మాకు టీచర్లు కావాలి! | shortage of teachers | Sakshi
Sakshi News home page

మాకు టీచర్లు కావాలి!

Published Tue, Aug 18 2015 12:22 AM | Last Updated on Sun, Sep 3 2017 7:37 AM

మాకు టీచర్లు కావాలి!

మాకు టీచర్లు కావాలి!

ఉపాధ్యాయుల కొరతపై హైకోర్టు సీజేకు 1,600 మంది విద్యార్థుల లేఖలు
వాటిని సుమోటోగా విచారణకు స్వీకరించిన న్యాయస్థానం
డుమ్మా కొట్టే టీచర్లను తక్షణమే సస్పెండ్ చేయండి
అలసత్వం ప్రదర్శించే అధికారులపైనా చర్యలు తీసుకోండి
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం విచారణ 20కి వాయిదా
 

హైదరాబాద్: బడికి రాని టీచర్లపై, బాధ్యత తప్పిన సర్కారుపై... బడి పిల్లలు చేపట్టిన పోరాటం హైకోర్టును కదిలించింది. చదువు కోసం ఆ చిన్నారుల ఆరాటం న్యాయమూర్తులను చలింపజేసింది. ఆ పిల్లల లేఖలే రాష్ట్ర ప్రభుత్వంపై, అలసత్వపు అధికారులపై అస్త్రాలుగా మారాయి. బడికి డుమ్మా కొట్టే టీచర్లను తక్షణమే సస్పెండ్ చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చేలా చేశాయి. దీనిపై ప్రభుత్వాన్ని వివరణ కోరేలా చేశాయి.తమ పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు లేరని, దీంతో తాము సరైన విద్యను పొందలేకపోతున్నామంటూ మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన విద్యార్థులు రాసిన లేఖలను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యం గా స్వీకరించింది. నియామకాలు పొంది పాఠశాలలకు వెళ్లని ఉపాధ్యాయులను తక్షణమే సస్పెండ్ చేయాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అటువంటి వారిని ఏమాత్రం ఉపేక్షించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

ఇదే సమయంలో విద్యార్థులకు సరపడా ఉపాధ్యాయులను నియమించడంలో అలసత్వం ప్రదర్శించే విద్యాశాఖ అధికారులపైనా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. విద్యార్థుల భవిష్యత్తే తమకు ముఖ్యమని, ఈ విషయంలో మరో మాటకు తావులేదని తెలిపింది. విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులను నియమించే విషయంలో ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలియచేయాలని... ఈ సమస్యను అధిగమించేందుకు ఏ చర్యలు తీసుకోబోతున్నారో పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో తమ పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు లేరని, దీంతో తాము సరైన విద్యను పొందలేకపోతున్నామని పేర్కొంటూ మహబూబ్‌నగర్ జిల్లా బొయ్యలగూడెం, మాచర్ల, కేశవరం, చింతలకుంట, మిట్టదొడ్డి, యల్లందొడ్డి, చాగదొన, అరిగిగడ్డ గ్రామాలకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ నెల 6వ తేదీన ఎంవీ ఫౌండేషన్ సహకారంతో హైకోర్టు సీజే, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ వేదిక, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ వేదికలకు లేఖలు రాశారు. తమకు వచ్చిన దాదాపు 1,600కు పైగా లేఖలను పరిశీలించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి... వీటిని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా మలచాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు.

ఈ మేరకు రిజిస్ట్రీ ఆ లేఖలను పిల్‌గా మలిచి విచారణ నిమిత్తం ధర్మాసనం ముందుంచింది. దీనిపై సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తి వివరాలను ధర్మాసనం ప్రస్తావించింది. కేశవరం గ్రామంలో 5, 6 తరగతులకు చెందిన 180 మంది విద్యార్థులకు ఒకే టీచర్ ఉన్నారని, చింతలకుంటలో 5వ తరగతికి చెందిన 166 మంది విద్యార్థులకు టీచరే లేరని, మిట్టదొడ్డిలో 8వ తరగతికి చెందిన 120 మంది విద్యార్థులకు టీచర్ లేరని... ఇలా వివరాలను చదివి వినిపించింది. దీనిపై ఏమంటారని రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) రామచంద్రరావును ప్రశ్నించింది. ఇది చాలా కీలక అంశమని, టీచర్ల కొరతను సీరియస్‌గా పరిగణిస్తున్నామని రామచంద్రరావు తెలిపా రు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ...‘ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ఏమిటి? ఒకరు కాదు.. ఇద్దరు కాదు వందల సంఖ్యలో విద్యార్థులు మాకు లేఖలు రాశారు. మేం చదువుకుంటాం.. ఉపాధ్యాయులను నియమించండి అని అడుగుతున్నారు. దేశ భావితరాలకు ఈ మాత్రం కూడా చేయలేమంటే ఎలా..?’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఉపాధ్యాయులుగా నియామకాలు పొంది పాఠశాలలకు వెళ్లని వారిని సస్పెండ్ చేయాలని.. అలా చేస్తే మిగతా వారు దారికి వస్తారని పేర్కొంది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.
 
మిగిలింది శూన్యం..
గట్టు (మహబూబ్‌నగర్): అక్షరాస్యతలో అట్టడుగున ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం మరింత నిర్లక్ష్యం చూపుతోంది. ఫలితంగా ఇక్కడి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సరైన విద్య అండం లేదు. ఈ పరిస్థితిని వివరిస్తూ గట్టు మండలంలోని చింతలకుంట ప్రాథమిక పాఠశాల (పీఎస్), జెడ్పీ స్కూళ్ల విద్యార్థులు 200 మంది, సిద్దోనిపల్లి తండా పీఎస్ నుంచి 100, బలిగెర పీఎస్ 100, చమన్‌ఖాన్‌దొడ్డి పీఎస్ 100, హిందువాసి పీఎస్ 100, మిత్తదొడ్డి, దళితవాడ పీఎస్‌ల నుంచి 150, గట్టు బాలికల పీఎస్ 50, గొర్లఖాన్‌దొడ్డి పీఎస్ 100, ఆలూరు పీఎస్/జెడ్పీ స్కూళ్ల నుంచి 150, తుమ్మలచెర్వు యూపీఎస్ 100, చాగదోన పీఎస్ 100, బోయలగూడె పీఎస్ నుంచి 150, కొత్తపల్లి పీఎస్ నుంచి 50 మంది, మరికొన్ని స్కూళ్ల నుంచి ఇంకొందరు విద్యార్థులు హైకోర్టుకు లేఖలు రాశారు. అసలు చింతలకుంట పీఎస్‌లో 330 మంది విద్యార్థులుండగా.. ముగ్గురు టీచర్లు ఉండేవారు. ఇటీవలి బదిలీల్లో ఇద్దరు వెళ్లిపోవడంతో... ఒక్కరే మిగిలారు. చింతలకుంట హైస్కూల్లో 166 మంది విద్యార్థులకు బదిలీల అనంతరం ఒక్కరే మిగిలారు. ఈ స్కూల్‌లో మూడేళ్లుగా పదో తరగతి విద్యార్థులు 100శాతం ఫలితాలు సాధిస్తుండడం గమనార్హం. ఇక గట్టు మండలంలోని బల్గెర దళితవాడ, చమన్‌ఖాన్‌దొడ్డి, ఇందువాసి, కొత్తపల్లి, మిట్టదొడ్డి ప్రాథమిక పాఠశాల, దళితవాడ పాఠశాల, గట్టు బాలికల పాఠశాల, సిద్దొనిపల్లెతండా ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేకుండా పోయారు. మరో 21 పాఠశాలలు ఒకే టీచర్‌తో కొనసాగుతున్నాయి. ఈ మండలంలో 199 టీచర్ పోస్టులు ఉండగా 76 మంది టీచర్లే ఉన్నారు. 123 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
 
‘ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో మీరు మీ పిల్లలను గానీ, మీ బంధువుల పిల్లలను గానీ చేర్పించేందుకు సిద్ధంగా ఉన్నారా..?’..
- అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావుకు హైకోర్టు ప్రశ్న..  ‘లేదు..’       - రామచంద్రరావు సమాధానం
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement