ఆదిలాబాద్‌టౌన్: బడీడు పిల్లలకు బడి ‘బాట’ వేసేందుకు విద్యాశాఖ సర్వే చేపట్టనుంది. బాలకార్మికులు పని లోకాదు..బడిలో ఉండాలనే లక్ష్యంతో ఏటా చేపడుతున్న సర్వే ఆశించిన మేర ఫలితం ఇవ్వడం లేదనే విమర్శలు లేకపోలేదు. నివేదిక సమర్పించి అధికారులు చేతులుదులుపుకుంటున్నారు తప్పితే పిల్లలను బడిలో చేర్పించడానికి శ్రద్ధచూపడం లేదు. ఏటా బడిబయట పిల్లలకోసం విద్యాశాఖ సర్వే చేపడుతోంది. ఈసారి కూడా బడిదూరంగా ఉన్న వారి లెక్కతేల్చేందుకు మళ్లీ వివరాలు సేకరించనుంది. ఈ ప్రక్రియ ఈనెల 24 నుంచి 28 వర కు నిర్వహించనుంది.
అయితే ఏటా సర్వే చేపడుతున్నా బడిబయట పిల్లల్ని బడిబాట పట్టించడంలో అధికా రులు విఫలమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది మెప్మా, సెర్ప్ సిబ్బందితో బడిబయట ఉన్న పిల్లల సర్వే చేపట్టారు. అయితే వారు పూర్తిస్థాయిలో సర్వే చేçపట్టకుండా ముగించేశారు. బడిబయట పిల్లలు చెత్తకుప్పల్లో ప్లాస్టిక్ ఏరుతూ, హోటళ్లలో పని చేస్తూ కనిపించారు.
ఈఏడాది మళ్లీ విద్యాశాఖ బడిబయటి పిల్లల సర్వేకు సిద్ధమైంది. ఈనెల24 నుంచి 28వ తేదీ వరకు సర్వే కొనసాగించనున్నారు. సర్వేలో గుర్తించిన పిల్లల్ని పాఠశాలల్లో, కేజీబీవీల్లో, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో, రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్, నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లలో చేర్పించి విద్యాబోధన చేయిం చేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. ఈసారైనా సర్వే పకడ్బందీగా నిర్వహిస్తే బడిబయటి పిల్లలు బడిలో చేరి అక్షరాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది.
గాలి లెక్కలు..ఐకేపీ, సెర్ప్ సిబ్బంది పూర్తిస్థాయిలో సర్వే చేపట్టకుండా ఇళ్లకే పరిమితమై లెక్కలు వేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో కేవలం 196 మంది పిల్లలు బడిబయట ఉన్నారని వారు నివేదిక సమర్పించారు. అయితే జిల్లాలో దాదాపు వందలసంఖ్యలో బడిబయట పిల్లలు దర్శనమిస్తున్నారు. ఇటుకబట్టీలు, లాడ్జీలు, హోటళ్లు తదితర వ్యాపార సముదాయాల్లో పనులు చేస్తున్నారు.
వారు నిర్వహించిన సర్వే వివరాల ప్రకారం.. తాంసి మండలంలో ఒకరు, గాదిగూడలో ఒకరు, మావలలో నలుగురు, నార్నూర్‌లో ఐదుగురు, బోథ్‌లో ఐదుగురు, ఆదిలాబాద్ రూరల్ మండలంలో ఆరుగురు, భీంపూర్‌లో 8, గుడిహత్నూర్‌లో 22, ఇచ్చోడలో 8, నేరడిగొంలో 14, ఉట్నూర్‌లో 23, ఆదిలాబాద్ పట్టణంలో 85 మంది, బజార్‌హత్నూర్‌లో 14 మంది మొత్తం 196 మంది చిన్నారులు బడిబయట ఉన్నట్లు సర్వే నివేదిక సమర్పించారు. ఇందులో బాలురు 100 మంది, బాలికలు 96 మంది ఉన్నట్లు తేల్చారు.
వారంరోజులపాటు సర్వే
జిల్లాలో గతేడాది నిర్వహించిన సర్వేలో 196 మంది బడిబయట పిల్లలు ఉండగా, వారిలో 58 మంది బడిబాటపట్టించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. వీరిలో ఆడపిల్లలు 31 మంది, మగపిల్లలు 27 మందిని చేర్పించినట్లు చెబుతున్నారు. అయితే మిగతా 132 మంది పిల్లలు బడిలో ఉన్నారా..బడి బయట ఉన్నారా.. పాఠశాలల్లో నెలరోజుల కంటే ఎక్కువ హాజరుకాని విద్యార్థుల వివరాలు సేకరించనున్నారు. నెలరోజుల నుంచి బడికి రానట్లయితే వారిని కూడా బడిబయట పిల్లలుగానే పరిగణించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సర్వేను సీఆర్పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, ఎంఈవో కార్యాలయంలో పని చేసే డాటాఎంట్రీ ఆపరేటర్లు, భవిత రిసోర్స్ సెంటర్లలో పని చేసే ఐఈఆర్పీలు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్‌లో పని చేసే సీఆర్టీలతో సర్వే చేపడతారు. ఈ వివరాలు సేకరించిన అనంతరం బడిబయట పిల్లల్ని బడిలో చేర్పించనున్నారు. 11 నుంచి 14 ఏళ్లలోపు ఉన్న ఆడపిల్లల్ని కేజీబీవీలో, మగపిల్లల్ని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పించి విద్య బోధించనున్నారు. కాగా కొత్తగా నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లు, రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి బడిబయటి పిల్ల లకు విద్యాబోధన చేసేందుకు చర్యలు చేపట్టారు.
ఈసారైనా సక్రమంగా జరిగేనా..
జిల్లావ్యాప్తంగా దాదాపు వెయ్యి మందికిపైగా బడిబయట పిల్లలు ఉండగా సర్వేలు సక్రమంగా నిర్వహించకపోవడంతో ఆయామండలాల్లో పదు ల సంఖ్యలోనే పిల్లలు ఉన్నట్లు నివేదిక సమర్పిం చారు. బడిలో చేర్పించిన అనంతరం ఆ పిల్లల గురించి పట్టించుకోకపోవడంతో చాలా మంది మధ్యలోనే డ్రాపౌట్ అవుతున్నారు. పిల్లలను బడిబాటపట్టించే లక్ష్యం నీరుగారుతోంది.
Comments
Please login to add a commentAdd a comment