సాక్షి, హైదరాబాద్: వీధి బాలలు, చదువుకు దూరమైన పిల్లలను బడిబాట పట్టించేందుకు ప్రభుత్వం జూన్ నెల మొత్తం యాక్షన్ ప్లాన్ ఖరారు చేసింది. అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు బుధవారం జిల్లా, మండల స్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించారు. అన్ని స్థాయిల ఉపాధ్యాయులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. అయితే, ఉపాధ్యాయ వర్గాల నుంచి దీనిపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. నెల మొత్తం శాఖాపరమైన విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులు బడిబాట పేరుతో గ్రామాలు, వీధుల్లో తిరగడం ఎలా కుదురుతుందని ప్రశ్నిస్తున్నారు. కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ఇప్పటికే పలు సంఘాల ప్రతినిధులు విద్యాశాఖను కోరారు. జిల్లా విద్యాశాఖాధికారులు కూడా ఉపాధ్యాయుల నుంచి వస్తున్న అభ్యంతరాలను కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లారు. అయితే, సమగ్ర శిక్షా విభాగం మాత్రం బడిబాట ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి తీరాలని మార్గదర్శకాలు జారీ చేసింది.
తీరికేది?
వాస్తవానికి స్కూళ్లకు వేసవి సెలవులు ఇచ్చిన తర్వాత, మళ్లీ రీ ఓపెనింగ్ సమయంలో బడిబాట నిర్వహించడం గతంలో జరిగేది. కానీ రెండేళ్లుగా కోవిడ్ మూలంగా బడిబాట సరిగా జరగలేదు. దీంతోపాటే కోవిడ్ వల్ల ఈ విద్యాసంవత్సరం ఆలస్యంగా మొదలైంది. దీంతో మార్చి, ఏప్రిల్‌లో జరగాల్సిన పదవ తరగతి పరీక్షలు ఈసారి మే 23 నుంచి జూన్ 1 వరకూ జరిగాయి. దీంతో టీచర్లు జూన్ మొదటి వారంలో టెన్త్ సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియే ఈ నెలాఖరు వరకు సాగుతుందని టీచర్లు అంటున్నారు. ఇలాంటి సందర్భంలో బడిబాటకు టీచర్లు వెళ్లడం సాధ్యం కాదని చెబుతున్నారు. దీనికితోడు ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్ష జరుగుతుంది. దీని నిర్వహణలోనూ ఉపాధ్యాయులే పాల్గొనాల్సి ఉంటుందనే వాదన తెరమీదకు తెచ్చారు.
ఆంగ్ల బోధనకు తర్ఫీదూ అడ్డంకే
ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచే 1–8 తరగతులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపట్టాలని నిర్ణయించింది. 26 వేల పాఠశాలల్లో దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది ఇప్పటికే కొంతమంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వగా, మరికొంతమంది శిక్షణ తీసుకోవాల్సి ఉంది. బడులు తెరిచేలోగా పాఠ్యాంశాలు ముందుగా చదివి ఇంగ్లిష్ బోధనకు సిద్ధం కావాల్సి ఉంటుందని, బడిబాట పేరుతో బయటకెళ్లడం సాధ్యం కాదని వారు అంటున్నారు.
బదిలీలు చేపడితే...
జూన్‌లో టీచర్ల బదిలీలు చేపడతామని విద్యాశాఖ మంత్రి అనేకసార్లు చెప్పడాన్ని ఉపాధ్యాయులు ప్రస్తావిస్తున్నారు. ఈ ప్రక్రియ చేపడితే ఎవరు ఎక్కడికి వెళ్తారో తెలియదు. ఆప్షన్లు ఇచ్చుకోవడం, బదిలీ అయ్యాక కొత్త ప్రాంతానికి వెళ్లి స్థిరపడటం వంటి ప్రక్రియలుంటాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇవన్నీ జూన్‌లోనే చేస్తామని చెబుతూ బడిబాట కార్యక్రమానికి షెడ్యూల్ ఇవ్వడం ఏమిటని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
వాయిదా వేస్తే నష్టమేంటి?
ఇంగ్లిష్ మీడియం విద్య సర్కారీ స్కూళ్లలో అందిస్తున్నారంటే ప్రతీ పేదవాడు తమ పిల్లలను ప్రభుత్వ స్కూలుకు పంపాలనే అనుకుంటాడు. మారుమూల పల్లెల్లో సైతం విద్యపై అవగాహన పెరిగింది. ఇప్పుడు టీచర్లను బడిబాట పేరుతో పరుగులు పెట్టించాల్సిన అవసరమే లేదు. పైగా టెన్త్ పేపర్ల మూల్యాంకనంతోపాటు అనేక ప్రభుత్వ విధుల్లో ఉపాధ్యాయులు పాల్గొనాల్సి ఉంది. అందువల్ల బడిబాటను వాయిదా వేస్తే వచ్చే నష్టమేంటి? జూలైలో నిర్వహిస్తే అందరికీ వెసులుబాటు ఉంటుంది.
– మహ్మద్ అబ్దుల్లా, తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment