నిరుద్యోగులకు తప్పుడు హామీలు ఇచ్చి మోసగించినందుకు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో పై హైకోర్టులో ప్రజాప్రయోజనాల వాజ్యం(పిల్)ను దాఖలు చేయనున్నట్లు రాష్ట్ర నిరుద్యోగుల ఐక్యవేదిక అధ్యక్షుడు లగుడు గోవిందరావు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 1.42 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆదివారం గుంటూరులో గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి నిరుద్యోగులు ఓటు వేశారని.. తెలిపారు. పంచాయితీ రాజ్ శాఖలో ఉన్న 3,400 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు.. మిగులు ఉద్యోగులతో వాటిని బర్తీ చేస్తామని చెబుతున్నారని మండి పడ్డారు.