Professor Jayasankar
-
జయశంకర్ కృషిని తెలంగాణ మర్చిపోదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషిని తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ మర్చిపోదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆదివారం జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. తెలంగాణ భావజాల ప్రచారం కోసం జయశంకర్ చేసిన కృషిని భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జయశంకర్‌కు టీఆర్ఎస్ నేతల నివాళి ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన అందించిన సేవలు గుర్తుచేసుకుని టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం తెలంగాణ భవన్లో జయశంకర్ విగ్రహానికి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, వి.ప్రకాశ్, ఇతర నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించా రు. మంత్రుల నివాస ప్రాంగణంలో అబ్కారీ, క్రీడలు, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ వినోద్‌కుమార్, ఇతర మంత్రులు తమ జిల్లాలు, నివాసాల వద్ద జయశంకర్‌కు నివాళులర్పించారు. -
జూన్ 4 నుంచి ‘బడిబాట’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జూన్ 1 నుంచి బడులు ప్రారంభం కానుండటంతో జూన్ 4 నుంచి 12 వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వí హించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం ప్రతి పాఠశాలకు రూ. 1,000 చొప్పున నిధులను ఇచ్చేలా జిల్లాల అధికారులకు పాఠశాల విద్య కమిషనర్ విజయ్ కుమార్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. కొన్ని ప్రధాన లక్ష్యాలతో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు. జూన్ 1 నుంచి 3 వరకు సంసిద్ధతా కార్యక్రమాలు నిర్వహించాలని, కలెక్టర్ల ఆధ్వర్యంలో సమన్వయ సమావేశాలు నిర్వహించి బడిబాట విజయవంతానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రజాప్రతినిధులను, స్వయం సహాయక బృందాల మహిళలను భాగస్వాములను చేసేలా ప్రణాళిక ఉండాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు సమావేశం నిర్వహించి 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న బాలికలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్ల పంపిణీ, పాఠశాలల్లో అమలు చేస్తున్న ఇతర కార్యక్రమాలను వివరించేలా పాఠశాల ప్రొఫైల్ రూపొందించుకొని బడిబాటలో వివరించాలన్నారు. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఇంటింటి ప్రచారం చేయాలని సూచించారు. మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీవో, ఎంఈవో, సహాయక కార్మిక అధికారి, స్వచ్ఛంద సంస్థలు, బాలికా శిశు సంక్షేమ పర్యవేక్షకులు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్లతో టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని, బాలకార్మికులు లేకుండా ఈ కమిటీలు చూడాలని స్పష్టం చేశారు. విద్యార్థుల హక్కులకు సంబంధించిన సమస్యలను తెలియజేసేందుకు ప్రతి పాఠశాలలో, నోటీసు బోర్డులో టోల్ ఫ్రీ నంబర్ 18004253525 పొందుపరచాలని వివరించారు. పదవీవిరమణ పొందిన ఉపాధ్యాయులు/లెక్చరర్లు/ప్రొఫెసర్లు/ఉద్యోగులను బడిబాట చివరి రోజున ఆహ్వానించి వారికి పాఠశాలల అవసరాలను తెలియజెప్పి వారి సేవలను పొందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే వచ్చే నెల 4న మన ఊరి బడి, 7న బాలికా విద్య, 10న సామూహిక అక్షరాభ్యాసం, 11న స్వచ్ఛ పాఠశాల/హరితహారం, 12న పాఠశాల యాజమాన్య కమిటీల డోర్ టు డోర్ సర్వే/ బాలకార్మిక విముక్తి వంటి కార్యక్రమాలు చేపట్టాలని వివరించారు. ఇవీ బడిబాట ప్రధాన లక్ష్యాలు... ►అన్ని ఆవాస ప్రాంతాల్లో బడి ఈడు గల పిల్లలను గుర్తించి సమీప పాఠశాలల్లో చేర్పించడం ►ప్రభుత్వ బడుల్లో ఎన్రోల్మెంట్ పెంచడం ►నాణ్యమైన విద్యను అందించడం ►కమ్యూనిటీ భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ►అంగన్వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు నిండిన పిల్లలను ప్రభుత్వబడుల్లో చేర్పించడం ►విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ అప్డేట్ చేయడం ►ఐదో తరగతి పూర్తయినవారిని ఆరో తరగతిలో, ఏడో తరగతి పూర్తయిన వారిని 8వ తరగతిలో చేర్పించడం ►బాలికా విద్య ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ బాలికలు పాఠశాలల్లో చేరేలా చర్యలు చేపట్టడం ►బడి బయట పిల్లలను గుర్తించి బడుల్లో చేర్పించడం -
సార్ దీవెనలు కేసీఆర్‌కే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : ఆచార్య జయశంకర్ ఎక్కడున్నా.. ఆయన ఆశీస్సులు సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌లకే ఉంటాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు వ్యాఖ్యానించారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణభవన్‌లోని విగ్రహానికి గురువారం మంత్రులు కేటీఆర్, తలసాని, సి.లక్ష్మారెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆ ర్ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం సుదీర్ఘ కాలం పోరాడిన జయశంకర్ సార్ ఇప్పుడు లేకపోవడం విచారకరమన్నారు. కార్యక్రమంలో ఎంపీలు బీబీ పాటిల్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, శంభీపూర్ రాజు, ఫరీదుద్దీన్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు. -
జయశంకర్ చిరస్మరణీయుడు : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి తన జీవితాంతం కృషి చేసిన వ్యక్తిగా ప్రొఫెసర్ జయశంకర్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా సీఎం ఆయనను స్మరించుకున్నారు. తెలంగాణ సాధించుకోవడంతో పాటు, జయశంకర్ కోరుకున్నట్లే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుండటం ఆయన ఆత్మకు శాంతి కలిగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
టీఎస్పీఎస్సీ వర్సెస్ వ్యవసాయ వర్సిటీ
♦ వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల్లోని పోస్టుల భర్తీ అధికారం టీఎస్పీఎస్సీకి ♦ అలాగైతే విశ్వవిద్యాలయాల గుర్తింపు రద్దవుతుందని ఐకార్ హెచ్చరిక ♦ దీంతో తామే భర్తీ చేసుకుంటామంటున్న ఉద్యాన, వ్యవసాయ వర్సిటీలు ♦ సీఎస్‌కు ఫిర్యాదు, ముఖ్యమంత్రి వద్దకు పంచాయితీ సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీపై వివాదం నెలకొంది. పోస్టులను భర్తీ చేసే అధికారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)కి అప్పగించడంపై ఆ రెండు వర్సిటీలు మండిపడుతున్నాయి. నిబంధనల ప్రకారం పోస్టుల భర్తీపై టీఎస్పీఎస్సీకి హక్కులేదని స్పష్టం చేస్తున్నాయి. ఆయా పోస్టులను వర్సిటీలే భర్తీ చేసుకుంటాయని ఘంటాపథంగా చెబుతున్నాయి. ఈ వివాదంపై ఆ విశ్వవిద్యాలయాల ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఇటీవల ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. దీనిపై చర్చించిన ఆయన... సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు సమస్యను వివరిస్తానని హామీ ఇచ్చారు. దీంతో పంచాయితీ సీఎం వద్దకు చేరింది. ప్రస్తుతం సీఎం ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న చర్చ జరుగుతోంది. అలాగైతే ఐకార్ గుర్తింపు రద్దు... వ్యవసాయ విశ్వవిద్యాలయంలో దాదాపు 100 పోస్టులు, ఉద్యాన వర్సిటీలో 107 పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వానికి వ్యవసాయశాఖ గతేడాది విన్నవించింది. భర్తీకి ఆర్థికశాఖ అనుమతిచ్చింది. అయితే ఆ పోస్టుల భర్తీ బాధ్యతను టీఎస్పీఎస్సీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో విశ్వవిద్యాలయ వర్గాలు కంగుతిన్నాయి. ఈ అంశాన్ని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) దృష్టికి ఆ రెండు విశ్వవిద్యాలయాలు తీసుకొచ్చాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ సహా ఇతర పోస్టులను భర్తీ చేసే అధికారం టీఎస్పీఎస్సీకి లేదని ఐకార్ స్పష్టం చేసింది. టీఎస్పీఎస్సీ భర్తీ చేస్తే ఐకార్ గుర్తింపు రద్దవుతుందని హెచ్చరించినట్లు తెలిసింది. ఐకార్ గుర్తింపుతోనే వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుంది. అప్పుడే నిధులు, నియామకాల్లో ప్రాధాన్యం ఉంటుంది. ఐకార్ గుర్తింపు లేకపోతే విద్యార్థులకూ నష్టమే.. ఐకార్ గుర్తింపు లేకపోతే అందులో చదివిన విద్యార్థులకు ఏ రాష్ట్రంలోనూ, దేశంలోనూ సంబంధిత ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వరు. అంతర్జాతీయ సదస్సులకూ ఆహ్వానించరు. ఆయా దేశాల్లోని వర్సిటీల్లో పరిశోధనలకు విద్యార్థులకు అవకాశం కల్పించరు. అలాగే నిధులు నిలిచిపోతాయని అధికారులు చెబుతున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర పోస్టుల భర్తీ అనేది కేవలం రాత పరీక్ష, ఇంటర్వూ్య నిర్వహించి ఉత్తర్వులు ఇవ్వడం కాదనీ, ఐకార్ నిబంధనల ప్రకారం విశ్వవిద్యాలయాలే భర్తీ ప్రక్రియ చేపడతాయని జాతీయ వ్యవసాయ, ఉద్యాన నిపుణుల బృందం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై ముఖ్యమంత్రి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని ఆ విశ్వవిద్యాలయాల అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.