సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులను కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల (కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ) పరిధిలోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ చట్టవిరుద్ధమని హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. తెలంగాణ ప్రజల ప్రాథమిక హక్కులను, సమాఖ్య స్ఫూర్తిని ఉల్లంఘిస్తూ.. 2021 జూలై 15న జారీ చేసిన గెజిట్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టీడీఎఫ్) చీఫ్ అడ్వైజర్ డి. పాండురంగారెడ్డితో పాటు ఇద్దరు పిల్ దాఖలు చేశారు.
ఇందులో కేంద్ర జల శక్తి కార్యదర్శి, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి, గోదావరి రివర్ మేనేజిమెంట్ బోర్డు సభ్య కార్యదర్శి, కేంద్ర జలవనరుల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం గురువారం విచారణ జరిపింది.
నంబర్ కేటాయించండి...
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య జల వివాదంపై తాము పిల్ దాఖలు చేయలేదని, పిల్‌కు నంబర్ కేటాయించేలా హైకోర్టు రిజిస్ట్రీ ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని నీటిపారుదల ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం చేసేలా నోటిఫికేషన్ ఉందని వెల్లడించారు. కృష్ణా, గోదావరి బేసిన్‌లోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టులపై నియంత్రణ, నిర్వహణ చేసేలా కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.
ప్రాజెక్టులపై రాష్ట్రాలకు ఉన్న అధికారాలను కేంద్రం లాక్కోవడమేనని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను తన పరిధిలోకి తీసుకుంటోందని చెప్పారు. ‘తెలంగాణకు జలవనరుల వాటాను పెంచకుండా కేంద్రం దగా చేస్తోంది. నోటిఫికేషన్ ప్రకారం ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి వెళతాయి. ఇది తెలంగాణ పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే. రాజ్యాంగంలోని సమాఖ్య పాలన స్ఫూర్తికి, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం.
కేంద్ర నోటిఫికేషన్ ప్రకారం ఏర్పాటయ్యే నదీ జలాల యాజమాన్య బోర్డులకు తెలుగు రాష్ట్రాలు.. సిబ్బంది, అధికారులు, ఫైళ్లు, వాహనాలను అందించాలి. అంతేకాకుండా రివర్ బోర్డులకు తెలంగాణ, ఏపీ రూ.200 కోట్లు చొప్పున రూ.400 కోట్లు చెల్లించాలి. ఈ మొత్తాన్ని ఏ ప్రాతిపదికన నిర్ణయించిందీ కేంద్రం చెప్పలేదు. నిధులు ఇచ్చేందుకు, నోటిఫికేషన్‌ను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖంగా లేవు. హైకోర్టు జోక్యం చేసుకుని.. కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి సమాఖ్య పాలన స్ఫూర్తిని కాపాడాలి’అని పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు.
విచారణార్హత ఉంది..
పిల్‌లోని అంశాలు అంతర్రాష్ట్ర జల వివాద అంశం కాదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వెలువరించిన నోటిఫికేషన్‌ను సవాలు చేసిన పిల్‌కు విచారణార్హత ఉందన్నారు. పిల్ దవిచారణార్హతపై పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించే నిమిత్తం విచారణ సెప్టెంబర్ 20వ తేదీకి వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment