సమర్థులకే ఓటు వేయండి
ప్రతి ఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొని దేశ భవిష్యత్తును నిర్ణయించాలి
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా
సాక్షి, హైదరాబాద్: ఓటర్లు పాలకుల సామర్థ్యాన్ని అంచనా వేసి ఓటు వేయాలని, ప్రతి పౌరుడూ తప్పనిసరిగా ఓటింగ్‌లో పాల్గొనాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జస్టిస్ గుప్తా ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం దేశంపై ప్రతి ఒక్కరికీ హక్కు ఉందని... పోలింగ్‌లో పాల్గొని దేశ భవిష్యత్తును నిర్ణయించే బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. రాజ్యాంగం నిర్దేశించిన మేరకు పోలింగ్ ప్రక్రియ నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుతంగా జరగాలని... అందుకు ప్రతి పౌరుడూ కృషి చేయాలని సూచించారు. ప్రతి సార్వత్రిక ఎన్నిక ఒక కొత్త ప్రభుత్వానికి జన్మనిస్తోందని, ఎన్నికల సంఘం ఇందుకు ప్రసూతి కేంద్రంగా పనిచేస్తోందని కొనియాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ఆయన బహుమతులు ప్రదానం చేశారు. అలాగే కొత్త ఓటరు గుర్తింపు కార్డులను కొందరికి అందజేశారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, కంటోన్మెంట్ బోర్డు సీఈవో సుజాతాగుప్తా తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఎవరేమన్నారు...
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీఎస్ మహంతి: రాష్ట్రవ్యాప్తంగా 4,800 ఈ-సేవా కేంద్రాల ద్వారా ఓటరు గుర్తింపు కార్డులు జారీచేస్తున్నాం. ఓటర్లందరికీ గుర్తింపు కార్డులు అందేలా చర్యలు తీసుకుంటాం. ఓటరుగా నమోదైన వారు వారి పేర్లను జాబితాలో చెక్ చేసుకోవాలి. ఈ నెలాఖరు నాటికి ఓటర్ల జాబితాను ముద్రిస్తాం.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి: 18 ఏళ్లు నిండిన వారు ఎప్పుడైనా ఓటరుగా రిజిస్ట్రర్ చేసుకోవచ్చు, ఇందుకు ఆఖరు తేదీ ఉండదు.
ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్: ఇటీవల కాలంలో రికార్డు స్థాయిలో 76 లక్షల మంది కొత్తగా ఓటర్లుగా రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో యువత ఎక్కువగా ఉన్నారు. రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 6.24 కోట్లకు చేరింది. గత ఏడాది 54 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. ఈ ఏడాది 100 శాతం పోలింగ్ జరిగేలా అందరూ కృషి చేయాలి.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి నవీన్ మిట్టల్: జంట నగరాల పరిధిలో ఐదు లక్షల మంది కొత్తగా ఓటర్లుగా రిజిస్టర్ చేసుకున్నారు. ప్రతి ఓటరు ఓటు వేసేలా చైతన్యపరచాల్సిన అవసరం ఉంది.