తెలంగాణలో మోగిన బడిగంట.. ఉత్సాహంగా విద్యార్థుల బడిబాట | Telangana Schools To Reopen From Monday | Sakshi
Sakshi News home page

తెలంగాణలో మోగిన బడిగంట.. ఉత్సాహంగా విద్యార్థుల బడిబాట

Published Mon, Jun 13 2022 1:09 AM | Last Updated on Mon, Jun 13 2022 9:26 AM

Telangana Schools To Reopen From Monday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వేసవి సెలవుల అనంతరం సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి.కొత్త ఆశలు, క్రొంగొత్త ఆలోచనలతో నూతన విద్యా సంవత్సరంలోకి విద్యార్థులు అడుగుపెట్టారు. అందంగా ముస్తాబైన పాఠశాలలు పిల్లలకు స్వాగతం పలికాయి. తొలిరోజు ఉత్సాహంగా విద్యార్థులు బడిబాట పట్టారు.  సెలవులకు స్వస్తి పలికిన విద్యార్థులు పేరెంట్స్‌కు టాటా చెబుతూ స్కూల్‌లో అడుగుపెట్టారు.

కాగా సుమారు 60 లక్షల మంది విద్యార్థులు బడి బాట పట్టనున్నారు. కోవిడ్‌ కేసుల పెరుగుదల, పుస్తకాల పంపిణీ పూర్తవకపోవడం, వేసవి తీవ్రత ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో సెలవులు పొడిగిస్తారన్న ప్రచారం జరిగినా.. ఆ ఊహాగానాలకు విద్యాశాఖ తెరదించింది. 13వ తేదీ నుంచే యథావిధిగా పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయని స్పష్టం చేసిన విషయం తెలిసిందే

కోవిడ్‌ తర్వాత సకాలంలో..:
రాష్ట్రవ్యాప్తంగా 26,065 ప్రభుత్వ, ఎయిడెడ్‌ స్కూళ్లలో 26లక్షల మంది విద్యార్థులు చదువు తున్నారు. రెసిడెన్షియల్, కస్తూరిబా బాలికల విద్యాలయాలు, మోడల్‌ స్కూల్స్‌లో మరో 2.5 లక్షల మంది విద్యార్థులున్నారు. ఇక 10,800 ప్రైవేటు స్కూళ్లలో 32 లక్షల మంది విద్యార్థులు న్నారు. మొత్తంగా 60 లక్షల మంది విద్యార్థులు పాఠశాలల బాట పట్టనున్నారు. కరోనా ప్రభావం కారణంగా రెండేళ్ల తర్వాత ఈ విద్యా సంవత్సరం లోనే సకాలంలో స్కూళ్లు ప్రారంభమవుతుండటం గమనార్హం. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమం కింద పాఠశాలల్లో సమస్యలను తీర్చేందుకు చర్యలు చేపట్టింది.

ఆంగ్ల మీడియంతో ప్రవేశాలు పెరిగే అవకాశం
ఈ విద్యా సంవత్సరం నుంచే సర్కారీ బడుల్లో 1–8 తరగతులకు ఆంగ్ల బోధన మొదలవనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు 80 వేల మంది ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సిద్ధం చేసింది. వారు ఇంగ్లిష్‌ మీడియంలో బోధన చేయనున్నారు. విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠ్య పుస్తకాలను తెలుగు, ఇంగ్లిష్‌ రెండు మాధ్యమాల్లోనూ ఉండేలా సిద్ధం చేశారు. పుస్తకం బరువు పెరగకుండా.. సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌–1 వరకూ ఒక భాగం, ఎస్‌ఏ–2 వరకు మరో భాగంగా విభజించారు. ఇంగ్లిష్‌ మీడియం నేపథ్యంలో ప్రభుత్వ స్కూళ్లలో ఈసారి ప్రవేశాలు పెరుగుతాయని భావిస్తున్నారు.

పలు సమస్యలతో ఇబ్బందులు!
పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న తరుణంలో ఇప్పటికీ పలు సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. కొత్తగా ఇంగ్లిష్‌ మీడియం కోసం రెండు భాషల్లో ముద్రించిన పుస్తకాలు స్కూళ్లకు సరిపడా చేరలేదు. 2.10 కోట్ల పుస్తకాలు అవసరంకాగా.. ఇప్పటికీ 20 లక్షల పుస్తకాలే ముద్రించినట్టు సమాచారం.

కాంట్రాక్టర్లు ఎక్కువ ధర కోట్‌ చేయడంతో టెండర్ల ప్రక్రియ తిరిగి మొదలుపెట్టడం, కాగితం కొరత ఆలస్యానికి కారణమని అధికారులు చెప్తున్నారు. ఈ నెలాఖరు నాటికి పుస్తకాలు అందుతాయని అంటున్నా.. మరో నెల వరకూ వచ్చే అవకాశం కన్పించడం లేదు.

►ఇక గత ఏడాది సర్కారీ స్కూళ్లలో యూనిఫారాలు ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా ఈ సమస్య కన్పిస్తోంది. 1.5 కోట్ల మీటర్ల వస్త్రం అవసరంకాగా.. ఇప్పటివరకు 60 లక్షల మీటర్లే కొనుగోలు చేశారు. మిగతాది కొని, కుట్టించి, పంపిణీ చేయాలంటే సమయం పట్టొచ్చని అధికారులు అంటున్నారు.

►ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత సమస్యగానే ఉంది. బోధనేతర సిబ్బందీ సరిగా లేరు. 2019–20 విద్యా సంవత్సరంలో 21 వేల మంది విద్యా వలంటీర్ల సేవలు తీసుకున్నారు. కోవిడ్‌తో గత ఏడాది వీరి సేవలు నిలిపివేశారు. మళ్లీ వారిని తీసుకుంటే కొంతవరకు సమస్య తీరుతుందనే అభిప్రాయాలు వస్తున్నాయి.

►కొద్దిరోజులుగా కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. ఈ ఏడాది కూడా విద్యా రంగం పరిస్థితి ఏమిటన్న ఆందోళనలూ వెంటాడుతున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement