సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఒక్క విద్యార్థి లేని పాఠశాలల సంఖ్య (జీరో ఎన్‌రోల్‌మెంట్) వందల్లో పెరిగింది. అలాగే విద్యార్థులు తగ్గిపోయిన స్కూళ్ల సంఖ్య కూడా పెరిగిపోయిందని సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) పేర్కొంది. దీంతో ఆయా పాఠశాలల్లో 8,883 మంది టీచర్లు సర్‌ప్లస్‌గా ఉన్నారని వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో వెంటనే పాఠశాలలు, టీచర్ల హేతుబద్ధీకరణ చేపట్టాలని పీఏబీ స్పష్టం చేసింది. ఎస్‌ఎస్‌ఏ 2020–21 విద్యా సంవత్సరపు పీఏబీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన లెక్కలను బట్టి కేంద్రం ఈ విషయాన్ని వెల్లడించింది. మరోవైపు రాష్ట్రంలో 17,873 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. అందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 11,517, ఉన్నత పాఠశాలల్లో 6,356 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించింది.
పీఏబీ లేవనెత్తిన అంశాలు..
- రాష్ట్రంలో ఒక్క విద్యార్థి లేని ప్రాథమిక పాఠశాలల సంఖ్య 1,097 పెరిగింది. అలాగే ఒక్క విద్యార్థి లేని ప్రాథమికోన్నత పాఠశాలల సంఖ్య 315కు పెరిగింది.
- ప్రాథమిక స్థాయిలో 15 మందిలోపు విద్యార్థులు ఉన్న స్కూళ్ల సంఖ్య 4,582 నుంచి 4,960కి పెరిగాయి.
- ప్రాథమికోన్నత స్థాయిలో 15 మందిలోపు విద్యార్థులు ఉన్న స్కూళ్లు 1,400 నుంచి 1,651కి పెరిగాయి.
- 30 మందిలోపు విద్యార్థులు ఉన్న స్కూళ్ల సంఖ్య 11,096కు పెరిగింది.
- ప్రాథమికోన్నత స్థాయిలో 30 మందిలోపే విద్యార్థులు ఉన్న పాఠశాలల సంఖ్య 2,809 నుంచి 3,085కు పెరిగాయి.
- ప్రాథమిక స్థాయిలో సింగిల్ టీచర్ ఉన్న స్కూళ్లు 4,372 నుంచి 4,448కి, ప్రాథమికోన్నత స్థాయిలో 127 నుంచి 168కి పెరిగాయి.
- దీంతో ఆయా పాఠశాలల్లో 8,883 మంది టీచర్లు అదనంగా (సర్‌ప్లస్) ఉన్నారు.
- మరోవైపు రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 11,517 టీచర్ పోస్టులు, ఉన్నత పాఠశాలల్లో 6,356 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- ఇక 84 శాతం ఉన్నత పాఠశాలల్లో మాత్రమే అన్ని ప్రధాన సబ్జెక్టులకు టీచర్లు ఉన్నారు. భాషా సబ్జెక్టుల్లో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి 41 కాగా, సైన్స్‌లో ప్రతి 37 మందికి ఒక టీచర్, మేథమెటిక్స్‌లో ప్రతి 54 మందికి ఒక టీచర్, సోషల్ స్టడీస్‌లో ప్రతి 73 మందికి ఒక టీచర్ ఉన్నారు.
∙ వందల సంఖ్యలో పెరిగిపోయిన ఒక్క విద్యార్థి లేని స్కూళ్లు
∙ తక్కువ మంది విద్యార్థులున్న స్కూళ్ల సంఖ్యలోనూ పెరుగుదల
∙ దీంతో ఆయా పాఠశాలల్లో 8 వేల మందికి పైగా సర్‌ప్లస్ టీచర్లు
∙ సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment