సాక్షి, న్యూఢిల్లీ : జాతి పిత మహాత్మా గాంధీజీ హత్యకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం కోర్టు నేడు(శుక్రవారం) విచారణ చేపట్టనుంది. బాపూజీ హత్యపై పలు అనుమానాలు ఉన్నాయంటూ అభినవ్ భారత్ ట్రస్ట్ సభ్యుడు పంకజ్ ఫడ్నవిస్ ఈ పిల్ దాఖలు చేశారు. జనవరి 30, 1948న జరిగిన అంశాలను ప్రస్తావిస్తూ.. నిజాలను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందంటూ ఆయన న్యాయస్థానాన్ని కోరారు.
గాంధీని నాథురం గాడ్సే ఒక్కడే హత్య చేయలేదని.. అతనితోపాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడని పంకజ్ చెబుతున్నారు. నిజానికి గాడ్సే గాంధీని కాల్చిన సమయంలో మూడు బుల్లెట్లే తగిలాయంటూ చెప్పారు. కానీ, నాలుగో బుల్లెట్ మూలంగానే గాంధీ మరణించారని అప్పట్లో అంతర్జాతీయ మీడియాలు ప్రముఖంగా ప్రచారం చేశాయి. అయితే ఆ అంశాన్ని అప్పటి పోలీసులు పక్కన పెట్టారని పంకజ్ వాదిస్తున్నారు.
గాంధీజీ హత్యకు గాడ్సే ఉపయోగించింది 'బెరెట్టా' తుపాకీ. గ్వాలియర్ కు చెందిన డాక్టర్ దత్తాత్రేయ పర్చూరే వాటిని గాడ్సేకు సమకూర్చాడన్న ఆరోపణలు ఉన్నాయి. రిజిస్టర్డ్ నంబర్ 068240, 719791లతో అవి ఆయన దగ్గర ఉన్నాయి. కానీ అయితే రెండో నంబర్‌కు చెందిన రిజిస్ట్రేషన్‌తో గ్వాలియర్ కే చెందిన ఉదయ్ చాంద్ అనే వ్యక్తి వద్ద కూడా ఓ తుపాకీ ఉందని పోలీసు రికార్డులు చెబుతున్నాయి.
దీనికి సంబంధించిన 1948 నాటి పోలీస్ డాక్యుమెంట్‌ను ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా బహిర్గతం కూడా చేసింది. ఇక గాడ్సే వాడిన తుపాకీ నుంచి నాలుగో బుల్లెట్ రాలేదన్న విషయాన్ని బలపరుస్తూ ఆ సమయంలో గాంధీ పక్కనే సహయంగా ఉన్న మనుబెన్ తన డైరీలో రాసుకున్నారు.
ఈ నేపథ్యంలో గాంధీని గాడ్సే ఒక్కడే చంపాడా? లేక ఇద్దరు చంపారా? చంపితే ఆ వ్యక్తి ఎవరు? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందని పంకజ్ కోరుతున్నాడు. మరి సుప్రీంకోర్టు ధర్మాసనం పిల్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో మరి కొన్ని గంట్లోనే తెలియనుంది.
Comments
Please login to add a commentAdd a comment