ఏపీ విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. ప్రతివాదులుగా కేంద్ర హోం శాఖతోపాటు, తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శులను చేశారు. -
బుగ్గ కార్లు, హారన్లు వాడకంపై పిల్
హైదరాబాద్: బుగ్గ కార్ల వాడకంపై ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ, కొందరు ప్రజా ప్రతినిధులు మాత్రం దర్పాన్ని ప్రదర్శించుకునేందుకు బుగ్గ కార్లు వాడేస్తున్నారని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఇటువంటి వారిపై తగిన చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. బుగ్గ కార్లు, హారన్ల వాడకంపై కేంద్రం విధించిన ఆంక్షలను కఠినంగా అమలు చేసేలా ఆదేశాలివ్వాలంటూ మహబూబ్‌నగర్ జిల్లా రుద్రారం గ్రామానికి చెందిన న్యాయవాది డి.భావనప్ప ఈ పిల్ దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, రవాణాశాఖ కమిషనర్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. కొన్ని హోదాల్లో ఉన్న వ్యక్తులు మాత్రమే బుగ్గ కార్లు వాడేందుకు చట్ట నిబంధనలు అనుమతినిస్తున్నాయన్నారు. ఈ విషయంలో ఇటీవల కేంద్రం కూడా పలు ఆంక్షలు తీసుకొచ్చిందని తెలిపారు. కొంతమంది టోల్గేట్ల వద్ద వీఐపీలను గుర్తించేందుకు ఉపయోగించే హారన్లను వాడుతున్నారని తెలిపారు. ఇవన్నీ కళ్ల ముందు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. -
ప్రజా ప్రయోజన వ్యాజ్యం
సుప్రీంకోర్టు, హైకోర్టు, కిందిస్థాయి కోర్టుల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసినట్లు తరచూ పేపర్లలో వార్తలు వస్తుంటాయి. తాజాగా హైదరాబాద్ నగరంలో నడిబొడ్డున ఉన్న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ స్థలాన్ని మార్చాలంటూ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కూడా హైకోర్టు మంగళవారం విచారించింది. ధన్ గోపాల్ రావు అనే వ్యక్తి ఈ పిల్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి, హోంశాఖ ప్రధాన కార్యదర్శికి, రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనర్లకు, హైదరాబాద్ డీసీపీకి హైకోర్టు నోటీసులు పంపింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో అసలు పిల్ అంటే ఏమిటి? ఎవరు? ఎప్పుడు? దాఖలు చేయవచ్చొ క్విక్‌రివ్యూలో తెలుసుకుందాం... ప్రజా ప్రయోజన వ్యాజ్యం అంటే? ఒక వ్యక్తి కానీ, ఓ వర్గం కానీ తన సొంతం కోసం కాకుండా ప్రజా ప్రయోజనాన్ని ఆశించి కోర్టులో దాఖలు చేసే వ్యాజ్యాన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యం అంటారు. దీన్నే ఇంగ్లిష్‌లో Public& Interest Litigation అంటారు. న్యాయవ్యవస్థ క్రియాశీలత ద్వారా న్యాయస్థానాలు ప్రజలకు ఇచ్చిన అధికారమే ప్రజా ప్రయోజన వ్యాజ్యం. ఎందుకోసం? ప్రజాప్రయోజన వ్యాజ్యమనేది న్యాయం పొందడం కోసం న్యాయస్థానాలు ప్రజలకు అందజేసిన ఓ ఆయుధం వంటింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన తర్వాత కోర్టులు జారీ చేసే ఆదేశాలతో బాధితులకు న్యాయం కలగడమే కాకుండా అనేక సందర్భాల్లో రక్షణ చర్యలు, బాధితు ప్రయోజనాల కోసం విధివిధానాలు రూపొందించడం వంటి మేలు కూడా జరిగింది. ఎప్పుడు దాఖలు చేయవచ్చు? సమస్యపై పోరాడేందుకు బాధితుడి వద్ద అవసరమైన వనరులు లేనప్పుడు లేదా ఆ వ్యక్తి న్యాయస్థానానికి వెళ్లే స్వేచ్ఛను హరించినపుడు లేదా అన్యాయంగా అడ్డుకున్నప్పుడు ఇటువంటి వ్యాజ్యాలు దాఖలు చేయవచ్చు. అన్యాయం జరిగిన విషయం న్యాయస్థానం దృష్టికి వచ్చినట్లయితే... న్యాయస్థానమే స్వయంగా విచారణ చేపట్టవచ్చు. లేదా ప్రజాప్రయోజనాల కోసం కృషి చేసే వారెవరైనా దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించడం చేయవచ్చు. సాయం కోరుతున్న వ్యక్తి స్వప్రయోజనాల కోసమో లేదా దురుద్దేశాలతోనో కాకుండా ప్రజల ఇబ్బందులకు పరిష్కారం పొందేందుకు విశ్వసనీయంగా ప్రవర్తిస్తున్నాడా లేదా అనే విషయాన్ని కూడా కోర్టు సరిచూసుకుంటుంది. ఆ తర్వాతే విచారణకు స్వీకరిస్తుంది. లేఖ కూడా వ్యాజ్యమే... ప్రజలకు నష్టం కలిగిస్తున్న సమస్య తీవ్రతను, పర్యవసానాలను వివరిస్తూ ఎవరైనా న్యాయస్థానానికి లేఖ రాసినప్పుడు... ఆ లేఖపై సైతం కోర్టు స్పందించవచ్చు. ఆ లేఖ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వంటిదేనని కోర్టు భావించాల్సి ఉంటుంది. అటువంటి లేఖలను న్యాయస్థానాన్ని ఉద్దేశించి రాయాలే తప్ప ఏ న్యాయమూర్తిని ఉద్దేశించి రాయకూడదు. ప్రజాప్రయోజన వ్యాజ్యాలను స్వీకరించిన మొట్టమొదటి న్యాయమూర్తులు జస్టిస్ పీఎన్ భగవతి, జస్టిస్ వీఆర్ కృష్ణ అయ్యర్. -
తప్పు చేస్తే ఆమ్వే పై చర్యలు తీసుకోండి: హైకోర్టు
చట్ట విరుద్ధంగా ఆమ్వే ఇప్పటికీ మనీ సర్కులేషన్ కింద వ్యాపారం చేస్తున్నట్లు తేలితే సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చట్ట నిబంధనలకు, హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఆమ్వే మనీ సర్కులేషన్ వ్యాపారం చేస్తోందని, దీనిని అడ్డుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ విజయవాడకు చెందిన కార్పోరేట్ ఫ్రాడ్స్ వాచ్ సొసైటీ 2009లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన హైకోర్టు గురువారం దీనిని మరోసారి విచారణ చేపట్టింది. పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం ఇందులో విచారించడానికి ఏమీ లేదని తేల్చి చెప్పింది. ఈ సమయంలో పిటిషనర్ తరఫున న్యాయవాది జోక్యం చేసుకుంటూ ఆమ్వే ఇప్పటికీ గొలుసుకట్టు వ్యాపారం చేస్తోందన్నారు. అయితే చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఆమ్వే మనీ సర్కులేషన్ కింద వ్యాపారం చేస్తుంటే సంబంధిత చట్టాల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఇరు ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశిస్తూ ఈ వ్యాజ్యాన్ని మూసివేస్తున్నట్లు పేర్కొంది. -
కరువు రాష్ట్రాల్లో ‘సంక్షేమం’పై నివేదికివ్వండి
కేంద్ర, రాష్ట్రాలకు ఆదేశించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: కరువు అలముకున్న రాష్ట్రాల్లో ఏమేం సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారో తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎంజీఎన్ఆర్ఈజీఏ, జాతీయ ఆహార భద్రత, మధ్యాహ్న భోజనం వంటి సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరు, వర్షపాతాల నమోదుపై నివేదిక ఇవ్వాలని జస్టిస్ లోకూర్, ఆర్కే అగర్వాల్‌తో కూడిన బెంచ్ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు సోమవారం సూచించింది. 22వ తేదీలోపు నివేదికలివ్వాలంది. కరువు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, యూపీ, ఎంపీ, కర్ణాటక, ఒడిశా, జార్ఖండ్, బిహార్, హరియాణా, గుజరాత్, మహారాష్ర్ట, ఛత్తీస్‌గఢ్‌ల్లో బాధితులను ఆదుకునే దిశగా అధికారులు చర్యలు తీసుకోలేదంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై కోర్టు స్పందించింది. ఎన్నికల సర్వేలు నిర్వహించే యోగేంద్ర యాదవ్ తదితరుల ఆధ్వర్యంలోని ‘స్వరాజ్ అభియాన్’ స్వచ్ఛంద సంస్థ ఈ పిల్ వేసింది. వారి తరుఫున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ... కరువు ప్రాంతాల్లో బాధితులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చూపాయన్నారు. ఎంతో మంది మరణించారని, ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 24 ఉల్లంఘనే అవుతుందన్నారు. బిహార్, మధ్యప్రదేశ్ మినహా మరే కరువు బాధిత రాష్ట్రాలూ ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టలేదన్నారు. ఇతర రాష్ట్రాలు ఏపీఎల్-బీపీఎల్ల మధ్య వ్యత్యాసం ఆధారంగా ప్రజా పంపిణీ వ్యవస్థను నడిపిస్తున్నాయని, ఈ విధానం వల్ల ఉపయోగం లేదని పరిశోధనల్లో తేలిందన్నారు. ‘ఎన్ఎఫ్ఎస్ఏ’ను అమలు చేయడం వల్ల బిహార్, మధ్యప్రదేశ్‌ల్లో సత్ఫలితాలు వచ్చాయని ప్రశాంత్‌భూషణ్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తులు... బాధితులు, బాధిత ప్రాంతాల్లో కనీసం అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, ఉపాధి అవకాశాలపై ఏమేం చర్యలు తీసుకున్నారో తెలపాలని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్‌ను అడిగారు. రంజిత్‌కుమార్ వివరణనిస్తూ... రాష్ట్ర విపత్తుల సహాయ నిధి (ఎస్డీఆర్ఎఫ్), జాతీయ విపత్తుల సహాయ నిధిల నుంచి ఆర్థిక సాయం అందించామన్నారు. కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఎంపీ, మహారాష్ట్రలకు వరుసగా రూ.1,500 కోట్లు, రూ.1,276 కోట్లు, రూ.2,032 కోట్లు, రూ.3,044 కోట్లు మంజూరు చేశామన్నారు. 2015-20 కాలానికి మొత్తం రూ.61,291 కోట్లు సహాయ నిధిని ఏర్పాటు చేశామన్నారు. -
రైతులపై ప్రభుత్వాలది సవతి తల్లి ప్రేమ
♦ వ్యయానికీ, ఎంఎస్పీకీ పొంతన ఉండటం లేదు ♦ అందుకే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ♦ హైకోర్టుకు నివేదించిన కోదండరాం, జలపతిరావు ♦ తమనూ ప్రతివాదులుగా చేర్చుకోవాలని పిటిషన్ సాక్షి, హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)లో తమనూ ప్రతివాదులుగా చేర్చుకుని తమ వాదనలూ వినాలంటూ తెలంగాణ విద్యార్థి వేదిక గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.కోదండరాం, తెలంగాణ రైతు జేఏసీ ప్రతినిధి ఎల్.జలపతిరావు సంయుక్తంగా మంగళవారం హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. రైతుల పట్ల ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమను చూపుతున్నాయని, రైతుల పట్ల ఒక రకంగా, పారిశ్రామిక వేత్తల పట్ల మరో రకంగా వ్యవహరిస్తున్నాయని వారు అందులో పేర్కొన్నారు. సాగు వ్యయానికీ, ప్రభుత్వం అందిస్తున్న కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కూ ఏ మాత్రం పొంతన ఉండటం లేదని, పెట్టిన ఖర్చులు కూడా దక్కక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. మద్దతు ధర లభించక రైతులు విధి లేక తమ పంటను దళారులకు అమ్ముకుంటున్నారని తెలిపారు. అసలు ఎంఎస్పీ ఖరారు ప్రక్రియనే అశాస్త్రీయంగా ఉంటోందని, క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రపంచీకరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలు నిర్ణయిస్తున్నాయన్నారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ నేతృత్వంలోని జాతీయ రైతుల కమిషన్ 2006లో చేసిన సిఫారసులను ప్రభుత్వాలు అమలు చేయలేదన్నారు. ఎంఎస్పీ ఖరారు సమయంలో ఎంఎస్పీకి సాగువ్యయాన్ని 50 శాతం అదనంగా చేర్చాలన్న సిఫారసును పట్టించుకునే నాథుడు లేరని వివరించారు. రైతులకు నిర్ధిష్టంగా వార్షిక ఆదాయం అంటూ ఉండదని, వార్షికాదాయం పలు అంశాలపై ఆధారపడి ఉంటుందని కోదండరాం, జలపతిరావు తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఒకవైపు పెరిగిన ఖర్చులు, మరోవైపు అధిక వడ్డీలకు తెచ్చిన రుణాల మధ్య రైతులు నలిగిపోతున్నారని, ఈ పరిస్థితుల్లో ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నారన్నారు. పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్‌ను అందించే ప్రభుత్వాలు, రైతులకు మాత్రం కోతలను అమలు చేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వాల నుంచి మద్దతు లేకపోవడం, వర్షాభావ పరిస్థితులు, అధిక వడ్డీలు ఇలా అనేక అంశాలు అన్నదాతను ఊపిరి సలపకుండా చేస్తున్నాయన్నారు. ఆర్థిక సంస్థలు సైతం హైటెక్ వ్యవసాయ వ్యాపారులకు, బయోటెక్నాలజీ కంపెనీలకు ఇస్తున్న స్థాయిలో రైతులకు రుణాలు ఇవ్వడం లేదన్నారు. 1986-1990ల్లో వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు 14.5 శాతం ఉంటే ఇప్పుడది 6 శాతానికి పడిపోయిందని తెలిపారు. ఆర్థిక సంస్కరణల అమలుతో సాగు భూముల వృద్ధి రేటు 2.62 శాతం నుంచి 0.5 శాతానికి పడిపోయిందని వారు వివరించారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది బి.రచనారెడ్డి వాదనలు వినిపించనున్నారు. -
టీడీపీమేనిఫెస్టో పై పిల్ దాఖలు చేస్తాం
నిరుద్యోగులకు తప్పుడు హామీలు ఇచ్చి మోసగించినందుకు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో పై హైకోర్టులో ప్రజాప్రయోజనాల వాజ్యం(పిల్)ను దాఖలు చేయనున్నట్లు రాష్ట్ర నిరుద్యోగుల ఐక్యవేదిక అధ్యక్షుడు లగుడు గోవిందరావు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 1.42 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం గుంటూరులో గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి నిరుద్యోగులు ఓటు వేశారని.. తెలిపారు. పంచాయితీ రాజ్ శాఖలో ఉన్న 3,400 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు.. మిగులు ఉద్యోగులతో వాటిని బర్తీ చేస్తామని చెబుతున్నారని మండి పడ్డారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలి
* రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిల్ * హైకోర్టును ఆశ్రయించిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వాల హయాంలో ప్రారంభమై మధ్యలో నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని మొదట పూర్తి చేసి, ఆ తరువాతనే తాజాగా ప్రకటించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పథకాన్ని చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గృహ నిర్మాణశాఖ ముఖ్య కార్యదర్శి, సీఐడీ అదనపు డీజీలను ఇందులో ప్రతివాదులుగా పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తరువాత 4.67 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో నిలిచిపోయాయని పద్మనాభరెడ్డి తన పిటిషన్లో వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని, విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు అక్రమాలు నిజమేనని నిర్ధారిస్తూ 1150 మంది అక్రమాలకు పాల్పడ్డారని, అందులో రాజకీయ నాయకులు కూడా ఉన్నారని తెలిపారన్నారు. ఈ వివరాలను సమాచార హక్కు చట్టం కింద ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారని పేర్కొన్నారు. నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్ల పనులను కొనసాగించేందుకు బడ్జెట్లో ఎటువంటి నిధులు కేటాయించలేదని పద్మనాభరెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఇళ్ల కోసం లబ్ధిదారులు తమ వాటా కింద ఇప్పటికే రూ.1000 కోట్లు ఖర్చు చేశారని, నిర్మాణం ఆగిపోవడంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేసి, అక్రమార్కులపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. -
మాకు టీచర్లు కావాలి!
-
మాకు టీచర్లు కావాలి!
