
43 శాతం ఫిట్‌మెంట్ సరికాదు
హైకోర్టులో వ్యాజ్యం దాఖలు
హైదరాబాద్: వేతన సవరణ కమిషన్ (పీఆర్‌సీ) చేసిన సిఫారసులకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్ మంజూరు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ ఉత్తర్వులకు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేయాలంటూ వరంగల్ జిల్లాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘ఫోరం ఫర్ బెటర్ లివింగ్ ’ చైర్‌పర్సన్ డి.పద్మజ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి ప్రదీప్‌కుమార్ అగర్వాల్ అధ్యక్షతన ప్రభుత్వం పదవ పీఆర్‌సీ ఏర్పాటు చేసిందని, ఉద్యోగులతో చర్చల తరువాత 29 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫారసు చేసిందని పిటిషనర్ తెలిపారు. అయితే ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ఉద్యోగులకు ఏకంగా 43 శాతం మేర ఫిట్‌మెంట్ ప్రకటించిందన్నారు.
ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఇచ్చేంత వరకు ఆగకుండా ప్రభుత్వం అత్యుత్సాహంతో ఆగమేఘాలపై 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించిందని పద్మజ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే నగదురహిత వైద్య సదపాయం, ఎల్‌టీసీ, ఇళ్ల స్థలాలు, బీమా, నామమాత్రపు వడ్డీకి రుణాలు ఇలా అనేక ప్రయోజనాలు వారికి లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఇదంతా సామాన్య ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నుల నుంచి చెల్లిస్తున్నదేనని వివరించారు. ఉద్యోగుల సమస్యలను చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇదే సమయంలో సామాన్య ప్రజల కష్టాలను, నష్టాలను కూడా పట్టించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదేనన్నారు. వ్యవసాయం, విద్యుత్, విద్య తదితరాలను పట్టించుకోకుండా ఏకంగా 43 శాతం ఫిట్‌మెంట్‌ను ఉద్యోగులకివ్వడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు.