
పౌరసత్వం 'పిల్'ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులకు ఇండియా పౌరసత్వం కల్పించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే అర్హత(లోకస్ స్టాండీ) లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. విదేశీ పౌరసత్వం కలిగిన ప్రవాస భారతీయులకు ఇండియా సిటిజన్ షిప్ ఇవ్వాలని కోరుతూ సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వెంకట్ నారాయణ్ ఈ పిల్ దాఖలు చేశారు.
అయితే పౌరసత్వం లేనికారణంగా ఇబ్బందులు పడుతున్న ఎన్నారైలు తమను నేరుగా ఆశ్రయించవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ ఎల్ దత్తు, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన బెంచ్ పేర్కొంది. పిల్ వేయాల్సిన విధానం ఇది కాదంటూ పిటిషనర్ కు చురక అంటించింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు స్తోమత లేని పేదలు కోసం ప్రజాప్రయోజన వ్యాజ్యం ఉందని గుర్తు చేసింది.