ఉపాధ్యాయుల కొరతపై హైకోర్టు సీజేకు 1,600 మంది విద్యార్థుల లేఖలు వాటిని సుమోటోగా విచారణకు స్వీకరించిన న్యాయస్థానం డుమ్మా కొట్టే టీచర్లను తక్షణమే సస్పెండ్ చేయండి అలసత్వం ప్రదర్శించే అధికారులపైనా చర్యలు తీసుకోండి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం విచారణ 20కి వాయిదా హైదరాబాద్: బడికి రాని టీచర్లపై, బాధ్యత తప్పిన సర్కారుపై... బడి పిల్లలు చేపట్టిన పోరాటం హైకోర్టును కదిలించింది. చదువు కోసం ఆ చిన్నారుల ఆరాటం న్యాయమూర్తులను చలింపజేసింది. ఆ పిల్లల లేఖలే రాష్ట్ర ప్రభుత్వంపై, అలసత్వపు అధికారులపై అస్త్రాలుగా మారాయి. బడికి డుమ్మా కొట్టే టీచర్లను తక్షణమే సస్పెండ్ చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చేలా చేశాయి. దీనిపై ప్రభుత్వాన్ని వివరణ కోరేలా చేశాయి.తమ పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు లేరని, దీంతో తాము సరైన విద్యను పొందలేకపోతున్నామంటూ మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన విద్యార్థులు రాసిన లేఖలను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యం గా స్వీకరించింది. నియామకాలు పొంది పాఠశాలలకు వెళ్లని ఉపాధ్యాయులను తక్షణమే సస్పెండ్ చేయాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అటువంటి వారిని ఏమాత్రం ఉపేక్షించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో విద్యార్థులకు సరపడా ఉపాధ్యాయులను నియమించడంలో అలసత్వం ప్రదర్శించే విద్యాశాఖ అధికారులపైనా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. విద్యార్థుల భవిష్యత్తే తమకు ముఖ్యమని, ఈ విషయంలో మరో మాటకు తావులేదని తెలిపింది. విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులను నియమించే విషయంలో ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలియచేయాలని... ఈ సమస్యను అధిగమించేందుకు ఏ చర్యలు తీసుకోబోతున్నారో పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో తమ పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు లేరని, దీంతో తాము సరైన విద్యను పొందలేకపోతున్నామని పేర్కొంటూ మహబూబ్‌నగర్ జిల్లా బొయ్యలగూడెం, మాచర్ల, కేశవరం, చింతలకుంట, మిట్టదొడ్డి, యల్లందొడ్డి, చాగదొన, అరిగిగడ్డ గ్రామాలకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ నెల 6వ తేదీన ఎంవీ ఫౌండేషన్ సహకారంతో హైకోర్టు సీజే, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ వేదిక, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ వేదికలకు లేఖలు రాశారు. తమకు వచ్చిన దాదాపు 1,600కు పైగా లేఖలను పరిశీలించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి... వీటిని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా మలచాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ మేరకు రిజిస్ట్రీ ఆ లేఖలను పిల్‌గా మలిచి విచారణ నిమిత్తం ధర్మాసనం ముందుంచింది. దీనిపై సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తి వివరాలను ధర్మాసనం ప్రస్తావించింది. కేశవరం గ్రామంలో 5, 6 తరగతులకు చెందిన 180 మంది విద్యార్థులకు ఒకే టీచర్ ఉన్నారని, చింతలకుంటలో 5వ తరగతికి చెందిన 166 మంది విద్యార్థులకు టీచరే లేరని, మిట్టదొడ్డిలో 8వ తరగతికి చెందిన 120 మంది విద్యార్థులకు టీచర్ లేరని... ఇలా వివరాలను చదివి వినిపించింది. దీనిపై ఏమంటారని రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) రామచంద్రరావును ప్రశ్నించింది. ఇది చాలా కీలక అంశమని, టీచర్ల కొరతను సీరియస్‌గా పరిగణిస్తున్నామని రామచంద్రరావు తెలిపా రు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ...‘ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ఏమిటి? ఒకరు కాదు.. ఇద్దరు కాదు వందల సంఖ్యలో విద్యార్థులు మాకు లేఖలు రాశారు. మేం చదువుకుంటాం.. ఉపాధ్యాయులను నియమించండి అని అడుగుతున్నారు. దేశ భావితరాలకు ఈ మాత్రం కూడా చేయలేమంటే ఎలా..?’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఉపాధ్యాయులుగా నియామకాలు పొంది పాఠశాలలకు వెళ్లని వారిని సస్పెండ్ చేయాలని.. అలా చేస్తే మిగతా వారు దారికి వస్తారని పేర్కొంది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. మిగిలింది శూన్యం.. గట్టు (మహబూబ్‌నగర్): అక్షరాస్యతలో అట్టడుగున ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం మరింత నిర్లక్ష్యం చూపుతోంది. ఫలితంగా ఇక్కడి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సరైన విద్య అండం లేదు. ఈ పరిస్థితిని వివరిస్తూ గట్టు మండలంలోని చింతలకుంట ప్రాథమిక పాఠశాల (పీఎస్), జెడ్పీ స్కూళ్ల విద్యార్థులు 200 మంది, సిద్దోనిపల్లి తండా పీఎస్ నుంచి 100, బలిగెర పీఎస్ 100, చమన్‌ఖాన్‌దొడ్డి పీఎస్ 100, హిందువాసి పీఎస్ 100, మిత్తదొడ్డి, దళితవాడ పీఎస్‌ల నుంచి 150, గట్టు బాలికల పీఎస్ 50, గొర్లఖాన్‌దొడ్డి పీఎస్ 100, ఆలూరు పీఎస్/జెడ్పీ స్కూళ్ల నుంచి 150, తుమ్మలచెర్వు యూపీఎస్ 100, చాగదోన పీఎస్ 100, బోయలగూడె పీఎస్ నుంచి 150, కొత్తపల్లి పీఎస్ నుంచి 50 మంది, మరికొన్ని స్కూళ్ల నుంచి ఇంకొందరు విద్యార్థులు హైకోర్టుకు లేఖలు రాశారు. అసలు చింతలకుంట పీఎస్‌లో 330 మంది విద్యార్థులుండగా.. ముగ్గురు టీచర్లు ఉండేవారు. ఇటీవలి బదిలీల్లో ఇద్దరు వెళ్లిపోవడంతో... ఒక్కరే మిగిలారు. చింతలకుంట హైస్కూల్లో 166 మంది విద్యార్థులకు బదిలీల అనంతరం ఒక్కరే మిగిలారు. ఈ స్కూల్లో మూడేళ్లుగా పదో తరగతి విద్యార్థులు 100శాతం ఫలితాలు సాధిస్తుండడం గమనార్హం. ఇక గట్టు మండలంలోని బల్గెర దళితవాడ, చమన్‌ఖాన్‌దొడ్డి, ఇందువాసి, కొత్తపల్లి, మిట్టదొడ్డి ప్రాథమిక పాఠశాల, దళితవాడ పాఠశాల, గట్టు బాలికల పాఠశాల, సిద్దొనిపల్లెతండా ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేకుండా పోయారు. మరో 21 పాఠశాలలు ఒకే టీచర్‌తో కొనసాగుతున్నాయి. ఈ మండలంలో 199 టీచర్ పోస్టులు ఉండగా 76 మంది టీచర్లే ఉన్నారు. 123 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ‘ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో మీరు మీ పిల్లలను గానీ, మీ బంధువుల పిల్లలను గానీ చేర్పించేందుకు సిద్ధంగా ఉన్నారా..?’.. - అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావుకు హైకోర్టు ప్రశ్న.. ‘లేదు..’ - రామచంద్రరావు సమాధానం -
43% ఫిట్‌మెంట్‌పై స్పందించిన హైకోర్టు
కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం హైదరాబాద్: పీఆర్సీ చేసిన సిఫారసులకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై హైకోర్టు స్పందించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసిం ది. 43 శాతం ఫిట్మెంట్ ఉత్తర్వులపై తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేయాలంటూ ‘ఫోరం ఫర్ బెటర్ లివింగ్ ’ సంస్థ చైర్పర్సన్ డి.పద్మజ ఇటీవల హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే. -
43 శాతం ఫిట్మెంట్ సరికాదు
హైకోర్టులో వ్యాజ్యం దాఖలు హైదరాబాద్: వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) చేసిన సిఫారసులకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం 43 శాతం ఫిట్మెంట్ మంజూరు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ ఉత్తర్వులకు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేయాలంటూ వరంగల్ జిల్లాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘ఫోరం ఫర్ బెటర్ లివింగ్ ’ చైర్పర్సన్ డి.పద్మజ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి ప్రదీప్‌కుమార్ అగర్వాల్ అధ్యక్షతన ప్రభుత్వం పదవ పీఆర్సీ ఏర్పాటు చేసిందని, ఉద్యోగులతో చర్చల తరువాత 29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫారసు చేసిందని పిటిషనర్ తెలిపారు. అయితే ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ఉద్యోగులకు ఏకంగా 43 శాతం మేర ఫిట్మెంట్ ప్రకటించిందన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఇచ్చేంత వరకు ఆగకుండా ప్రభుత్వం అత్యుత్సాహంతో ఆగమేఘాలపై 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించిందని పద్మజ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే నగదురహిత వైద్య సదపాయం, ఎల్టీసీ, ఇళ్ల స్థలాలు, బీమా, నామమాత్రపు వడ్డీకి రుణాలు ఇలా అనేక ప్రయోజనాలు వారికి లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఇదంతా సామాన్య ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నుల నుంచి చెల్లిస్తున్నదేనని వివరించారు. ఉద్యోగుల సమస్యలను చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇదే సమయంలో సామాన్య ప్రజల కష్టాలను, నష్టాలను కూడా పట్టించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదేనన్నారు. వ్యవసాయం, విద్యుత్, విద్య తదితరాలను పట్టించుకోకుండా ఏకంగా 43 శాతం ఫిట్‌మెంట్‌ను ఉద్యోగులకివ్వడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. -
‘సీఆర్డీఏ’పై హైకోర్టు నోటీసులు
ఆ సంస్థ రాజ్యాంగబద్ధత సవాలు పిటిషన్‌పై స్పందన జూన్ 10లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశం తదుపరి విచారణ జూన్ మూడో వారానికి వాయిదా హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతాభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ) రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ఉమ్మడి హైకోర్టు సోమవారం స్పందించింది. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ మూడో వారానికి వాయిదా వేసింది. జూన్ 10 కల్లా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సర్కార్‌కు స్పష్టం చేసిన హైకోర్టు, ఆ వెంటనే ఆ కౌంటర్‌కు తిరుగు సమాధానం (రిప్లై) ఇవ్వాలని పిటిషనర్లను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్డీఏ చట్టం రాజ్యాంగ విరుద్ధమే కాక, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి కూడా వ్యతిరేకమంటూ విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఎ.గోపాల్‌రావు, జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి, ప్రముఖ పాత్రికేయులు ఎ.బి.కె.ప్రసాద్, సీనియర్ న్యాయవాది సి.సదాశివరెడ్డి ఇటీవల హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఏపీ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా సీఆర్డీఏ చట్ట నిబంధనలు ఉన్నాయని తెలిపారు. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం రాజధాని ప్రాంత ఎంపిక కేంద్ర ప్రభుత్వానిదేనని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ణయాధికారం లేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆ సెక్షన్ ప్రకారం కేంద్రం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ గత ఏడాది ఆగస్టు 27న తన నివేదికను సమర్పించిందని తెలిపారు. వ్యవసాయ భూములకు జరిగే నష్టం కనిష్టస్థాయిలో ఉండాలన్నదే కమిటీ ప్రధాన ఉద్దేశమన్నారు. గుంటూరు జిల్లాలో 65 శాతం, కృష్ణా జిల్లాలో 56 శాతం మంది వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలుగా ఉన్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు వల్ల రైతులు భూములు కోల్పోయి, కూలీలు ఉపాధి లేక రోడ్డునపడుతారని కమిటీ తన నివేదికలో పేర్కొన్నారని ఆయన వివరించారు. విజయవాడకు 300 కిలోమీటర్ల పరిధిలో భూకంపాలు వచ్చే అవకాశం ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికను కూడా కమిటీ ప్రస్తావించిందన్నారు. భూసేకరణ చట్టం-2013 ప్రకారం బహుళ పంటల భూములను ఎట్టి పరిస్థితుల్లో సేకరించడానికి వీల్లేదని, ప్రస్తుత రాజధాని భూముల్లో బహుళ పంటలు పండే భూములే అధికంగా ఉన్నాయని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) అని పేరు పెట్టిన ప్రభుత్వం.. అంతిమంగా భూ సేకరణే చేస్తోందన్నారు. రాజధాని ప్రాంతంలో భూమిని నమ్ముకుని బతుకుతున్న కూలీలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని ప్రకాశ్‌రెడ్డి వివరించారు. 2013 భూ సేకరణ చట్టంలో వ్యవసాయ కూలీల ఉపాధికి తీసుకోవాల్సిన చర్యల గురించి స్పష్టంగా చెప్పారన్నారు. అయితే ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సీఆర్డీఏ చట్టంలో వ్యవసాయ కూలీల ఉపాధి గురించి ఎక్కడా ప్రస్తావన లేదన్నారు. కేంద్ర చట్టాన్ని పట్టించుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని తీసుకొచ్చిందని వివరించారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం, తాము ప్రస్తుతం ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించి, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తున్నామని, కౌంటర్ పరిశీలించిన తరువాతే తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తేల్చి చెప్పింది. -
పౌరసత్వం 'పిల్'ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులకు ఇండియా పౌరసత్వం కల్పించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే అర్హత(లోకస్ స్టాండీ) లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. విదేశీ పౌరసత్వం కలిగిన ప్రవాస భారతీయులకు ఇండియా సిటిజన్ షిప్ ఇవ్వాలని కోరుతూ సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వెంకట్ నారాయణ్ ఈ పిల్ దాఖలు చేశారు. అయితే పౌరసత్వం లేనికారణంగా ఇబ్బందులు పడుతున్న ఎన్నారైలు తమను నేరుగా ఆశ్రయించవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ ఎల్ దత్తు, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన బెంచ్ పేర్కొంది. పిల్ వేయాల్సిన విధానం ఇది కాదంటూ పిటిషనర్ కు చురక అంటించింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు స్తోమత లేని పేదలు కోసం ప్రజాప్రయోజన వ్యాజ్యం ఉందని గుర్తు చేసింది. -
'చెస్ట్ ఆస్పత్రిని తరలించ వద్దంటూ హైకోర్టులో పిల్'
-
'చెస్ట్ ఆస్పత్రిని తరలించ వద్దంటూ హైకోర్టులో పిల్'
హైదరాబాద్: ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిని వికారాబాద్‌కు తరలించొద్దంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) వేశానని తెలంగాణ బీజేపీ నాయకుడు నాగం జనార్థన్ రెడ్డి అన్నారు. చెస్ట్ ఆస్పత్రిని తరలించడం పేద రోగులకు ఇబ్బంది కలిగించడమేనని ఆయన అన్నారు. బుధవారం నాగం విలేకరులతో మాట్లాడారు. చెస్ట్ ఆస్పత్రిని తరలించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ఆయన మండిపడ్డారు. చెస్ట్ ఆస్పత్రి ప్రాంగణంలో మెడికల్, కాలేజీ, వెటర్నరీ ఆస్పత్రిని నిర్మించాలని వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్ణయించారని గుర్తుచేశారు. అయితే వైఎస్ఆర్ మరణాంతరం అది సాధ్యం కాలేదని నాగం తెలిపారు. -
జీహెచ్ఎంసీపై హైకోర్టు ఆగ్రహం
ఆదేశాలు పాటించకపోవడంపై మండిపాటు వారంలోగా అమలు చేయాలని ఆదేశం హైదరాబాద్: జీహెచ్ఎంసీ అధికారులపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను అమ లు చేయకపోవడంపై మండిపడింది. ఫుట్‌పాత్‌లు, రహదారుల ఆక్రమణల తొలగింపుపై తమ ఉత్తర్వులను వారం రోజుల్లో అమలు చేయాలని.. లేని పక్షం లో కోర్టు ధిక్కారం కింద చర్యలు తప్పవని హెచ్చరించింది. అంతేకాక కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేని స్థితిలో ఉన్నారంటూ తీర్పులో ప్రస్తావించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్ గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. హైదరాబాద్, సిద్దంబర్ బజార్, మహబూబ్‌గంజ్ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగింపునకు జీహెచ్ఎంసీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ లక్ష్మీనివాస్ అగర్వాల్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, సోమవారం మరోసారి విచారించింది. కోర్టు ఆదేశించినా ఆక్రమణలు అలానే ఉన్నాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ధర్మాసనం జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై మండిపడింది. వచ్చే వారంలోపు తమ ఉత్తర్వులను అమలు చేయాలని... లేని పక్షంలో కోర్టు ధిక్కారం కింద చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ... విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
రుణమాఫీ చేస్తామంటే మీకేం ఇబ్బంది?
హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్: రైతులకు రుణమాఫీని వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై హైకోర్టు ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ వైఖరిని తీవ్రంగా తప్పుబడుతూ మందలించింది. ‘రైతులకు రుణం మంజూరు చేసేది బ్యాంకులు. ఆ రుణాన్ని ప్రభుత్వం చెల్లిస్తానంటే అందుకు అంగీకరించాలో వద్దో అన్నది బ్యాంకులు నిర్ణయించుకుంటాయి. మధ్యలో మీకొచ్చిన ఇబ్బందేమిటి?’ అంటూ రుణమాఫీని వ్యతిరేకిస్తూ పిల్ దాఖలు చేసిన లోక్‌సేవా సంస్థ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డిని న్యాయస్థానం ప్రశ్నించింది. సమాజ అవసరాలను తీర్చే రైతులు రుణభారంతో దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారికి అండగా నిలిచేందుకు సమాజం ముందుకు రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. రుణ మాఫీలో భాగంగా వ్యవసాయ, డ్వాక్రా రుణాలకు సంబంధించి మార్గదర్శకాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 14న జారీ చేసిన జీవో ఎమ్మెస్ 174ను సవాలు చేస్తూ శ్రీనివాస్‌రెడ్డి గతవారం పిల్ దాఖలు చేయటం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతిసేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. వ్యాజ్యాన్ని ఉపసంహరించుకునేందుకు పిటిషనర్‌కు అనుమతినిస్తూ, పూర్తిస్థాయి వివరాలతో తిరిగి దాఖలు చేసుకోవచ్చునంటూ ఉత్తర్వులిచ్చింది. -
ఆక్రమణదారులకు పరిహారం
‘హీరో’ భూముల వ్యవహారంపై హైకోర్టులో పిల్ సాక్షి, హైదరాబాద్: హీరో మోటో కార్ప్ లిమిటెడ్‌కు చిత్తూరు జిల్లా, సత్యవేడు మండల పరిధిలో కేటాయించిన భూమిలో అత్యధిక శాతం భూమి ఆక్రమణల్లో ఉందంటూ స్థానిక రాజకీయ నేతలు నమ్మిస్తున్నారని, ఆక్రమణదారులకు ప్రభుత్వం ద్వారా పరిహారం చెల్లించేందుకు రంగం సిద్ధం చేయడాన్ని అడ్డుకోవాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని చిత్తూరు జిల్లా, బుచ్చినాయుడు కండ్రిగ మండలానికి చెందిన కె.చంద్రమోహన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించనున్నది. సత్యవేడు మండల పరిధిలో హీరో మోటో కార్ప్‌కు ప్రభుత్వం 650 ఎకరాల భూమిని కేటాయించిన విషయం తెలిసిందే. అందులో 632.96 ఎకరాల భూమి విషయంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించడంతో ఆ భూమిని థర్డ్ పార్టీకి కేటాయించవద్దని ఈ ఏడాది మార్చిలో హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘‘హైకోర్టు ఆదేశాలున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమిని హీరో మోటో కార్ప్‌కు కేటాయించింది. ఆక్రమణదారులకు ప్రభుత్వం సైతం రాజకీయ నేతలు చెప్పిన విధంగా పరిహారం చెల్లించేందుకు సిద్ధమైంది. వారికి ఎకరాకు రూ. 1.6 లక్షల పరిహారం చెల్లించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ కేటాయింపులను అడ్డంపెట్టుకుని స్థానిక అధికారులు, నేతలు ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వాస్తవానికి ఈ భూముల్లో అక్రమణదారులు ఎవరూ లేరు. కొందరు ప్రైవేటు వ్యక్తులు మాత్రమే యాజమాన్యపు హక్కులపై పోరాటం చేస్తున్నారు. ఆక్రమణదారులను చట్ట ప్రకారం ఖాళీ చేయించాలే తప్ప, వారికి పరిహారం చెల్లించడానికి వీల్లేదు. ఈ వ్యాజ్యం హీరో మోటో కార్ప్‌కు వ్యతిరేకం కాదు. ’’ అని పిటిషనర్ పేర్కొన్నారు. తెలుగు తమ్ముళ్లపై మరో పిల్ సామాజిక భద్రతా పెన్షన్ పథకం కింద అర్హులను పరిశీలించేందుకుగాను ఏర్పాటు చేసిన గ్రామ కమిటీల్లో టీడీపీ కార్యకర్తలకు స్థానం కల్పించడం చట్ట విరుద్ధమని, దీనిపై తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన గండి ప్రణీత్‌కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. -
చౌకబారు ప్రచారం కోసం పిల్ వేయొద్దు: సుప్రీం కోర్టు
ప్రజా ప్రయోజిత వ్యాజ్యం (పిల్)పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చౌకబారు ప్రచారం కోసం పిల్ పేరుతో కోర్టులను ఆశ్రయించవద్దని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం పేర్కొంది. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు చెందిన కంపెనీకి హర్యానా ప్రభుత్వం భుమి కేటాయించడంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ ఎమ్.ఎల్.శర్మ అనే న్యాయవాది దాఖలు చేసిన పిల్‌ను తోసిపుచ్చుతూ సుప్రీం కోర్టు పైవిధంగా స్పందించింది. జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ రంజన్ గొగోయ్‌లతో కూడిన ధర్మాసనం పిల్‌ను ఉపసంహరించుకునేందుకు శర్మకు అనుమతించింది. 'మీరు ఏ ఆధారాలతో ఓ వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్నారు? అతని పేరు ప్రతిష్టలను దెబ్బతీసేందుకు పిల్‌ను ఉపయోగించడాన్ని అనుమతించం. రాజకీయ నేతలతో బంధుత్వం ఉన్నంత మాత్రాన వారిపై నిరాధార ఆరోపణలు చేసి కోర్టులను ఆశ్రయించవద్దు. చౌకబారు ప్రచారం కోసం పిల్ దాఖలు చేయొద్దు' అని జస్టిస్ దత్తు అన్నారు. -
రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారు?
సాక్షి లీగల్ కరస్పాండెంట్, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుచేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్నిసవాలు చేస్తూ సుప్రీంకోర్టులో గురువారం ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది పి.వి. కృష్ణయ్య దాఖలుచేసిన ఈ పిటిషన్‌ను ఈనెల 26న విచారించనున్నట్లు చీఫ్ జస్టిస్ పి. సదాశివం, జస్టిస్ రంజనా దేశాయ్, జస్టిస్ రంజన్ గొగైలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ను విభజించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని, తెలంగాణరాష్ర్టం ఏర్పాటుకు తదుపరి చర్యలు తీసుకోకుండా కేంద్రాన్ని నిరోధించాలని పిటిషనర్ కోరారు. ఆంధ్రా ప్రాంతం, హైదరాబాద్ రాష్ర్టంలో ఒకభాగం, తెలంగాణ ప్రాంతాలను కలుపుతూ 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ఏర్పడిందని, ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేయాలన్న అభ్యర్థనను 1969, 1972లలో తిరస్కరించారని ఆ రిట్ పిటిషన్లో పేర్కొన్నారు. ప్రాంతీయ అసమానతలను తొలగించే ఉద్దేశంతో విద్య, ఉద్యోగాలలో స్థానిక రిజర్వేషన్లు కల్పిస్తూ 1973లో రాజ్యాంగాన్ని సవరించారని, ఆర్టికల్ 371డిని చేర్చారని పిటిషన్లో వివరించారు. ఇపుడు రాష్ట్రాన్ని విడగొట్టడం వల్ల రాజ్యాంగంలోని 371డి కింద లభిస్తున్న స్థానిక రిజర్వేషన్ హక్కులు కోల్పోతారని, తర్వాత వచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వృథాగా మారుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు తమ స్వార్థం కోసం ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంచేశారని, తెలంగాణ రాష్ర్టం ప్రకటించడంతో విభజనను వ్యతిరేకిస్తూ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలోని ప్రజలు ఉద్యమిస్తున్నారని, పాలనను స్తంభింపజేస్తున్నారని పిటిషన్లో వివరించారు. హైదరాబాద్‌ను రెండు రాష్ట్రాలకు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా చేస్తారన్న ప్రకటనతో సీమాంధ్ర ప్రజలలో అభద్రతాభావం, అసహనం పెరిగిపోయాయని, రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులు కూడా సమ్మెను ప్రారంభించారని పిటిషన్లో పేర్కొన్నారు. రాజకీయ వత్తిళ్లకు లొంగి ఎస్సార్సీ నియమించకుండానే ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టడానికి చర్యలు తీసుకోవడం చట్టసమ్మతమేనా అని పిటిషనర్ ప్రశ్నించారు. మాయావతి సీఎంగా ఉండగా ఉత్తరప్రదేశ్‌ను విడగొట్టడానికి అసెంబ్లీ చేసిన తీర్మానంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని, అలాగే దేశంలో బోడోలాండ్, గూర్ఖాలాండ్, మరఠ్వాడా వంటి అనేక డిమాండ్లున్నా పట్టించుకోకపోవడాన్ని కేంద్రం ఎలా సమర్థించుకుంటుందని పిటిషనర్ ప్రశ్నించారు. సాక్షి లీగల్ కరస్పాండెంట్, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుచేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్నిసవాలు చేస్తూ సుప్రీంకోర్టులో గురువారం ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది పి.వి. కృష్ణయ్య దాఖలుచేసిన ఈ పిటిషన్‌ను ఈనెల 26న విచారించనున్నట్లు చీఫ్ జస్టిస్ పి. సదాశివం, జస్టిస్ రంజనా దేశాయ్, జస్టిస్ రంజన్ గొగైలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ను విభజించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని, తెలంగాణరాష్ర్టం ఏర్పాటుకు తదుపరి చర్యలు తీసుకోకుండా కేంద్రాన్ని నిరోధించాలని పిటిషనర్ కోరారు. ఆంధ్రా ప్రాంతం, హైదరాబాద్ రాష్ర్టంలో ఒకభాగం, తెలంగాణ ప్రాంతాలను కలుపుతూ 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ఏర్పడిందని, ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేయాలన్న అభ్యర్థనను 1969, 1972లలో తిరస్కరించారని ఆ రిట్ పిటిషన్లో పేర్కొన్నారు. ప్రాంతీయ అసమానతలను తొలగించే ఉద్దేశంతో విద్య, ఉద్యోగాలలో స్థానిక రిజర్వేషన్లు కల్పిస్తూ 1973లో రాజ్యాంగాన్ని సవరించారని, ఆర్టికల్ 371డిని చేర్చారని పిటిషన్లో వివరించారు. ఇపుడు రాష్ట్రాన్ని విడగొట్టడం వల్ల రాజ్యాంగంలోని 371డి కింద లభిస్తున్న స్థానిక రిజర్వేషన్ హక్కులు కోల్పోతారని, తర్వాత వచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వృథాగా మారుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు తమ స్వార్థం కోసం ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంచేశారని, తెలంగాణ రాష్ర్టం ప్రకటించడంతో విభజనను వ్యతిరేకిస్తూ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలోని ప్రజలు ఉద్యమిస్తున్నారని, పాలనను స్తంభింపజేస్తున్నారని పిటిషన్లో వివరించారు. హైదరాబాద్‌ను రెండు రాష్ట్రాలకు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా చేస్తారన్న ప్రకటనతో సీమాంధ్ర ప్రజలలో అభద్రతాభావం, అసహనం పెరిగిపోయాయని, రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులు కూడా సమ్మెను ప్రారంభించారని పిటిషన్లో పేర్కొన్నారు. రాజకీయ వత్తిళ్లకు లొంగి ఎస్సార్సీ నియమించకుండానే ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టడానికి చర్యలు తీసుకోవడం చట్టసమ్మతమేనా అని పిటిషనర్ ప్రశ్నించారు. మాయావతి సీఎంగా ఉండగా ఉత్తరప్రదేశ్‌ను విడగొట్టడానికి అసెంబ్లీ చేసిన తీర్మానంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని, అలాగే దేశంలో బోడోలాండ్, గూర్ఖాలాండ్, మరఠ్వాడా వంటి అనేక డిమాండ్లున్నా పట్టించుకోకపోవడాన్ని కేంద్రం ఎలా సమర్థించుకుంటుందని పిటిషనర్ ప్రశ్నించారు.