ఆక్రమణదారులకు పరిహారం | Hero MotoCorp lured by free land, says Karnataka CM | Sakshi
Sakshi News home page

ఆక్రమణదారులకు పరిహారం

Published Sun, Oct 12 2014 1:13 AM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM

ఆక్రమణదారులకు పరిహారం - Sakshi

ఆక్రమణదారులకు పరిహారం

‘హీరో’ భూముల వ్యవహారంపై హైకోర్టులో పిల్
సాక్షి, హైదరాబాద్: హీరో మోటో కార్ప్ లిమిటెడ్‌కు చిత్తూరు జిల్లా, సత్యవేడు మండల పరిధిలో కేటాయించిన భూమిలో అత్యధిక శాతం భూమి ఆక్రమణల్లో ఉందంటూ స్థానిక రాజకీయ నేతలు నమ్మిస్తున్నారని, ఆక్రమణదారులకు ప్రభుత్వం ద్వారా పరిహారం చెల్లించేందుకు రంగం సిద్ధం చేయడాన్ని అడ్డుకోవాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని చిత్తూరు జిల్లా, బుచ్చినాయుడు కండ్రిగ మండలానికి చెందిన కె.చంద్రమోహన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించనున్నది. సత్యవేడు మండల పరిధిలో హీరో మోటో కార్ప్‌కు ప్రభుత్వం 650 ఎకరాల భూమిని కేటాయించిన విషయం తెలిసిందే.

అందులో 632.96 ఎకరాల భూమి విషయంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించడంతో ఆ భూమిని థర్డ్ పార్టీకి కేటాయించవద్దని ఈ ఏడాది మార్చిలో హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘‘హైకోర్టు ఆదేశాలున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమిని హీరో మోటో కార్ప్‌కు కేటాయించింది. ఆక్రమణదారులకు ప్రభుత్వం సైతం రాజకీయ నేతలు చెప్పిన విధంగా పరిహారం చెల్లించేందుకు సిద్ధమైంది. వారికి ఎకరాకు రూ. 1.6 లక్షల పరిహారం చెల్లించాలని ప్రాథమికంగా నిర్ణయించింది.

ఈ కేటాయింపులను అడ్డంపెట్టుకుని స్థానిక అధికారులు, నేతలు ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వాస్తవానికి ఈ భూముల్లో అక్రమణదారులు ఎవరూ లేరు. కొందరు ప్రైవేటు వ్యక్తులు మాత్రమే యాజమాన్యపు హక్కులపై పోరాటం చేస్తున్నారు. ఆక్రమణదారులను చట్ట ప్రకారం ఖాళీ చేయించాలే తప్ప, వారికి పరిహారం చెల్లించడానికి వీల్లేదు. ఈ వ్యాజ్యం హీరో మోటో కార్ప్‌కు వ్యతిరేకం కాదు. ’’ అని పిటిషనర్  పేర్కొన్నారు.
 
తెలుగు తమ్ముళ్లపై మరో పిల్
సామాజిక భద్రతా పెన్షన్ పథకం కింద అర్హులను పరిశీలించేందుకుగాను ఏర్పాటు చేసిన గ్రామ కమిటీల్లో టీడీపీ కార్యకర్తలకు స్థానం కల్పించడం చట్ట విరుద్ధమని, దీనిపై తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన గండి ప్రణీత్‌కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement