సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జూన్ 1 నుంచి బడులు ప్రారంభం కానుండటంతో జూన్ 4 నుంచి 12 వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వí హించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం ప్రతి పాఠశాలకు రూ. 1,000 చొప్పున నిధులను ఇచ్చేలా జిల్లాల అధికారులకు పాఠశాల విద్య కమిషనర్ విజయ్ కుమార్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. కొన్ని ప్రధాన లక్ష్యాలతో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు. జూన్ 1 నుంచి 3 వరకు సంసిద్ధతా కార్యక్రమాలు నిర్వహించాలని, కలెక్టర్ల ఆధ్వర్యంలో సమన్వయ సమావేశాలు నిర్వహించి బడిబాట విజయవంతానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
ప్రజాప్రతినిధులను, స్వయం సహాయక బృందాల మహిళలను భాగస్వాములను చేసేలా ప్రణాళిక ఉండాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు సమావేశం నిర్వహించి 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న బాలికలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్‌ల పంపిణీ, పాఠశాలల్లో అమలు చేస్తున్న ఇతర కార్యక్రమాలను వివరించేలా పాఠశాల ప్రొఫైల్ రూపొందించుకొని బడిబాటలో వివరించాలన్నారు. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఇంటింటి ప్రచారం చేయాలని సూచించారు. మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీవో, ఎంఈవో, సహాయక కార్మిక అధికారి, స్వచ్ఛంద సంస్థలు, బాలికా శిశు సంక్షేమ పర్యవేక్షకులు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్లతో టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని, బాలకార్మికులు లేకుండా ఈ కమిటీలు చూడాలని స్పష్టం చేశారు.
విద్యార్థుల హక్కులకు సంబంధించిన సమస్యలను తెలియజేసేందుకు ప్రతి పాఠశాలలో, నోటీసు బోర్డులో టోల్ ఫ్రీ నంబర్ 18004253525 పొందుపరచాలని వివరించారు. పదవీవిరమణ పొందిన ఉపాధ్యాయులు/లెక్చరర్లు/ప్రొఫెసర్లు/ఉద్యోగులను బడిబాట చివరి రోజున ఆహ్వానించి వారికి పాఠశాలల అవసరాలను తెలియజెప్పి వారి సేవలను పొందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే వచ్చే నెల 4న మన ఊరి బడి, 7న బాలికా విద్య, 10న సామూహిక అక్షరాభ్యాసం, 11న స్వచ్ఛ పాఠశాల/హరితహారం, 12న పాఠశాల యాజమాన్య కమిటీల డోర్ టు డోర్ సర్వే/ బాలకార్మిక విముక్తి వంటి కార్యక్రమాలు చేపట్టాలని వివరించారు.
ఇవీ బడిబాట ప్రధాన లక్ష్యాలు...
►అన్ని ఆవాస ప్రాంతాల్లో బడి ఈడు గల పిల్లలను గుర్తించి సమీప పాఠశాలల్లో చేర్పించడం
►ప్రభుత్వ బడుల్లో ఎన్‌రోల్‌మెంట్ పెంచడం
►నాణ్యమైన విద్యను అందించడం
►కమ్యూనిటీ భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం
►అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు నిండిన పిల్లలను ప్రభుత్వబడుల్లో చేర్పించడం
►విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ అప్‌డేట్ చేయడం
►ఐదో తరగతి పూర్తయినవారిని ఆరో తరగతిలో, ఏడో తరగతి పూర్తయిన వారిని 8వ తరగతిలో చేర్పించడం
►బాలికా విద్య ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ బాలికలు పాఠశాలల్లో చేరేలా చర్యలు చేపట్టడం
►బడి బయట పిల్లలను గుర్తించి బడుల్లో చేర్పించడం
Comments
Please login to add a commentAdd a comment