1,506 వ్యవసాయ, ఉద్యాన పోస్టులకు గ్రీన్‌సిగ్నల్
► 4 వారాల తర్వాత భర్తీకి హైకోర్టు అనుమతి
► త్వరలో ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ, ఉద్యానశాఖలో 1,506 మండల స్థాయి అధికారుల పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులతో పోస్టుల భర్తీకి హైకోర్టు అనుమతించింది. పోస్టులను నాలుగు వారాల తర్వాత భర్తీ చేయాలని తీర్పు చెప్పింది. దీంతో ఈ వ్యవహారంలో తదుపరి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు శుక్రవారం కేవియట్ దాఖలు చేసినట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి వెల్లడించారు.
హైకోర్టు తీర్పు ప్రకారం నాలుగు వారాల తర్వాత వ్యవసాయ పోస్టులను భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు. టీఎస్‌పీఎస్సీ ఫలితాలు వెల్లడించాక అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే ప్రక్రియ మొదలవుతుందన్నారు. పోస్టుల భర్తీలో తమకు వెయిటేజీ కల్పించడంతోపాటు విద్యార్హతల్లోనూ సడలింపు ఇవ్వాలన్న విజ్ఞప్తిని టీఎస్‌పీఎస్సీ తోసిపుచ్చడాన్ని సవాల్‌చేస్తూ కొందరు కాంట్రాక్టు ఏఈవోలు గతేడాది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు...పరీక్ష నిర్వహణకు అనుమతించి తుది ఫలితాల వెల్లడిపై మాత్రం స్టే విధించింది.
6,250 ఎకరాలకు ఒక ఏఈవో...
రైతులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా ప్రతి 6,250 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో)ని ప్రభుత్వం నియమించనుంది. వ్యవసాయశాఖ కోసం 1,311 ఏఈవో, 120 ఏవో పోస్టులను, ఉద్యానశాఖ కోసం 75 ఉద్యానశాఖ అధికారి (హెచ్‌వో) పోస్టులను భర్తీ చేయనుంది. వారికి కొన్ని రోజులపాటు శిక్షణ ఇచ్చి రాబోయే ఖరీఫ్ నాటికి 1,506 మందిని అందుబాటులోకి తేవడమే లక్ష్యమని పార్థసారథి తెలిపారు. 6,250 ఎకరాలకు ఒక ఏఈవో అంటే దాదాపు ఒకట్రెండు గ్రామాలకు ఒక ఏఈవో ఉండే అవకాశం ఉంది.
సగానికిపైగా మహిళలే...
మండలాలు, గ్రామాల్లో పనిచేయబోయే ఏవో, ఏఈవో, హెచ్‌వోలలో సగానికిపైగా మహిళలే ఉండే అవకాశాలున్నాయి. వ్యవసాయ కోర్సులు చదివే వారిలో 60 శాతం నుంచి 70 శాతం వరకు మహిళలే ఉంటున్నారు. కాబట్టి 1,506 మందిలో సగానికిపైగా మహిళలే ఉంటారని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు.