
కరువు రాష్ట్రాల్లో ‘సంక్షేమం’పై నివేదికివ్వండి
కేంద్ర, రాష్ట్రాలకు ఆదేశించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: కరువు అలముకున్న రాష్ట్రాల్లో ఏమేం సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారో తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ, జాతీయ ఆహార భద్రత, మధ్యాహ్న భోజనం వంటి సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరు, వర్షపాతాల నమోదుపై నివేదిక ఇవ్వాలని జస్టిస్ లోకూర్, ఆర్‌కే అగర్వాల్‌తో కూడిన బెంచ్ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు సోమవారం సూచించింది. 22వ తేదీలోపు నివేదికలివ్వాలంది. కరువు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, యూపీ, ఎంపీ, కర్ణాటక, ఒడిశా, జార్ఖండ్, బిహార్, హరియాణా, గుజరాత్, మహారాష్ర్ట, ఛత్తీస్‌గఢ్‌ల్లో బాధితులను ఆదుకునే దిశగా అధికారులు చర్యలు తీసుకోలేదంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై కోర్టు స్పందించింది. ఎన్నికల సర్వేలు నిర్వహించే యోగేంద్ర యాదవ్ తదితరుల ఆధ్వర్యంలోని ‘స్వరాజ్ అభియాన్’ స్వచ్ఛంద సంస్థ ఈ పిల్ వేసింది. వారి తరుఫున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ... కరువు ప్రాంతాల్లో బాధితులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చూపాయన్నారు. ఎంతో మంది మరణించారని, ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 24 ఉల్లంఘనే అవుతుందన్నారు. బిహార్, మధ్యప్రదేశ్ మినహా మరే కరువు బాధిత రాష్ట్రాలూ ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టలేదన్నారు.
ఇతర రాష్ట్రాలు ఏపీఎల్-బీపీఎల్‌ల మధ్య వ్యత్యాసం ఆధారంగా ప్రజా పంపిణీ వ్యవస్థను నడిపిస్తున్నాయని, ఈ విధానం వల్ల ఉపయోగం లేదని పరిశోధనల్లో తేలిందన్నారు. ‘ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ’ను అమలు చేయడం వల్ల బిహార్, మధ్యప్రదేశ్‌ల్లో సత్ఫలితాలు వచ్చాయని ప్రశాంత్‌భూషణ్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తులు... బాధితులు, బాధిత ప్రాంతాల్లో కనీసం అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, ఉపాధి అవకాశాలపై ఏమేం చర్యలు తీసుకున్నారో తెలపాలని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్‌ను అడిగారు. రంజిత్‌కుమార్ వివరణనిస్తూ... రాష్ట్ర విపత్తుల సహాయ నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్), జాతీయ విపత్తుల సహాయ నిధిల నుంచి ఆర్థిక సాయం అందించామన్నారు. కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఎంపీ, మహారాష్ట్రలకు వరుసగా రూ.1,500 కోట్లు, రూ.1,276 కోట్లు, రూ.2,032 కోట్లు, రూ.3,044 కోట్లు మంజూరు చేశామన్నారు. 2015-20 కాలానికి మొత్తం రూ.61,291 కోట్లు సహాయ నిధిని ఏర్పాటు చేశామన్నారు.