వేర్వేరు హైకోర్టుల ఏర్పాటును పరిశీలించండి...
ఉమ్మడి హైకోర్టు సీజేకు కేంద్ర మంత్రి సదానందగౌడ లేఖ
ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది
గచ్చిబౌలిలో భవనాన్ని కూడా గుర్తించింది
లేఖలో సీజే దృష్టికి తీసుకొచ్చిన కేంద్ర న్యాయశాఖ మంత్రి
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలకూ రెండు వేర్వేరు హైకోర్టులు ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తాకు కేంద్ర న్యాయశాఖ మంత్రి డి.వి.సదానందగౌడ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన రెండు రోజుల క్రితం జస్టిస్ సేన్‌గుప్తాకు ఓ లేఖ రాశారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా గత ఏడాది జూన్ 2న ఏర్పడిన విషయం మీకు తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సచివాలయం, శాసనసభ, మండలి భవనాలను రెండు రాష్ట్రాలకూ విభజించారు. ఇవి రెండూ అన్ని సౌకర్యాలతో ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో కొనసాగుతున్నాయి. అయితే రెండు రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టుల ఏర్పాటు మాత్రం జరగలేదు. తెలంగాణకు చెందిన న్యాయవాదులు, ప్రజా ప్రతినిధులు తెలంగాణ రాష్ట్రానికి వేరే హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 18న రెండు రాష్ట్రాలకూ రెండు వేర్వేరు హైకోర్టుల ఏర్పాటు చేయాలని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. హైకోర్టుకు గచ్చిబౌలి ప్రాంతంలో 4.9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణమున్న ఓ బహుళ అంతస్తుల భవనాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించి, అందులో అన్ని సౌకర్యాల కల్పనకు ముందుకొచ్చింది. ఇదే సమయంలో హైదరాబాద్‌లో రెండు వేర్వేరు హైకోర్టుల ఏర్పాటుకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రత్యేక హైకోర్టు డిమాండ్‌తో న్యాయవాదులు గత కొంత కాలంగా కోర్టు విధులను బహిష్కరించారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు విషయంలో తగిన చర్యలు తీసుకుంటామన్న హామీతో వారు ఆందోళన విరమించారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా హైదరాబాద్‌లో రెండు రాష్ట్రాలకూ రెండు వేర్వేరు హైకోర్టులను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించగలరు’ అని సదానందగౌడ తన లేఖలో పేర్కొన్నారు.