టీఎస్‌పీఎస్సీ వర్సెస్ వ్యవసాయ వర్సిటీ
♦ వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల్లోని పోస్టుల భర్తీ అధికారం టీఎస్‌పీఎస్సీకి
♦ అలాగైతే విశ్వవిద్యాలయాల గుర్తింపు రద్దవుతుందని ఐకార్ హెచ్చరిక
♦ దీంతో తామే భర్తీ చేసుకుంటామంటున్న ఉద్యాన, వ్యవసాయ వర్సిటీలు
♦ సీఎస్‌కు ఫిర్యాదు, ముఖ్యమంత్రి వద్దకు పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీపై వివాదం నెలకొంది. పోస్టులను భర్తీ చేసే అధికారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)కి అప్పగించడంపై ఆ రెండు వర్సిటీలు మండిపడుతున్నాయి. నిబంధనల ప్రకారం పోస్టుల భర్తీపై టీఎస్‌పీఎస్సీకి హక్కులేదని స్పష్టం చేస్తున్నాయి. ఆయా పోస్టులను వర్సిటీలే భర్తీ చేసుకుంటాయని ఘంటాపథంగా చెబుతున్నాయి. ఈ వివాదంపై ఆ విశ్వవిద్యాలయాల ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఇటీవల ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. దీనిపై చర్చించిన ఆయన... సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు సమస్యను వివరిస్తానని హామీ ఇచ్చారు. దీంతో పంచాయితీ సీఎం వద్దకు చేరింది. ప్రస్తుతం సీఎం ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న చర్చ జరుగుతోంది.
అలాగైతే ఐకార్ గుర్తింపు రద్దు...
వ్యవసాయ విశ్వవిద్యాలయంలో దాదాపు 100 పోస్టులు, ఉద్యాన వర్సిటీలో 107 పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వానికి వ్యవసాయశాఖ గతేడాది విన్నవించింది. భర్తీకి ఆర్థికశాఖ అనుమతిచ్చింది. అయితే ఆ పోస్టుల భర్తీ బాధ్యతను టీఎస్‌పీఎస్సీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో విశ్వవిద్యాలయ వర్గాలు కంగుతిన్నాయి.
ఈ అంశాన్ని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) దృష్టికి ఆ రెండు విశ్వవిద్యాలయాలు తీసుకొచ్చాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ సహా ఇతర పోస్టులను భర్తీ చేసే అధికారం టీఎస్‌పీఎస్సీకి లేదని ఐకార్ స్పష్టం చేసింది. టీఎస్‌పీఎస్సీ భర్తీ చేస్తే ఐకార్ గుర్తింపు రద్దవుతుందని హెచ్చరించినట్లు తెలిసింది. ఐకార్ గుర్తింపుతోనే వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుంది. అప్పుడే నిధులు, నియామకాల్లో ప్రాధాన్యం ఉంటుంది.
ఐకార్ గుర్తింపు లేకపోతే విద్యార్థులకూ నష్టమే..
ఐకార్ గుర్తింపు లేకపోతే అందులో చదివిన విద్యార్థులకు ఏ రాష్ట్రంలోనూ, దేశంలోనూ సంబంధిత ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వరు. అంతర్జాతీయ సదస్సులకూ ఆహ్వానించరు. ఆయా దేశాల్లోని వర్సిటీల్లో పరిశోధనలకు విద్యార్థులకు అవకాశం కల్పించరు. అలాగే నిధులు నిలిచిపోతాయని అధికారులు చెబుతున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర పోస్టుల భర్తీ అనేది కేవలం రాత పరీక్ష, ఇంటర్వూ్య నిర్వహించి ఉత్తర్వులు ఇవ్వడం కాదనీ, ఐకార్ నిబంధనల ప్రకారం విశ్వవిద్యాలయాలే భర్తీ ప్రక్రియ చేపడతాయని జాతీయ వ్యవసాయ, ఉద్యాన నిపుణుల బృందం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై ముఖ్యమంత్రి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని ఆ విశ్వవిద్యాలయాల అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.