Badi Bata Program
-
బడిబాట పట్టలేం!
సాక్షి, హైదరాబాద్: వీధి బాలలు, చదువుకు దూరమైన పిల్లలను బడిబాట పట్టించేందుకు ప్రభుత్వం జూన్ నెల మొత్తం యాక్షన్ ప్లాన్ ఖరారు చేసింది. అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు బుధవారం జిల్లా, మండల స్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించారు. అన్ని స్థాయిల ఉపాధ్యాయులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. అయితే, ఉపాధ్యాయ వర్గాల నుంచి దీనిపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. నెల మొత్తం శాఖాపరమైన విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులు బడిబాట పేరుతో గ్రామాలు, వీధుల్లో తిరగడం ఎలా కుదురుతుందని ప్రశ్నిస్తున్నారు. కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ఇప్పటికే పలు సంఘాల ప్రతినిధులు విద్యాశాఖను కోరారు. జిల్లా విద్యాశాఖాధికారులు కూడా ఉపాధ్యాయుల నుంచి వస్తున్న అభ్యంతరాలను కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లారు. అయితే, సమగ్ర శిక్షా విభాగం మాత్రం బడిబాట ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి తీరాలని మార్గదర్శకాలు జారీ చేసింది. తీరికేది? వాస్తవానికి స్కూళ్లకు వేసవి సెలవులు ఇచ్చిన తర్వాత, మళ్లీ రీ ఓపెనింగ్ సమయంలో బడిబాట నిర్వహించడం గతంలో జరిగేది. కానీ రెండేళ్లుగా కోవిడ్ మూలంగా బడిబాట సరిగా జరగలేదు. దీంతోపాటే కోవిడ్ వల్ల ఈ విద్యాసంవత్సరం ఆలస్యంగా మొదలైంది. దీంతో మార్చి, ఏప్రిల్‌లో జరగాల్సిన పదవ తరగతి పరీక్షలు ఈసారి మే 23 నుంచి జూన్ 1 వరకూ జరిగాయి. దీంతో టీచర్లు జూన్ మొదటి వారంలో టెన్త్ సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియే ఈ నెలాఖరు వరకు సాగుతుందని టీచర్లు అంటున్నారు. ఇలాంటి సందర్భంలో బడిబాటకు టీచర్లు వెళ్లడం సాధ్యం కాదని చెబుతున్నారు. దీనికితోడు ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్ష జరుగుతుంది. దీని నిర్వహణలోనూ ఉపాధ్యాయులే పాల్గొనాల్సి ఉంటుందనే వాదన తెరమీదకు తెచ్చారు. ఆంగ్ల బోధనకు తర్ఫీదూ అడ్డంకే ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచే 1–8 తరగతులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపట్టాలని నిర్ణయించింది. 26 వేల పాఠశాలల్లో దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది ఇప్పటికే కొంతమంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వగా, మరికొంతమంది శిక్షణ తీసుకోవాల్సి ఉంది. బడులు తెరిచేలోగా పాఠ్యాంశాలు ముందుగా చదివి ఇంగ్లిష్ బోధనకు సిద్ధం కావాల్సి ఉంటుందని, బడిబాట పేరుతో బయటకెళ్లడం సాధ్యం కాదని వారు అంటున్నారు. బదిలీలు చేపడితే... జూన్‌లో టీచర్ల బదిలీలు చేపడతామని విద్యాశాఖ మంత్రి అనేకసార్లు చెప్పడాన్ని ఉపాధ్యాయులు ప్రస్తావిస్తున్నారు. ఈ ప్రక్రియ చేపడితే ఎవరు ఎక్కడికి వెళ్తారో తెలియదు. ఆప్షన్లు ఇచ్చుకోవడం, బదిలీ అయ్యాక కొత్త ప్రాంతానికి వెళ్లి స్థిరపడటం వంటి ప్రక్రియలుంటాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇవన్నీ జూన్‌లోనే చేస్తామని చెబుతూ బడిబాట కార్యక్రమానికి షెడ్యూల్ ఇవ్వడం ఏమిటని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వాయిదా వేస్తే నష్టమేంటి? ఇంగ్లిష్ మీడియం విద్య సర్కారీ స్కూళ్లలో అందిస్తున్నారంటే ప్రతీ పేదవాడు తమ పిల్లలను ప్రభుత్వ స్కూలుకు పంపాలనే అనుకుంటాడు. మారుమూల పల్లెల్లో సైతం విద్యపై అవగాహన పెరిగింది. ఇప్పుడు టీచర్లను బడిబాట పేరుతో పరుగులు పెట్టించాల్సిన అవసరమే లేదు. పైగా టెన్త్ పేపర్ల మూల్యాంకనంతోపాటు అనేక ప్రభుత్వ విధుల్లో ఉపాధ్యాయులు పాల్గొనాల్సి ఉంది. అందువల్ల బడిబాటను వాయిదా వేస్తే వచ్చే నష్టమేంటి? జూలైలో నిర్వహిస్తే అందరికీ వెసులుబాటు ఉంటుంది. – మహ్మద్ అబ్దుల్లా, తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్ అధ్యక్షుడు -
బడిబాట షురూ
పాపన్నపేట (మెదక్): బడీడు పిల్లలు బడిలో ఉండేలా ప్రభుత్వం రూపొందించిన ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమం శుక్రవారం జిల్లాలో ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించారు. ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి చదువుకుంటే వచ్చే ఫలితాలను వివరించారు. ప్రభుత్వ బడుల్లో చదువుకుని ప్రభుత్వం నుంచి అమలయ్యే సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బడిబయట ఉన్న పిల్లలందరినీ బడిలో చేర్పించాలని కోరారు. పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యాశాఖ జిల్లా నోడల్ అధికారి మధుమోహన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడీడు పిల్లలందరినీ బడిలో చేర్పించి ఉన్నత విద్యా ప్రమాణాలు అందించాలని తెలిపారు. ప్రభుత్వ బడుల గొప్పతనాన్ని ప్రజలకు చేరవేసి విద్యా లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఇక బడిబాట
