హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్: రైతులకు రుణమాఫీని వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై హైకోర్టు ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ వైఖరిని తీవ్రంగా తప్పుబడుతూ మందలించింది. ‘రైతులకు రుణం మంజూరు చేసేది బ్యాంకులు. ఆ రుణాన్ని ప్రభుత్వం చెల్లిస్తానంటే అందుకు అంగీకరించాలో వద్దో అన్నది బ్యాంకులు నిర్ణయించుకుంటాయి. మధ్యలో మీకొచ్చిన ఇబ్బందేమిటి?’ అంటూ రుణమాఫీని వ్యతిరేకిస్తూ పిల్ దాఖలు చేసిన లోక్‌సేవా సంస్థ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డిని న్యాయస్థానం ప్రశ్నించింది. సమాజ అవసరాలను తీర్చే రైతులు రుణభారంతో దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారికి అండగా నిలిచేందుకు సమాజం ముందుకు రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
రుణ మాఫీలో భాగంగా వ్యవసాయ, డ్వాక్రా రుణాలకు సంబంధించి మార్గదర్శకాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 14న జారీ చేసిన జీవో ఎమ్మెస్ 174ను సవాలు చేస్తూ శ్రీనివాస్‌రెడ్డి గతవారం పిల్ దాఖలు చేయటం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతిసేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. వ్యాజ్యాన్ని ఉపసంహరించుకునేందుకు పిటిషనర్‌కు అనుమతినిస్తూ, పూర్తిస్థాయి వివరాలతో తిరిగి దాఖలు చేసుకోవచ్చునంటూ ఉత్తర్వులిచ్చింది.
రుణమాఫీ చేస్తామంటే మీకేం ఇబ్బంది?
Published Tue, Oct 21 2014 2:23 AM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM
Advertisement
Advertisement