పాపన్నపేట(మెదక్): బడీడు పిల్లలంతా బడిలో ఉండేలా అవగాహన కల్పించేందుకు.. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల వైపు మళ్లించేందుకు విద్యాశాఖ ‘బడిబాట’కు మరోసారి సన్నద్ధమైంది. ఈనెల 14 (శుక్రవారం) నుంచి 19 వరకు పండుగ వాతావరణంలో ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించేం దుకు ఆదేశాలిచ్చింది. ఇటీవల పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ బడులు సాధించిన మెరుగైన ఫలితా లను విస్తృతంగా ప్రచారం చేసి నమోదు శాతం పెంచేందుకు పక్కా ప్రణాళిను అమలు చేయబోతున్నారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు సన్మానాలు చేయనున్నారు. ప్రభుత్వ బడిని బతికించుకునేందుకు ప్రైవేటును తలదన్నే ప్రచార వ్యూహాలు సిద్ధం చేశారు. ప్రతి గ్రామంలో ‘గ్రామ విద్యా రిజిస్టర్’ (ఏఈఆర్)తప్పకుండా నిర్వహించాలని తద్వారా బడి బయట ఉన్న విద్యార్థుల వివరాలు గుర్తించవచ్చని భావిస్తున్నారు. బడీడు పిల్లలు బడిలో ఉండడమే ఉద్దేశం.. ప్రభుత్వ బడుల్లో నమోదు శాతం పెంచేందుకు దశాబ్ద కాలంగా విద్యాశాఖ బడిబాట కార్యక్రమాన్ని చేపడుతోంది. విద్యాసంవత్సరం ఆరంభం నుంచి వారం రోజుల పాటు నిర్దేశించిన షెడ్యూల్ కనుగుణంగా పండుగ వాతావరణంలో బడిబాట నిర్వహిస్తున్నారు. జిల్లాలో 902 ప్రభుత్వ పాఠశాలలుండగా సుమారు 83 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటికీ కొంత మంది పిల్లలు అక్కడక్కడ ఇటుక బట్టీల్లో.. యాచక వృత్తిలో.. పశువుల కాపరులుగా.. హోటళ్లు, కిరాణ దుకాణాల్లో బాల కార్మికులుగా బతుకీడుస్తున్నారు. బడీడు గల పిల్లలందరినీ బడిలో చేర్పించడం.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ‘బడిబాట’ ప్రధాన ఉద్దేశం. అందుకే అంగన్వాడీ పూర్తి చేసిన పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించడం.. బాలికల విద్యను ప్రోత్సహించడం.. హాజరు నమోదు తక్కువగా ఉన్న పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టడం.. పోషకుల సమావేశం నిర్వహించడం.. గుణాత్మక విద్యా సాధనకు చేస్తున్న కృషి వివరించి స్వచ్ఛంద సంస్థలు, పూర్వ విద్యార్థులు, గ్రామ పెద్దలు, దాతల సాయాన్ని తీసుకొని పాఠశాల అభివృద్ధికి పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం, పదో తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులను, ఉపాధ్యాయులను సన్మానించడం లాంటివి ప్రాధాన్య అంశాలుగా గుర్తించారు. 10 జీపీఏ సాధించిన విద్యార్థులు, హెచ్ఎంలతో కలసి కలెక్టర్ ధర్మారెడ్డి, జేసీ నగేశ్, డీఈఓ రవికాంత్‌రావు ఇప్పటికే విందు కార్యక్రమాన్ని పూర్తి చేశారు. బడిబాట షెడ్యూల్ .. ఈనెల 14న ‘మన ఊరి బడి’: పాఠశాలలకు రంగులు వేయించడం, ఇంటింటి సర్వే నిర్వహించడం, కరపత్రాలు పంచడం, ర్యాలీలు నిర్వహించడం, బడీడు పిల్లలందరినీ బడిలో చేర్పిండం, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలతో కలసి పాఠశాల అభివృద్ధి కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవడం చేయాలి. నాణ్యమైన విద్యను అందించేందుకు, విద్యాప్రమాణాలు పెంపొందించేదుకు తీర్మానాలు చేయాలి. 15న ‘బాలిక విద్యా’ కార్యక్రమాలు: బాలికల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న హెల్త్, హైజిన్ కిట్స్ పంపిణీ, వాటి ప్రాధాన్యత, కస్తూర్బా బాలికల పాఠశాల ప్రవేశం, అక్కడి సౌకర్యాలు, విద్యార్థినులకు పాఠశాలల్లో నేర్పుతున్న మార్షల్ ఆర్ట్స్, మహిళా సాధికారత విషయాలు తెలియజేయాలి. 17న ‘సామూహిక అక్షరాభ్యాసం’: గ్రామపెద్దలను, ప్రజాప్రతినిధులను పిలిచి విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించాలి. అందుకు కావాల్సిన పలకలు, బలపాలు సమకూర్చుకోవాలి. పండుగ వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించాలి. 18న ‘స్వచ్ఛ పాఠశాల’ (హరితహారం): పాఠశాల ప్రాంగణాన్ని, తరగతి గదులను, పాఠశాలలో తాగునీటి ట్యాంకులను, మరుగుదొడ్లను శుభ్రం చేసుకోవాలి. తరగతుల్లో బోధనాభ్యసన చార్టులు అంటించాలి. హరితహారం నిర్వహించడం చేయాలి. 19న ‘పాఠశాల యాజమాన్య కమిటీ (బాల కార్మికుల విముక్తి) సమావేశాలు’: బాల కార్మికుల విముక్తికి పాఠశాల యాజమాన్య కమిటీ తగిన చర్యలు తీసుకోవాలి. ప్రతి పాఠశాలలో ఎస్ఎంసీ సమావేశాలను నిర్వహించాలి. టాస్క్‌ఫోర్స్ కమిటీ, ఎస్ఎంసీ కమిటీలతో కలసి, బాలకార్మికులు ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడికి వెళ్లి వారిని పాఠశాలల్లో చేర్పించాలి. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులను పాఠశాలకు పిలిచి వారిని సన్మానిం చాలి. టెన్త్, ఏడో తరగతి ఫలితాలు వివరిం చాలి. మౌలిక వసతుల వివరాలు, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు, ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌లతో ఒక పాఠశాల ప్రొఫైల్ తయారు చేసుకోవాలి. -
నేటి నుంచే బడిబాట
ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి ఈ నెల 19 వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేశారు. ఐదు రోజుల పాటు రోజుకో కార్యక్రమాన్ని చేపట్టి సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా బడిబయటి పిల్లల్ని బడిలో చేర్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించడం, పాఠశాలలను శుభ్రపర్చుకోవడం, తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఐదు రోజుల పాటు జిల్లాలోని ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులను కార్యక్రమంలో భాగస్వామ్యం చేయనున్నారు. డ్రాపౌట్ తగ్గించడమే లక్ష్యం.. బడియట ఉన్న పిల్లల్ని బడిలో చేర్పించేందుకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 709 మంది పిల్లలు బడిబయట ఉన్నారు. వీరిలో 453 మంది బాలురు, 256 మంది బాలికలు ఉన్నట్లు పేర్కొంటున్నారు. అయితే ఈ కార్యక్రమం జూన్ 4 నుంచి 12 వరకు నిర్వహించాల్సి ఉండగా, జిల్లాలో ఎండ తీవ్రత కారణంగా పాఠశాలలకు 11 వరకు సెలవులు పొడిగించిన విషయం విధితమే. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 14 నుంచి 19 వరకు చేపట్టనున్నారు. కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో ఐదేళ్లు నిండిన పిల్లల్ని పాఠశాలల్లో చేర్చడం, 5వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులను ప్రాథమికోన్నత పాఠశాలలు, 7వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో చేర్పించడం, ఎన్రోల్మెంట్ తక్కువ ఉన్న పాఠశాలలను గుర్తించి విద్యార్థుల తల్లిదండ్రులకు సర్కారు బడుల గురించి వివరించి విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా బాలికల విద్య ప్రాముఖ్యతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి అనాథ పిల్లల్ని కేజీబీవీ, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పించే కార్యక్రమాలను చేపట్టనున్నారు. సర్కారు బడులను కాపాడుకునేందుకు.. ఆదిలాబాద్ జిల్లాలో 1,287 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 970 ప్రాథమిక పాఠశాలలు, 122 ప్రాథమికోన్నత పాఠశాలలు, 195 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 94,737 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే జిల్లాలో దాదాపు 50 పాఠశాలల్లో పది కంటే విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్నారు. జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లు దాదాపు 10 వరకు ఉన్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోనే ఐదు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఆ పాఠశాలలు మూతపడ్డాయి. ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా ప్రభుత్వ పాఠశాలలను రక్షించేందుకు బడిబాట కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యతోపాటు పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫాం, తదితర సౌకర్యాలు కల్పించనున్నట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్తున్నారు. రోజువారీగా కార్యక్రమాలు.. మొదటి రోజు(14న): మన ఊరు–మన బడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆవాసా ప్రాంతంలో బడిబాట కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ర్యాలీలు, కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహిస్తారు. పాఠశాల విద్యాకమిటీ, ఉపాధ్యాయులతో కలిసి వార్షిక ప్రణాళిక తయారు చేస్తారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు తీర్మానాలు చేస్తారు. రెండో రోజు(15న): బాలికల విద్య, ఆరోగ్య పరిరక్షణ కోసం పంపిణీ చేయబడుతున్న ఆరోగ్య కిట్ల గురించి విద్యార్థినులకు అవగాహన కల్పిస్తారు. కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో విద్యార్థినుల తల్లిదండ్రులను పిలిచి సౌకర్యాల గురించి తెలియజేస్తారు. పాఠశాలల్లో బాలికల విద్యపై తీసుకోనున్న మార్షల్ ఆర్ట్, జీవన నైపుణ్యాలు, ప్రత్యేక అవసరాలు గల బాలికలకు స్టైఫండ్, తదితర వాటి గురించి వివరిస్తారు. మహిళ అధికారులను పిలిచి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మూడో రోజు(17న): చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తారు. పాఠశాలల్లో పండగ వాతావరణం కల్పించడం, ఉన్నత పాఠశాలల్లో నూతనంగా చేరిన పిల్లల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహిస్తారు. బడిబాట ప్రాధాన్యత, చదువు విశిష్టత తెలియజేసే సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతారు. నాలుగో రోజు(18న): పాఠశాలల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం, నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతలను ఉపాధ్యాయులు, విద్యార్థులకు అప్పజెప్పడం. పాఠశాల ప్రాంగణాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం, వాటర్ ట్యాంక్ శుభ్రపర్చుకోవడం, తరగతి గదిలో వృథా సామగ్రిని తొలగించడం, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఐదవ రోజు(19న): బడిబయట ఉన్న పిల్లల్ని బడిలో చేర్పించడం. టాస్క్‌ఫోర్స్ కమిటీ ద్వారా బాల కార్మికులను విముక్తి చేయడం, పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులను పాఠశాలకు మర్యాద పూర్వకంగా ఆహ్వానించి వారి సేవలను స్వచ్ఛందంగా పాఠశాలకు వినియోగించుకోవడం. విద్యార్థుల తల్లిదండ్రులు, యాజమాన్య కమిటీల సమావేశం నిర్వహించడం. ఇంటింటికి తిరుగుతూ పిల్లల్ని బడిలో చేర్పించడం. పదో తరగతిలో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థుల తల్లిదండ్రులను, విద్యార్థులను సన్మానించే కార్యక్రమాలు చేపట్టనున్నారు. బడిబాటను పకడ్బందీగా నిర్వహిస్తాం బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తాం. ఈ నెల 14 నుంచి 19 వరకు రోజుకో కార్యక్రమాన్ని చేపడుతాం. శుక్రవారం బోథ్ మండలంలోని మర్లపల్లిలో బోథ్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 15న ఆదిలాబాద్ మండలంలోని పిప్పల్ధరిలో బడిబాట కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొంటారు. ఏ ఒక్క చిన్నారి కూడా బడిబయట ఉండకుండా ఉపాధ్యాయులు కృషి చేయాలి. – ఎ.రవీందర్‌రెడ్డి, డీఈఓ -
నేటి నుంచి బడిబాట
జిల్లాలో విద్యాశాఖ అధికారులు శుక్రవారం నుంచి బడిబాట కార్యక్రమం చేపడుతున్నారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి బడిబయట ఉన్న చిన్నారులను బడిలో చేర్పించనున్నారు. యేటా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో అధికారులు కార్యక్రమాన్ని ఈనెల 19 వరకు నిర్వహించనున్నారు. వనపర్తి టౌన్ : బడిఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు విద్యాశాఖ అధికారులు బడిబాట నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని పాఠశాలల్లో అమలు చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక విడుదల చేశారు. జూన్ 12 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, మండల, జెడ్పీ, ఎయిడెడ్, కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయులందరినీ భాగస్వాములు చేసేలా విధివిధానాలను రూపొందించింది. ప్రైవేట్ పాఠశాలల ప్రవేశాలకు దీటుగా విద్యార్థులను సమకూర్చుకునేందుకు జిల్లా విద్యాశాఖ సిద్ధం అవుతోంది. ప్రభుత్వ పాఠశాలలు సాధించిన ప్రగతి, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు, గుణాత్మక విద్య బోధనాంశాలు వివరించి విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించాలని ప్రచారం చేయనున్నారు. అన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఈనెల 14 నుంచి 19 వరకు బడి బాట కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ కార్యక్రమం అన్నీ ప్రభుత్వ పాఠశాలలో కొనసాగనుంది. ప్రజలను, ప్రజాప్రతినిధులను, స్వచ్ఛంద సంస్థలు వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యంతో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లా యంత్రాగం చర్యలు చేపడుతోంది. ఈ మేరకు ప్రభుత్వ ఉపాధ్యాయులను సంసిద్ధులను చేయడంతో పాటుగా బడిబయట పిల్లలను గుర్తించి, బడిఈడు పిల్లలను సర్కార్ బడుల్లో చేర్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఖర్చులకు రూ.వెయ్యి బడిబాట నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది. ఈనెల 14 నుంచి 19 వరకు ఐదురోజుల పాటు ఒక్కోరోజు ఒక్కో కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. జిల్లాలోని 539 పాఠశాలలకుగానూ ఒక్కో పాఠశాలకు రూ.1000 ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ఈ డబ్బులతో ప్రచార సామగ్రి, ప్రగతి నివేదికలు, బ్యానర్లను ఉపాధ్యాయులు సమకూర్చుకోనున్నారు. అపోహలు తొలగించే విధంగా.. సర్కార్ పాఠశాలపై ప్రజల్లో నమ్మకం కలిగించి, వారిలోని అపోహలను తొలగించేందుకు ఉపాధ్యాయులు బడిబాట ద్వారా కృషి చేయనున్నారు. నాణ్యమైన విద్య, అందిస్తున్న తీరుతో పాటు, బడుల్లోని బోధన, సదుపాయాలు, సాధించిన ఫలితాలతో తల్లిదండ్రుల విశ్వాసాన్ని పొందేందుకు ప్రయత్నించనున్నారు. నేడు ప్రదర్శనలు ఈనెల 14 మనఊరు బడి పేరుతో గ్రామంలోని పాఠశాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. అవాస ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహించనున్నారు. తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి, ప్రభుత్వ అందిస్తున్న నాణ్యమైన విద్య, సదుపాయాలను వారికి వివరించనున్నారు. 15న బాలికలకు విద్య అందించేందుకు చేపడుతున్న కార్యక్రమాలు ఆరోగ్య, సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు, కల్పిస్తున్న సదుపాయాలపై అవగాహన కల్పిస్తున్నారు. 17న విద్యార్థులతో సామూహికంగా అక్షరాభాస్యం చేయిస్తారు. ఉన్నత పాఠశాలలో చేరిన విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. 18న పాఠశాలలోని తరగతి గదులను తీర్చిదిద్దేందుకు, ఆవరణలను పరిశుభ్రపరుస్తారు. ఆవరణలో మొక్కలు నాటి స్వచ్ఛత కార్యక్రమాలు చేపడతారు. 19న పాఠశాలల యాజమాన్య కమిటీల భాగస్వామ్యంతో ఇంటింటికీ పర్యటిస్తారు. పాఠశాలల యాజమాన్య కమిటీ, స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేసి పదో తరగతిలో విద్యార్థులు సాధించిన ప్రగతిని వివరించనున్నారు. -
బడిబాటకు సిద్ధం
బూర్గంపాడు: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని గ్రామాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించనున్నారు. ఈ నెల 19 వరకు ఐదు రోజుల పాటు నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 4వ తేదీనే ప్రారంభం కావాల్సి ఉండగా... వేసవి సెలవుల పొడిగింపుతో వాయిదా పడింది. ఎండల తీవ్రత కారణంగా ఈ ఏడాది పాఠశాలల పునఃప్రారంభం ఆలస్యమైంది. దీంతో బడిబాట కార్యక్రమం కూడా ఆలస్యమైంది. నేటి ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు బడిబాట కార్యక్రమాలను నిర్వహించేలా జిల్లా విద్యాశాఖ షెడ్యూల్ రూపొందించింది. కార్యక్రమ రూపకల్పన ఇలా.. నేటి నుంచి ఈనెల 19 వరకు అన్ని ఆవాస ప్రాంతాలలో బడిబాట ప్రాధాన్యతను వివరిస్తూ ప్రదర్శనలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆయా పాఠశాలలను సుందరంగా అలంకరించాలి. తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి పిల్లలందరినీ బడిలో చేర్పించాలి. స్థానిక ప్రజాప్రతినిధులను, అధికారులను కూడా బడిబాటలో భాగస్వాములు చేయాలి. బడి ఈడు పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్పించాలి. స్థానికుల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలి. అంగన్వాడీ కేంద్రాలలో చదువుతున్న ఐదేళ్లు నిండిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. 5, 6వ తరగతులు పూర్తయిన వారిని పైతరగతులలో చేర్పించాలి. ఆడపిల్లలను బడిలో చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు హెల్త్ అండ్ హైజిన్ కిట్లు పంపిణీ చేయాలి. బాలికల ఆరోగ్య పరిరక్షణపై వైద్యులతో అవగాహన కల్పించాలి. పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించాలి. బడిబాట కార్యక్రమంలో ముఖ్యంగా బాల కార్మికులను గుర్తించి వారిని బడిలో చేర్పించాలి. ఇందుకు గాను తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ, సహాయ కార్మిక అధికారి, స్వచ్ఛంద సంస్థలు, ఐసీడీఎస్, క్లస్టర్ రిసోర్స్ పర్సన్లతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి బాల కార్మికులను గుర్తించాలి. బడిబాట కార్యక్రమంలో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలి. పాఠశాలలను శుభ్రంగా ఉంచుకుని స్వచ్ఛ పాఠశాలలుగా తీర్చిదిద్దాలి. తరగతి గదులు, వంటగదులు, భోజనశాలలు, మరుగుదొడ్లు, ఆటస్థలాన్ని శుభ్రం చేయాలి. ప్రాథమిక పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాసాలను నిర్వహించాలి. బడిలో కొత్తగా చేరిన పిల్లలకు వారి తల్లిదండ్రులను పిలిపించి అక్షరాభ్యాస కార్యక్రమాలను ఘనంగా ఏర్పాటు చేయాలి. బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలి. వాటి సంరక్షణ బాధ్యతలను విద్యార్థులకు అప్పగించాలి. బడిబాట కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను, అధికారులను భాగస్వామ్యం చేసి పాఠశాలల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. పాఠశాలల అభివృద్ధికి స్థానికంగా ఉన్నటువంటి దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలి. ఎస్ఎంసీలు, ఎస్డీసీలతో సమావేశాలు నిర్వహించి పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించాలి. అన్ని వర్గాల వారూ సహకరించాలి ఈ రోజు నుంచి ఈ నెల 19 వరకు కొనసాగనున్న బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలి. అన్ని వర్గాల వారు దీనికి సహకరించాలి. బడి ఈడు పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించాలి. బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా రూపుమాపేందుకు బడిబాటను వేదికగా చేసుకోవాలి. – వాసంతి, డీఈఓ బడి బాటను విజయవంతం చేయాలి ఎంఈవోల సమావేశంలో డీఈవో వాసంతి కొత్తగూడెంరూరల్: జిల్లాలో శుక్రవారం నుంచి 19వ తేదీ వరకు జరిగే బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఈఓ డి. వాసంతి ఎంఈఓలను ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జిల్లాలోని ఎంఈఓలతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బడిబాట కార్యక్రమంలో సర్పంచ్‌లు, గ్రామ పెద్దలు, ఆయా మండల పరిధిలో ఉన్న అధికారులు, రాజకీయ నాయకులను భాగస్వామ్యం చేసుకోవాలన్నారు. అన్ని పాఠశాలల్లో టీచర్ల కొరతను గుర్తించాలన్నారు. మండలంలో పని చేసే సీఆర్పీలు ఫీల్డ్ లెవల్లో స్కూల్‌కు వెళుతున్నారా, సకాలంలో నివేదికలు అందిస్తున్నారా అనే వివరాలు పరిశీలించాలని సూచించారు. విద్యా వలంటీర్లలను పాత వారినే కొనసాగించాలన్నారు. సమావేశంలో పరీక్షల నిర్వహణ అధికారి వి.వి. రామరావు తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఏపీలో రాజన్న బడిబాట
-
విద్యను వ్యాపారం చేస్తే సహించం: మంత్రి
సాక్షి, అమరావతి : రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా రాజన్న బడి బాట నిర్వహిస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 100 శాతం పిల్లలు స్కూళ్లలో చేరేలా చేస్తామన్నారు. మంత్రి మాట్లాడుతూ.. 'ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు నియంత్రించేందుకు కమిటీ వేస్తున్నాము. విద్యను వ్యాపారం చేస్తే సహించం. విద్యా సంస్కరణల కోసం నూతన విద్యా విధానాన్ని నిపుణులతో రూపొందిస్తాము. 2019 నుండి 2024 వరకు చేయబోయే మార్పులతో నూతన పాలసీ ఉంటుంది. అమ్మ ఒడి పథకాన్ని జనవరి 26 నుండి అమలు చేస్తాం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలి క్యాబినెట్ నిర్ణయాలతోనే విద్యావిధానంలో సంస్కరణలు మొదలయ్యాయి' అని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. -
జూన్ 4 నుంచి ‘బడిబాట’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జూన్ 1 నుంచి బడులు ప్రారంభం కానుండటంతో జూన్ 4 నుంచి 12 వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వí హించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం ప్రతి పాఠశాలకు రూ. 1,000 చొప్పున నిధులను ఇచ్చేలా జిల్లాల అధికారులకు పాఠశాల విద్య కమిషనర్ విజయ్ కుమార్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. కొన్ని ప్రధాన లక్ష్యాలతో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు. జూన్ 1 నుంచి 3 వరకు సంసిద్ధతా కార్యక్రమాలు నిర్వహించాలని, కలెక్టర్ల ఆధ్వర్యంలో సమన్వయ సమావేశాలు నిర్వహించి బడిబాట విజయవంతానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రజాప్రతినిధులను, స్వయం సహాయక బృందాల మహిళలను భాగస్వాములను చేసేలా ప్రణాళిక ఉండాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు సమావేశం నిర్వహించి 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న బాలికలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్ల పంపిణీ, పాఠశాలల్లో అమలు చేస్తున్న ఇతర కార్యక్రమాలను వివరించేలా పాఠశాల ప్రొఫైల్ రూపొందించుకొని బడిబాటలో వివరించాలన్నారు. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఇంటింటి ప్రచారం చేయాలని సూచించారు. మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీవో, ఎంఈవో, సహాయక కార్మిక అధికారి, స్వచ్ఛంద సంస్థలు, బాలికా శిశు సంక్షేమ పర్యవేక్షకులు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్లతో టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని, బాలకార్మికులు లేకుండా ఈ కమిటీలు చూడాలని స్పష్టం చేశారు. విద్యార్థుల హక్కులకు సంబంధించిన సమస్యలను తెలియజేసేందుకు ప్రతి పాఠశాలలో, నోటీసు బోర్డులో టోల్ ఫ్రీ నంబర్ 18004253525 పొందుపరచాలని వివరించారు. పదవీవిరమణ పొందిన ఉపాధ్యాయులు/లెక్చరర్లు/ప్రొఫెసర్లు/ఉద్యోగులను బడిబాట చివరి రోజున ఆహ్వానించి వారికి పాఠశాలల అవసరాలను తెలియజెప్పి వారి సేవలను పొందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే వచ్చే నెల 4న మన ఊరి బడి, 7న బాలికా విద్య, 10న సామూహిక అక్షరాభ్యాసం, 11న స్వచ్ఛ పాఠశాల/హరితహారం, 12న పాఠశాల యాజమాన్య కమిటీల డోర్ టు డోర్ సర్వే/ బాలకార్మిక విముక్తి వంటి కార్యక్రమాలు చేపట్టాలని వివరించారు. ఇవీ బడిబాట ప్రధాన లక్ష్యాలు... ►అన్ని ఆవాస ప్రాంతాల్లో బడి ఈడు గల పిల్లలను గుర్తించి సమీప పాఠశాలల్లో చేర్పించడం ►ప్రభుత్వ బడుల్లో ఎన్రోల్మెంట్ పెంచడం ►నాణ్యమైన విద్యను అందించడం ►కమ్యూనిటీ భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ►అంగన్వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు నిండిన పిల్లలను ప్రభుత్వబడుల్లో చేర్పించడం ►విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ అప్డేట్ చేయడం ►ఐదో తరగతి పూర్తయినవారిని ఆరో తరగతిలో, ఏడో తరగతి పూర్తయిన వారిని 8వ తరగతిలో చేర్పించడం ►బాలికా విద్య ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ బాలికలు పాఠశాలల్లో చేరేలా చర్యలు చేపట్టడం ►బడి బయట పిల్లలను గుర్తించి బడుల్లో చేర్పించడం -
బడి‘బాట’ పట్టేనా..
ఆదిలాబాద్‌టౌన్: బడీడు పిల్లలకు బడి ‘బాట’ వేసేందుకు విద్యాశాఖ సర్వే చేపట్టనుంది. బాలకార్మికులు పని లోకాదు..బడిలో ఉండాలనే లక్ష్యంతో ఏటా చేపడుతున్న సర్వే ఆశించిన మేర ఫలితం ఇవ్వడం లేదనే విమర్శలు లేకపోలేదు. నివేదిక సమర్పించి అధికారులు చేతులుదులుపుకుంటున్నారు తప్పితే పిల్లలను బడిలో చేర్పించడానికి శ్రద్ధచూపడం లేదు. ఏటా బడిబయట పిల్లలకోసం విద్యాశాఖ సర్వే చేపడుతోంది. ఈసారి కూడా బడిదూరంగా ఉన్న వారి లెక్కతేల్చేందుకు మళ్లీ వివరాలు సేకరించనుంది. ఈ ప్రక్రియ ఈనెల 24 నుంచి 28 వర కు నిర్వహించనుంది. అయితే ఏటా సర్వే చేపడుతున్నా బడిబయట పిల్లల్ని బడిబాట పట్టించడంలో అధికా రులు విఫలమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది మెప్మా, సెర్ప్ సిబ్బందితో బడిబయట ఉన్న పిల్లల సర్వే చేపట్టారు. అయితే వారు పూర్తిస్థాయిలో సర్వే చేçపట్టకుండా ముగించేశారు. బడిబయట పిల్లలు చెత్తకుప్పల్లో ప్లాస్టిక్ ఏరుతూ, హోటళ్లలో పని చేస్తూ కనిపించారు. ఈఏడాది మళ్లీ విద్యాశాఖ బడిబయటి పిల్లల సర్వేకు సిద్ధమైంది. ఈనెల24 నుంచి 28వ తేదీ వరకు సర్వే కొనసాగించనున్నారు. సర్వేలో గుర్తించిన పిల్లల్ని పాఠశాలల్లో, కేజీబీవీల్లో, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో, రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్, నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లలో చేర్పించి విద్యాబోధన చేయిం చేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. ఈసారైనా సర్వే పకడ్బందీగా నిర్వహిస్తే బడిబయటి పిల్లలు బడిలో చేరి అక్షరాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. గాలి లెక్కలు..ఐకేపీ, సెర్ప్ సిబ్బంది పూర్తిస్థాయిలో సర్వే చేపట్టకుండా ఇళ్లకే పరిమితమై లెక్కలు వేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో కేవలం 196 మంది పిల్లలు బడిబయట ఉన్నారని వారు నివేదిక సమర్పించారు. అయితే జిల్లాలో దాదాపు వందలసంఖ్యలో బడిబయట పిల్లలు దర్శనమిస్తున్నారు. ఇటుకబట్టీలు, లాడ్జీలు, హోటళ్లు తదితర వ్యాపార సముదాయాల్లో పనులు చేస్తున్నారు. వారు నిర్వహించిన సర్వే వివరాల ప్రకారం.. తాంసి మండలంలో ఒకరు, గాదిగూడలో ఒకరు, మావలలో నలుగురు, నార్నూర్‌లో ఐదుగురు, బోథ్‌లో ఐదుగురు, ఆదిలాబాద్ రూరల్ మండలంలో ఆరుగురు, భీంపూర్‌లో 8, గుడిహత్నూర్‌లో 22, ఇచ్చోడలో 8, నేరడిగొంలో 14, ఉట్నూర్‌లో 23, ఆదిలాబాద్ పట్టణంలో 85 మంది, బజార్హత్నూర్లో 14 మంది మొత్తం 196 మంది చిన్నారులు బడిబయట ఉన్నట్లు సర్వే నివేదిక సమర్పించారు. ఇందులో బాలురు 100 మంది, బాలికలు 96 మంది ఉన్నట్లు తేల్చారు. వారంరోజులపాటు సర్వే జిల్లాలో గతేడాది నిర్వహించిన సర్వేలో 196 మంది బడిబయట పిల్లలు ఉండగా, వారిలో 58 మంది బడిబాటపట్టించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. వీరిలో ఆడపిల్లలు 31 మంది, మగపిల్లలు 27 మందిని చేర్పించినట్లు చెబుతున్నారు. అయితే మిగతా 132 మంది పిల్లలు బడిలో ఉన్నారా..బడి బయట ఉన్నారా.. పాఠశాలల్లో నెలరోజుల కంటే ఎక్కువ హాజరుకాని విద్యార్థుల వివరాలు సేకరించనున్నారు. నెలరోజుల నుంచి బడికి రానట్లయితే వారిని కూడా బడిబయట పిల్లలుగానే పరిగణించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ సర్వేను సీఆర్పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, ఎంఈవో కార్యాలయంలో పని చేసే డాటాఎంట్రీ ఆపరేటర్లు, భవిత రిసోర్స్ సెంటర్లలో పని చేసే ఐఈఆర్పీలు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో పని చేసే సీఆర్టీలతో సర్వే చేపడతారు. ఈ వివరాలు సేకరించిన అనంతరం బడిబయట పిల్లల్ని బడిలో చేర్పించనున్నారు. 11 నుంచి 14 ఏళ్లలోపు ఉన్న ఆడపిల్లల్ని కేజీబీవీలో, మగపిల్లల్ని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పించి విద్య బోధించనున్నారు. కాగా కొత్తగా నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లు, రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి బడిబయటి పిల్ల లకు విద్యాబోధన చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈసారైనా సక్రమంగా జరిగేనా.. జిల్లావ్యాప్తంగా దాదాపు వెయ్యి మందికిపైగా బడిబయట పిల్లలు ఉండగా సర్వేలు సక్రమంగా నిర్వహించకపోవడంతో ఆయామండలాల్లో పదు ల సంఖ్యలోనే పిల్లలు ఉన్నట్లు నివేదిక సమర్పిం చారు. బడిలో చేర్పించిన అనంతరం ఆ పిల్లల గురించి పట్టించుకోకపోవడంతో చాలా మంది మధ్యలోనే డ్రాపౌట్ అవుతున్నారు. పిల్లలను బడిబాటపట్టించే లక్ష్యం నీరుగారుతోంది. -
మొక్కు'బడిబాట'
నెల్లూరు (టౌన్): పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటించిన వెంటనే విద్యాశాఖ ఉన్నతాధికారులు మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు జిల్లాలో డ్రౌపౌట్స్ సంఖ్య తగ్గించడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. అయితే ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు మన ఊరు – మనబడి కార్యక్రమాన్ని మొక్కబడిగా నిర్వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బడి మానేసిన వారిని రప్పించడం లేదా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపుపై దృష్టి సారించడం లేదు. ఫలితంగా బడి బయట పిల్లల సంఖ్య ఏటా పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. సంఖ్యను పెంచేందుకు పలు పథకాలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టింది. పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, ఉచితంగా ఏడాదికి రెండు జతల యూనిఫారం, గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు కిలోమీటర్ల దూరం, ఆపై నుంచి వచ్చే విద్యార్థులకు ప్రయాణ ఖర్చులను చెల్లిస్తున్నారు. తొమ్మిదో తరగతి బాలికలకు ఉచితంగా సైకిళ్లు, పేద విద్యార్థులకు ఉపకార వేతనాలను అందిస్తున్నారు. ప్రభుత్వానికి తోడు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా సహకారాన్ని అందిస్తున్నాయి. అయితే ఇన్ని అమలు చేస్తున్నా ఏటా బడి మానేసే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. జిల్లాలో ఇదీ సంఖ్య చదువుకు దూరంగా ఉన్న పిల్లలు నెల్లూ రు నగరంలోనే 4505 మంది ఉన్నట్లు సర్వశిక్ష అభియాన్ అధికారులు గుర్తిం చారు. తడలో 1499, కావలిలో 886, గూడూరులో 799, వెంకటాచలంలో 517, వెంకటగిరిలో 528, ఉదయగిరిలో 472, కోవూరులో 517, సూళ్లూరుపేటలో 489, వింజమూరులో 448, రాపూరులో 496 మందితో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు. మన ఊరు మన బడిజూన్కు వాయిదా వాస్తవానికి ఏప్రిల్‌లో నిర్వహించాల్సిన మన ఊరు మన బడి కార్యక్రమాన్ని జూన్ 4వ తేదీకి వాయిదా వేశారు. వారం రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రధానంగా అంగన్వాడీల్లో చదువుతున్న పిల్లలను ప్రీ ప్రైమరీ నుంచి ప్రైమరీ స్కూళ్లలో చేర్పించడం, ప్రాథమిక స్కూళ్లలో చదువు పూర్తయిన వారిని హైస్కూళ్లలో చేర్పించడం, బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించడం కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. బడి బయట పిల్లలను గుర్తిస్తాం మన ఊరు – మనబడి కార్యక్రమ ముఖ్య ఉద్దేశం డ్రాపౌట్ పిల్లలను తగ్గించడం. కార్యక్రమాన్ని వారం పాటు నిర్వహిస్తాం. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో తిరిగి బడికి దూరంగా ఉన్న పిల్లలను గుర్తించి వారిని తప్పకుండా బడిలో చేర్పిస్తాం. పేదరికం కారణంగానే పేద పిల్లలు చదువుకు దూరమవుతున్నారు.– విశ్వనాథ్, ప్రాజెక్ట్ అధికారి,సర్వశిక్ష అభియాన్ జిల్లాలో 8915 మంది చదువుకు దూరం గ్రామీణ ప్రాంతాల్లో తొమ్మిది లేదా పదో తరగతి చేరకముందే విద్యార్థులు మధ్యలో బడి మానేస్తున్నారు. కుటుంబ పరిస్థితులు, లేదా కుటుంబభారాన్ని మోసేందుకు గానూ పనులకెళ్తున్నారు. వీరిలో బాలికల శాతం అధికంగా ఆరు శాతం మేర పెరుగుతోంది. తొమ్మిది శాతం మంది బాలురు చదువు మానేసి పనులకు వెళ్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఆరు నుంచి 14 ఏళ్లలోçపు 8915 మంది విద్యార్థులు చదువుకు దూరంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రీ సర్వే పూర్తి కాకపోవడంతో సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 2017 – 18 విద్యా సంవత్సరంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాసాధికార సర్వేలో 22912 మంది పిల్లలు ఉన్నట్లు లెక్కలు తేల్చారు. అయితే సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో సీఆర్పీలు, పార్ట్‌టైమ్ ఇన్స్ట్రక్టర్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఐఈఆర్టీలు రీ సర్వే నిర్వహించారు. రెవెన్యూ అధికారుల డేటా అధారంగా ఇప్పటి వరకు 16108 మంది పిల్లలపై సర్వే నిర్వహించారు. వీరిలో 8915 మంది పిల్లలు చదువుకు దూరంగా ఉన్నట్లు గుర్తించారు. ఇంకా 6804 మంది పిల్లలపై సర్వే నిర్వహించాల్సి ఉంది. ఇప్పుడున్న సంఖ్య కంటే బడి బయట పిల్లల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. -
పని చేస్తే రివార్డులు.. లేదంటే చర్యలు!
డీఈవోల సమావేశంలో కడియం నేటి నుంచి 13 వరకు బడిబాట సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈనెల 3 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించే బడిబాటలో టీచర్లు బాగా పని చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులను చేర్పించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు. బాగా పని చేసిన వారిని సన్మానిస్తామని, పనిచేయని వారిపై చర్యలు చేపడతామని హెచ్చరించారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు లేవని, ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగ్గా తీర్చిదిద్దుతున్న తీరును బడిబాటలో వివరించాలని పేర్కొన్నారు. నేటి నుంచి ప్రారంభం కానున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం, ఈ విద్యా సంవత్సరంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఆదివారం హైదరాబాద్‌లో డీఈవోలతో సమీక్ష నిర్వహించారు. బడిబాటలో ప్రజా ప్రతినిధులను, అధికారులను భాగస్వాములను చేయాల ని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెరిగేలా, నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. డీఈవోలు తమ పరిధిలోని స్కూళ్లను స్వయంగా తనిఖీ చేసి, సమస్యలపై ఈనెల 20లోగా నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఈనెల 15 లోగా విద్యార్థులందరికీ పుస్తకాలు, జూన్ 15వ తేదీ లోగా యూనిఫారాలు అందజేయాలని, ఇందుకోసం అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని సూచించారు. విద్యా వలంటీర్లను నియమించండి పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మరో 6నెలలు పడుతుందని, అప్పటివరకు వేచిచూడకుండా జూన్‌లోగా స్కూళ్లలో విద్యా వలంటీర్లను నియమించాల ని అధికారులను ఆదేశించారు. ఏకీకృత సర్వీసు రూల్స్ వచ్చాక పదోన్నతులు కల్పిస్తామని తెలిపారు. అన్ని కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో డిజిటల్ తరగతు లను ప్రారంభిస్తామన్నారు. మధ్యాహ్న భోజన బిల్లులు, వంట వారి వేతనాలను ప్రతి నెలా 10 లోగా చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల కాగ్ ఇచ్చిన నివేదిక మేరకు ఐదేళ్ల నుంచి 25 ఏళ్లలోపు వయస్సున్న వారి అక్ష రాస్యత జాతీయ సగటు కంటే తెలంగాణలో ఎక్కువ ఉందని, ఇది సంతోషకర విషయ మని చెప్పారు. విద్యా ర్థుల నమోదు, కొనసాగింపులోనూ రాష్ట్రం మంచి స్థానం లో ఉందని, ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగవుతు న్నాయని కూడా కాగ్ పేర్కొన్నట్లు వివరించారు. గురుకు లాల్లో పరిస్థితి ఇంకా మెరుగు పడాల్సిఉందన్నారు. నిర్దేశించిన కార్యక్రమాల పురోగతిపై మేలో మరోసారి డీఈవోలతో సమావేశం నిర్వహిస్తానన్నారు. వేసవి సెలవుల తరువాత పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి అన్ని చోట్లా... బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు అందుబాటులో ఉంచాలని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వాటి సంఖ్య పెంచాలని ఇంజనీ రింగ్ అధికారులకు సూచించారు. సమావేశంలో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ పాల్గొన్నారు.